రూల్స్ పాటించకుండా గందరగోళం సృష్టించారు!
ABN, First Publish Date - 2023-01-06T04:10:51+05:30
‘‘చిత్తూరు ఎస్పీ, పలమనేరు డీఎస్పీ కుప్పంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు. టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు.
చిత్తూరు ఎస్పీ, పలమనేరు డీఎస్పీపై చర్యలు తీసుకోండి: డీజీపీకి చంద్రబాబు లేఖ
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ‘‘చిత్తూరు ఎస్పీ, పలమనేరు డీఎస్పీ కుప్పంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు. టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు. అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయించారు. నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు. వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రూల్స్ పాటించకుండా అనవసరంగా గందరగోళం సృష్టించారని డీఎస్పీ సుధాకర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కుప్పం ప్రజలతో తాను సమావేశమయ్యేందుకు తగిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు గురువారం డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ‘‘నా నియోజకవర్గం కుప్పం ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు మూడు రోజుల పర్యటన పెట్టుకున్నా. కుప్పం టూర్ గురించి పోలీసులకు, సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చాం. ప్రజలనుద్దేశించి ప్రసంగించేందుకు మైక్ అనుమతుల కోసం డీఎస్పీ సుధాకర్‌రెడ్డికి దరఖాస్తు చేశాం. కానీ జీవో.1 ప్రకారం అనుమతులు నిరాకరిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. నా ప్రచార రథాన్ని, మైక్‌సిస్టమ్ ఉన్న మరో వాహనాన్ని ఎస్పీ, డీఎస్పీ అక్రమంగా తీసుకెళ్లి, గుడుపల్లి పోలీ్‌సస్టేషన్‌లో పెట్టారు. గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసుకుంటామని నా పీఏ చేసిన విన్నపాన్ని తోసిపుచ్చారు. డీఎస్పీ నోటీసులో పేర్కొన్నట్లుగా మా సభ స్థలాలు రహదారులపై లేవు. అయినా అనుమతి ఇవ్వకపోగా, నా పీఏకు నోటీసులు జారీ చేశారు. నాకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. నన్ను 3గంటల పాటు నడిరోడ్డుపై నిలబెట్టారు. గతంలో కూడా నా టూర్‌లో ఎస్పీ సరైన భద్రత ఏర్పాటు చేయకుండా శాంతిభద్రతలకు విఘాతం కల్పించారు. ఇప్పుడు కుప్పంలో ప్రజలతో భేటీ కాకుండా అడ్డంకులు సృష్టించారు. అమాయక ప్రజలపై లాఠీచార్జి చేశారు. నాకు సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న ప్రజలు, కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతూ భయాందోళనలకు గురి చేస్తున్నారు’’ అని డీజీపీకి ఫిర్యాదు చేశారు. అక్రమంగా తీసుకెళ్లిన తన వాహనాలను తిరిగి అప్పగించి, సభలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తానని డీఎస్పీ వాగ్దానం చేశారని, 3గంటల పాటు రోడ్డుపై వేచి ఉన్నా డీఎస్పీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తన పర్యటన షెడ్యూల్ మార్చుకోవాల్సి వచ్చిందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. చిత్తూరు ఎస్పీపైన, చట్ట వ్యతిరేకంగా అనేక తప్పులకు పాల్పడ్డ పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, సీఎం జగన్ డైరెక్షన్‌లో డీజీపీ ఓవరాక్షన్ చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కందుకూరు టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావును అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
Updated Date - 2023-01-06T04:10:51+05:30 IST