కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Godavari : ఉగ్ర గోదారి

ABN, First Publish Date - 2023-07-28T03:32:01+05:30

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు గురువారం తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. గత కొన్నిరోజులుగా గోదావరి ప్రవాహం పెరుగుతూ, తగ్గుతూ ప్రజలను భయపెడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు సీలేరు, శబరి, ఇంద్రావతి ఉపనదులు, కొండవాగుల జలాలు భారీగా గోదావరిలోకి

Godavari : ఉగ్ర గోదారి

తగ్గిన వాన.. భారీగా పెరిగిన వరద

గోదావరి లంక గ్రామాలన్నీ మునక

ప్రకాశం జిల్లాలో మిద్దె కూలి వృద్ధురాలు మృతి

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు గురువారం తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. గత కొన్నిరోజులుగా గోదావరి ప్రవాహం పెరుగుతూ, తగ్గుతూ ప్రజలను భయపెడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు సీలేరు, శబరి, ఇంద్రావతి ఉపనదులు, కొండవాగుల జలాలు భారీగా గోదావరిలోకి వస్తున్నాయి. తూర్పుగదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద గురువారం నీటి మట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ గుండా సముద్రంలోకి 12,90,982 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. కాగా, తెలంగాణలోని భద్రాచలం వద్ద నీటిమట్టం 50 అడుగులు దాటి మళ్లీ తగ్గుముఖం పట్టింది. సాయంత్రం 6 గంటలకు 48.1 అడుగులకు తగ్గింది. ఇది మరింత తగ్గితే అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశం ఉంది. కానీ, భద్రాచలం ఎగువ భాగంలో బాగా వర్షాలు పడటం, సమక్కసారక్క ప్రాజెక్టు నుంచి భారీగా నీరు వదలడంతో తెల్లారే సరికి ఆ నీరు భద్రాచలం చేరుకుని మళ్లీ అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. వరదతో పోలవరం దిగువన రాజమహేంద్రవరం, కొవ్వూరు మధ్య అఖండ గోదావరి సముద్రంలా మారింది. లంకలన్నీ మునిగాయి. ఏజెన్సీ ప్రాంతంలోకి నీరు ప్రవేశించింది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ఉధృతి పెరిగింది. వశిష్ఠ, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమీ నదీపాయలు పొంగి ప్రవహించి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పల్లపు ప్రాంతాలను ముంచెత్తుతోంది. అయినవిల్లి మండలం ఎదురుబిడియం కాజ్‌వే ముంపునకు గురికావడంతో నాలుగు లంక గ్రామాలకు రవాణా స్తంభించిపోయింది.

అల్పపీడన ప్రభావంతో ఏలూరు జిల్లాలో గురువారం కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. జలాశయాల్లో నీటి మట్టాలు మరింత పెరిగితే నీటిని దిగువకు విడుదల చేస్తామని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఓ మట్టిమిద్దె కూలి షేక్‌ ఫాతిమాబీ (82) అనే వృద్ధురాలు మృతిచెందారు. గోదావరి, శబరి నదులు పొంగి ప్రవహించడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మీదుగా ఒడిసా వెళ్లే 326 నంబరు జాతీయ రహదారి నిమ్మలగూడెం, కల్లేరు సమీపంలో నీట మునిగింది. కాగా, కృష్ణా, గోదావరి పరీవాహకప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నివారణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ సూచించారు. గోదావరి ప్రాంతంలో 4 ఎస్డీఆర్‌ఎఫ్‌, 3 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కాగా, ఐదుగురు రైతులు వేర్వేరుచోట్ల పొలం పనుల్లో ఉండగా పాము కాటుకు గురయ్యారు. వీరిని పోలవరం ప్రభుత్వ సామాజిక వైద్య కేంద్రానికి తరలించి వైద్య సేవలందించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారిణి పాలడుగుల రేణుక తెలిపారు.

అప్రమత్తంగా ఉండండి: సీఎం

గోదావరి వరద పెరుగుతున్నందున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులు పొంగి ప్రవహిస్తుండటంతో.. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ, ముంపు బాధితులకు బాసటగా నిలవాలని నిర్దేశించారు. వరదల పరిస్థితిపై గురువారం సీఎం జగన్‌ అధికారులతో సమీక్షించారు. కాగా, గోదావరి వరద ప్రాంత జిల్లాలకు ప్రభుత్వం రూ.12కోట్లు విడుదలచేసింది. అత్యవసర సహాయ కేంద్రాల ఏర్పాటు తదితర అవసరాలకు ఈ నిధులు విడుదలయ్యాయి.

Updated Date - 2023-07-28T03:32:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising