Soil transported illegally : మట్టినీ మేసేస్తున్నారు!
ABN, First Publish Date - 2023-12-07T04:11:20+05:30
ఎక్కడ అవకాశముంటే అక్కడ ‘దోచెయ్.. దాచెయ్!’ తరహా వ్యూహాన్ని వైసీపీ నాయకులు తూ.చ. తప్పకుండా అమలు చేసేస్తున్నారు.
గ్రావెల్ దోపిడీలో అనంత వైసీపీ నేతలు బిజీ
టిప్పర్‌కు 8 వేలు వసూలు.. లక్షల్లో ఆర్జన
గొందిరెడ్డిపల్లి గుట్టల్లో టిప్పర్ల హల్‌చల్
అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా స్పందన శూన్యం
నకిలీ బిల్లులతో అధికార పార్టీ నాయకుల దందా
రాప్తాడు, డిసెంబరు 6:ఎక్కడ అవకాశముంటే అక్కడ ‘దోచెయ్.. దాచెయ్!’ తరహా వ్యూహాన్ని వైసీపీ నాయకులు తూ.చ. తప్పకుండా అమలు చేసేస్తున్నారు.చివరికి మట్టిని కూడా వదలకుండా కాసుల పంట పండించుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని గొందిరెడ్డిపల్లి గుట్టలను వైసీపీ నాయకులు కొల్లగొడుతున్నారు. భారీ యంత్రాలతో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. అనంతపురం నగరం చుట్టూ ఉన్న రియల్ వెంచర్లకు ఈ మట్టిని అమ్మేస్తున్నారు. మట్టి మాఫియా వెనుక అధికారపార్టీవారు ఉండటంతో అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గొందిరెడ్డిపల్లి గుట్ట అనంతపురం నగరానికి 16 కి.మీ. దూరంలో ఉంటుంది. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ గుట్టపై వైసీపీ నాయకుల కన్నుపడింది. అప్పటి నుంచి మట్టి తరలించడం ప్రారంభించారు. ఎర్రమట్టికి అనంతపురంలో మంచి డిమాండ్ ఉండడంతో టిప్పరు ఎర్రమట్టిని రూ.8 వేలకు అమ్ముకుని లక్షల రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. మట్టిని నిరంతరం తరలిస్తుండటంతో గొందిరెడ్డిపల్లి గుట్ట గుండులా తయారైంది.
ఫిర్యాదు చేసినా..
టీడీపీ బస్సు యాత్ర సమయంలో మాజీ మంత్రి పరిటాల సునీత, ఆ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ తదితరులు గొందిరెడ్డిపల్లి గుట్టను పరిశీలించారు. వైసీపీ నాయకులు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం హంపాపురం, గొందిరెడ్డిపల్లి పరిధిలోని గుట్టల్లో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. మట్టి అక్రమ తరలింపును అడ్డుకోవాలని గొందిరెడ్డిపల్లి సర్పంచ్ మిడతల శీనయ్య(టీడీపీ) రెవెన్యూ, మైనింగ్ అధికారులకు, కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచ్ పేర్కొన్నారు.
దొంగ బిల్లులతో
మట్టి తరలింపు కోసం వైసీపీ నాయకులు దొంగ బిల్లులను వాడుతున్నారు. బుక్కరాయసముద్రం మండలం కేకే అగ్రహారం గ్రామం పేరిట ఉన్న బిల్లులను ఉపయోగించి.. గొందిరెడ్డిపల్లి గుట్ట నుంచి మట్టిని దోచుకుంటున్నారు. మైనింగ్ అధికారులు రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద అమిగోస్ మినరల్స్ సిబ్బంది ద్వారా చెక్‌పోస్టు ఏర్పాటు చేయించారు. ఈ చెక్‌పోస్టు వద్ద టిప్పర్ డ్రైవర్లు కేకే అగ్రహారం నుంచి అనంతపురానికి మట్టిని తరలిస్తున్నట్లు బిల్లులు చూపిస్తున్నారు. కానీ, కేకే అగ్రహారం నుంచి మట్టిని తరలిస్తే రామినేపల్లి మీదుగా వాహనాలు రావాల్సిన అవసరం లేదు. బుక్కరాయసముద్రం మీదుగా నేరుగా అనంతపురం నగరంలోకి రావచ్చు. ఎర్రమట్టిని రాప్తాడు మండలంలోని గొందిరెడ్డిపల్లి గుట్టల నుంచే అనంతపురానికి తరలిస్తున్నారనేందుకు, ఆ బిల్లులు దొంగవని చెప్పేందుకు ఇదే నిదర్శనమని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
Updated Date - 2023-12-07T04:36:36+05:30 IST