TTD board : 24 మందితో టీటీడీ బోర్డు
ABN, First Publish Date - 2023-08-26T03:04:57+05:30
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యులను నియమించారు. మొత్తం 24 మంది సభ్యుల్లో ఏడుగురికి మళ్లీ అవకాశం కల్పించారు. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర రెడ్డి ఈనెల 10వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 15
పనికొచ్చే వారి స్థానాలు పదిలం
రాజకీయ ప్రాబల్యం ఉన్న వారికే చోటు
తమిళనాడు నుంచి నలుగురు
మహారాష్ట్ర నుంచి ముగ్గురు
తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణికీ అవకాశం
మొత్తం ఏడుగురికి మళ్లీ చాన్స్
‘లిక్కర్ స్కామ్’ శరత్‌కూ పదవి
ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకూ చోటు
అమరావతి/తిరుపతి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యులను నియమించారు. మొత్తం 24 మంది సభ్యుల్లో ఏడుగురికి మళ్లీ అవకాశం కల్పించారు. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర రెడ్డి ఈనెల 10వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 15 రోజులకు పాలకమండలి సభ్యులను ప్రభుత్వం ఖరారు చేసింది. అందరూ ఊహించినట్లుగానే... తనకు ఎన్నాళ్లుగానో వివిధ కోణాల్లో ఉపయోగపడుతున్న, ఉపయోగపడతారని భావించే వాళ్లకే పెద్దపీట వేశారు. రాజకీయ ప్రాబల్యం ఉన్నవారి సిఫారసులకు, న్యాయవాదులకు అవకాశం కల్పించారు. ‘ఎవరేమనుకుంటే నాకేం’ అన్నట్లుగా... ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు, తర్వాత అప్రూవర్‌గా మారిన పెనక శరత్‌చంద్రా రెడ్డికి టీటీడీ బోర్డులో చోటు కల్పించారు. ఆయన... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి సోదరుడు కావడం గమనార్హం. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌కు చెందిన వారికి బోర్డులో చోటు కల్పించారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి నలుగురికి ఈ జాబితాలో చోటు దక్కింది. బీజేపీకి చెందిన డాక్టర్ శంకర్‌కు బోర్డులో స్థానం కల్పించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈయన సన్నిహితుడని ప్రచారం జరుగుతోంది. వైసీపీ వచ్చాక ఇతనికి వరుసగా రెండోసారి అవకాశం దక్కింది అలాగే... హైకోర్టు న్యాయవాది కృష్ణమూర్తి వైద్యనాథన్‌కు చోటు కల్పించారు. న్యాయ వర్గాల్లో ఆయనకు మంచి పట్టుందని సమాచారం. అంతేకాదు... కృష్ణమూర్తి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సన్నిహితుడు. ఆయనకు టీటీడీ బోర్డు సభ్యుడిగా పదవి దక్కడం ఇది వరుసగా నాలుగోసారి. ‘టీసీఎస్’ వేణు కుమారుడు సుదర్శన్ వేణుకు కూడా పదవి లభించింది. ఇక... తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు బాగా సన్నిహితుడైన బాలసుబ్రమణియన్ పళనిస్వామికి కూడా టీటీడీ బోర్డులో చోటు కల్పించారు. మహారాష్ట్రలో శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కార్యదర్శి మిలింద్ నర్వేకర్‌ను కూడా టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. ఆయనకుఈ పదవి కల్పించడం ఇది రెండోసారి. మహారాష్ట్రకు చెందిన సౌరభ్ బోరాకూ మరోసారి స్థానం కల్పించారు. ఇదే రాష్ట్రానికి చెందిన అమోల్‌కాలే గతంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండగా, ఈసారి బోర్డులో సభ్యత్వం కల్పించారు. అలాగే... గుజరాత్‌కు చెందిన డాక్టర్ కేతన్ దేశాయ్‌కి కూడా మరోసారి బోర్డులో చోటు కల్పించారు. ఆయన... యూరాలజిస్ట్. 2001లో అప్పటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పదవి కోల్పోయారు. కర్ణాటక నుంచి వీఆర్ దేశ్‌పాండేకు బోర్డులో స్థానం కల్పించారు. తెలంగాణ నుంచి చేవేళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీతా రెడ్డికి బోర్డు సభ్యురాలిగా స్థానం కల్పించారు.
ఏపీ నుంచి వీరే...
టీటీడీ పాలకమండలిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఎస్.ఉదయ్‌భాను, ముమ్మిడివరం ఎమ్మెల్యే పి.వెంకట సతీశ్ కుమార్, మడకశిర ఎమ్మెల్యే ఎం.తిప్పేస్వామికి ఈ చాన్స్ దక్కింది. ఇంకా... సిద్ధవటం యానాదయ్య (కడప), సీహెచ్ అశ్వర్థ నాయక్ (అనంతపురం), మేకా శేషుబాబు (పశ్చిమగోదావరి), ఆర్.వెంకట సుబ్బారెడ్డి, యల్లారెడ్డిగారి సీతారామరెడ్డి (మంత్రాలయం ఎమ్మెల్యే సోదరుడు), గడిరాజు వెంకట సుబ్బరాజు (ఉంగుటూరు), శిద్ధా వీరవెంకట సుధీర్ కుమార్ (శిద్ధా రాఘవరావు కుమారుడు), ఎన్.నాగసత్యం (ఏలూరు), సామల రామిరెడ్డి, గడ్డం సీతారెడ్డిలను బోర్డులో నియమించారు. మొత్తం 24 మందితో కూడిన జాబితా సీఎంవో నుంచి దేవదాయ శాఖకు వెళ్లింది. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
Updated Date - 2023-08-26T03:04:57+05:30 IST