Tollywood: సినీ పరిశ్రమ ఏపీకి రావాలని, స్టూడియోలకు స్థలాలిస్తామని కబుర్లు.. కానీ రియాల్టీ మాత్రం..
ABN, First Publish Date - 2023-01-05T16:05:49+05:30
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమను నిర్లక్ష్యం చేస్తున్నారా..? సినిమా వాళ్లకు అన్ని విధాలా సహకరిస్తామని చెబుతూనే అడ్డంకులు సృష్టిస్తున్నారా..? బాలయ్య సినిమా ‘వీరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) సినీ పరిశ్రమను (Tollywood) నిర్లక్ష్యం చేస్తున్నారా..? సినిమా వాళ్లకు అన్ని విధాలా సహకరిస్తామని చెబుతూనే అడ్డంకులు సృష్టిస్తున్నారా..? బాలయ్య సినిమా (Balakrishna Cinema) ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో సందిగ్ధతకు తెరపడినప్పటికీ గందరగోళానికి కారణమెవరు..? తెలంగాణ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏపీ ప్రభుత్వం టాలీవుడ్‌పై వివక్ష చూపితోందా..? సంక్రాంతికి విడుదల కాబోతున్న పెద్ద హీరోల సినిమాలపై (Sankanti Movies) ఏపీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది..? టాలీవుడ్ విషయంలో జగన్ సర్కార్ అవలంబిస్తున్న వైఖరిపై ప్రత్యేక కథనం.
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సినిమా టికెట్ రేట్లపై హుకుంలు జారీ చేయడం, స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం.. పవన్ కల్యాణ్ సినిమాలు (Pawan Kalyan Movies) విడుదలైతే పనిగట్టుకుని మరీ అడ్డంకులు సృష్టించడం.. ఇలా టాలీవుడ్‌తో వైసీపీ ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటివరకూ వివాదాలను కొనసాగిస్తూనే వచ్చింది. చిరంజీవి (Chiranjeevi) వంటి సీనియర్ నటులు ముందడుగు వేసి మహేష్ బాబు (Mahesh Babu), ప్రభాస్ (Prabhas) వంటి ఈతరం నటులను వెంటబెట్టుకుని మరీ జగన్‌తో భేటీ అయిన సందర్భాన్ని చూశాం. అప్పుడు జగన్ టాలీవుడ్‌పై (Jagan Tollywood) ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నట్టు మాట్లాడారు. ‘మీరు ఏపీకి వచ్చేయండి.. స్టూడియోలు కట్టుకునేందుకు మేం స్థలాలిస్తాం.. ఆ రాయితీ ఇస్తాం.. ఈ వెసులుబాటు కల్పిస్తాం’ అని సినీ ప్రముఖులకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ మురిపించారు. ఆరోజు టాలీవుడ్ ప్రముఖులతో జగన్ చెప్పిన ఈ ముచ్చట్లన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయాయి.
స్టూడియోలకు స్థలాలివ్వడం సంగతి అటుంచితే.. కనీసం ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ల నిర్వహించుకునే విషయంలో కూడా టాలీవుడ్‌ను జగన్ సర్కార్ ఇబ్బంది పెడుతుండటం గమనార్హం. నిర్వాహకులకు పోలీసులు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల దాదాపు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఒంగోలులో బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేదిక మార్చాల్సి రావడం గమనార్హం. అప్పటికే.. దాదాపు పూర్తయిన వేదికను తొలగించాల్సి వచ్చింది. అయితే ప్రత్యామ్నాయ స్థలం చూసుకోండి అంటూ జనవరి 4న రాత్రి పొద్దుపోయిన తర్వాత షరతులతో కూడిన అనుమతులు పోలీసుశాఖ నుంచి లభించడం కొసమెరుపు. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకలకు నిర్వాహకులు ఎంపిక చేసుకున్న ఏబీఎం గ్రౌండ్‌లో అనుమతులు ఇచ్చేందుకు తొలుత పోలీసుశాఖ నిరాకరించింది.
జనవరి 6న ఒంగోలులోని ఏబీఎం కాలేజి గ్రౌండ్‌లో జరుగుతున్న కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతంలో సరైన పార్కింగ్ ప్రదేశం లేకపోవడంతో అనుమతి ఇవ్వలేదని ఎస్పీ మలికగర్గ్ తెలిపారు. సుమారు 40 వేల మంది వచ్చే అవకాశం ఉందని, గ్రౌండ్ చుట్టు పక్కల హాస్పటల్స్, రైల్వేస్టేషన్, చర్చిలాంటి ప్రదేశాలు ఉన్నాయిని, నిరంతరం ప్రజల సంచారం ఉంటుదన్నారు. నిర్వాహకులు మంగళవారం అనుమతి కోరుతు లెటర్ ఇచ్చారని, వెంటనే డీఎస్పీ వెళ్ళి పరిశీలించారని, బుధవారం అదనపు ఎస్పీని పంపించడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. అక్కడ పూర్తిగా పరిశీలన చేసిన తరువాత అంత అనువువగా లేదని నిర్వాహకులకు చెప్పామని, అంతేగాకుండా రాతపూర్వకంగా తెలియజేస్తామని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నగర శివారు ప్రాంతాలలో నిర్వహించుకోవాలని ఎస్పీ వెల్లడించారు.
ఈలోపు ఏం జరిగిందంటే..
ఏబీఎం గ్రౌండ్‌లో (ABM Ground Ongole) బాలకృష్ణ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు అనుమతి ఇవ్వవద్దని హోంమంత్రి తానేటి వనిత స్వయంగా జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్‌కు ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే, దర్శకుడు గోపీచంద్ ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన రంగంలోకి దిగి కార్యక్రమ నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని పట్టుబట్టారు. పోలీసు అధికారులు మధ్యేమార్గంగా వేరే స్థలంలో అయితే అనుమతి ఇస్తామని చెప్పటంతో నిర్వాహకులు సాయంత్రానికి ప్రత్యామ్నాయ స్థలం చూసుకున్నారు. కార్యక్రమం ఏబీఎం గ్రౌండ్ నుంచి అర్జున్ ఇన్‌ఫ్రా గ్రౌండ్‌కు (Arjun Infra Ground) మార్చారు. ఇందుకు ఏఎస్పీ, డీఎస్పీలు మౌఖికంగా పూర్తిస్థాయిలో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటమే గాక బందోబస్తు ఏర్పాట్లపై నిర్వాహకులతో చర్చించారు. కాగా, ఒకానొక దశలో ఒంగోలు నుంచి తెలంగాణలోని వరంగల్‌కు వేదిక మార్చాలని చిత్ర యూనిట్ నిర్ణయించినా, చివరికి ఒంగోలులోనే జరపడానికి హైదరాబాద్ నుంచి యూనిట్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అర్జున్ ఇన్‌ఫ్రా గ్రౌండ్‌లో ఏర్పాట్లను ప్రారంభించారు. ఏబీఎం నుంచి సామగ్రిని ఇన్‌ఫ్రాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కే ఇంత గందరగోళం సృష్టిస్తే..
ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించుకోవడానికే ఇంత గందరగోళం సృష్టిస్తే ఇక టాలీవుడ్ ఏ ధైర్యంతో ఏపీకి తరలివస్తుందని సినీ వర్గాల పెద్దలు వాపోతున్నారు. బాలకృష్ణ సినిమాకు మాత్రమే కాదు చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా ఇదే గందరగోళం. సంక్రాంతి పండుగకు విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాల స్పెషల్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తుందో.. లేదో అనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకరు చంద్రబాబుకు బావమరిది కావడం, మరొకరు పవన్ కల్యాణ్‌కు అన్నయ్య కావడంతో జగన్ సర్కార్ కత్తి కట్టే అవకాశం లేకపోలేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టాలీవుడ్‌కు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నా జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రతీ విషయంలోనూ మోకాలడ్డటం చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-01-05T16:22:36+05:30 IST