ట్రూఅప్ భవిష్యత్ తరాలకు ప్రమాదం
ABN, First Publish Date - 2023-06-14T03:35:37+05:30
ట్రూఅ్‌పలు, స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు రాబోయే తరాలకు అత్యంత ప్రమాదకరంగా మారతాయని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. విద్యుత్ చార్జీలు తగ్గించాల్సింది ..
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో అదనపు భారం
త్వరలో విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక ఏర్పాటు
విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయం
విజయవాడ, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ట్రూఅ్‌పలు, స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు రాబోయే తరాలకు అత్యంత ప్రమాదకరంగా మారతాయని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. విద్యుత్ చార్జీలు తగ్గించాల్సింది పోయి నెలనెలా పెంచుతున్నారని, దీనిపై పోరాటానికి విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదికను ఏర్పాటుచేసి, రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం అందరినీ విద్యుత్ బాధితులుగా మార్చేసిందని విమర్శించారు. 2014-19లో ఉపయోగించిన విద్యుత్‌కు ట్రూఅప్ చార్జీలు వసూలు చేయడం దారుణమన్నారు.
ట్రూఅప్ పేరిట రూ.2,900 కోట్లను ఇప్పటివరకు 11 నెలలపాటు వసూలు చేశారన్నారని, మరో 25 నెలలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. నెలకు యూనిట్‌కు 20 పైసల చొప్పున వడ్డిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2021 మేలో ఉపయోగించిన విద్యుత్‌కు మరో ట్రూఅప్ చార్జీని విధించారన్నారు. ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం వినియోగదారులను మూడు పోట్లు పొడిచిందని ధ్వజమెత్తారు. విద్యుత్ సుంకం పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు రాబోయే తరాలకు ప్రమాదమని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. దీని కోసం విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో ఆన్‌లైన్‌లో ఒక సమావేశం నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Updated Date - 2023-06-14T04:11:28+05:30 IST