కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కూరగాయల ధరలు రెట్టింపు

ABN, Publish Date - Dec 20 , 2023 | 03:07 AM

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం, మిచౌంగ్‌ తుఫాన్‌ కూరగాయల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపాయి. దిగుబడి తగ్గి, ధరలు అమాంతం పెరిగాయి.

కూరగాయల ధరలు రెట్టింపు

దాదాపు అన్ని రకాలూ కిలో రూ.60పైనే

వర్షాభావం, మిచౌంగ్‌ తుఫానుతో తగ్గిన ఉత్పత్తి

వచ్చే ఆరేడు నెలలు ఉత్పత్తి ఇంకా తగ్గే అవకాశం

రానున్న రోజుల్లో ధరలు మరింత పైకి?

కార్తీకం ముగియడంతో చికెన్‌ కూడా పైపైకి

ప్రభుత్వ నియంత్రణ లేమిపై మండిపడుతున్న జనం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం, మిచౌంగ్‌ తుఫాన్‌ కూరగాయల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపాయి. దిగుబడి తగ్గి, ధరలు అమాంతం పెరిగాయి. రానున్న వేసవిలో సాగు తగ్గి, డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి అయ్యే పరిస్థితులు లేవు. మళ్లీ తొలకరి వచ్చి, కొత్త పంట వేసే దాకా ధరలు తగ్గే అవకాశం లేదు. ఇప్పటికే అన్ని రకాల కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. రానున్న ఆరేడు నెలలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తుండటంతో సామాన్యుల్లో ఆందోళన మొదలైంది. కనీసం కూర కూడా వండుకునే పరిస్థితులు కనిపించడం లేదని పేదలు వాపోతున్నారు. ఈ ఏడాది వేసవిలో ఎండలు ఎక్కువరోజులు కొనసాగడంతో బోరు వసతిలేని రైతులు కూరగాయ పంటల సాగుకు నానా అవస్థలు పడ్డారు. ఓ వైపు వర్షాభావం, మరో వైపు భగ్గుమనే ఎండలతో సాగునీటి సమస్య ఉత్పన్నమై, కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గింది. దీనికి తోడు మిచౌంగ్‌ తుఫాన్‌.. సాగులో ఉన్న కొద్ది కూరగాయ పంటల్నీ దెబ్బతీసింది. దీంతో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేక ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్లలో ఒకటీ, రెండు రకాలు కిలో రూ.40 ఉండగా, చాలా వరకు కిలో రూ.60-80 దాకా పలుకుతున్నాయి. కిలో రూ.20-30 ఉండే దొండ, బెండ, వంకాయలు కూడా రూ.60కి తగ్గడం లేదు. సంక్రాంతి సీజన్‌లో వచ్చే చిక్కుళ్లు సెంచరీకి దగ్గరలో ఉన్నాయి. రాయలసీమలో అధికంగా పండించే టమాటా వర్షాభావంతో దిగుబడి బాగా తగ్గింది. పచ్చిమిర్చి సాగుపైనా వర్షాభావం, తుఫాన్‌ ప్రభావం చూపాయి.

కిలో పచ్చిమిర్చి రూ.50 దాకా అమ్ముతున్నారు. కాకర, బీర కిలో రూ.60-70 చెప్తున్నారు. దోసకాయ కూడా కిలో రూ.40కి ఏమాత్రం తగ్గడం లేదు. కర్ణాటక నుంచి దిగుమతి చేసుకునే క్యారెట్‌, క్యాప్సికం కిలో రూ.80 దాకా ఉంది. బంగాళాదుంప రూ.50 దాకా పలుకుతోంది. లంక గ్రామాల్లో పండించే క్యాబేజీ, కాలీఫ్లవర్‌ మాత్రమే కిలో రూ.30-40 మధ్య ఉన్నాయి. కంద, చేమ దుంప కూడా రూ.60పైనే ఉన్నాయి. మిచౌంగ్‌ తుఫాన్‌తో ఈదురు గాలులు వీచి, మునగ, పొట్ల, అరటి చెట్లు ధ్వంసం కావడంతో వాటి రేట్లు కూడా కాస్త పెరిగాయి. కూరగాయలు ప్రియం కావడంతో కొంతమంది కర్రీ పాయింట్లలో రూ.20-30కు వండిన కూరలు కొనుక్కుంటున్నారు. రైతుబజార్లలో ధరలు కాస్త తక్కువగా ఉన్నాయంటున్నా.. సరుకు నాణ్యత ఉండటం లేదని వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు చికెన్‌ ధరలూ పెరుగుతున్నాయి. కార్తీక మాసంలో కిలో రూ.140కు పడిపోయిన చికెన్‌ ధర.. కార్తీక మాసం ముగియడంతో మళ్లీ రూ.200 దాటింది. నిత్యావసర వస్తువుల ధరలూ అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్యులు సతమతమౌతున్నారు. ధరల పెరుగుదలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంపై మండిపడుతున్నారు.

Updated Date - Dec 20 , 2023 | 03:07 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising