కారు ఢీకొని వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2023-04-16T01:22:04+05:30
మండలంలోని తాళ్లపాలెం జాతీయ రహదారిపై కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి తెలిపారు.
కశింకోట, ఏప్రిల్ 15: మండలంలోని తాళ్లపాలెం జాతీయ రహదారిపై కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం... పరవాడ మండలం ఈదులపాక భోనంగి గ్రామానికి చెందిన సలాది సంజీవరావు (51) లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా శనివారం రాత్రి తాళ్లపాలెం సమీపంలోని విమల ఫ్యాక్టరీలో అన్‌లోడ్ చేసేందుకు వెళ్లి కంపెనీలో లారీని ఉంచాడు. తరువాత భోజనం నిమిత్తం తాళ్లపాలెం నుంచి ఎలమంచిలి వెళ్లే రోడ్డు దాటుతుండగా, విశాఖ నుంచి ఎలమంచిలి వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో సంజీవరావు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంజీవరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని బావమరిది శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
ఇద్దరు సచివాలయ ఉద్యోగులకు గాయాలు
ఎస్.రాయవరం, ఏప్రిల్ 15: అడ్డరోడ్డు జంక్షన్‌లో ఆంజనేయస్వామి ఆలయం వద్ద శనివారం సాయంత్రం మినీ వ్యాన్, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గ్రామ సచివాలయ ఉద్యోగులు గాయపడ్డారు. రేవుపోలవరం సచివాలయానికి చెందిన సురేంద్ర, సాగరమిత్ర గణేష్ విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అడ్డరోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద నాలుగు రోడ్ల కూడలి దాటి జాతీయ రహదారి వైపు వెళ్తుండగా, అదే సమయంలో ఎడమ వైపు రోడ్డు మార్గం నుంచి వస్తున్న మినీ వ్యాన్ ఢీకొంది. దీంతో ఇద్దరూ గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంపై స్థానికులు నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
టీడీపీ నేతపై వైసీపీ దాడి : పోలీసులకు ఫిర్యాదు
సబ్బవరం, ఏప్రిల్ 15: మండలంలోని గొల్లలపాలెం శివారు జగన్నాథ పురం గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బొండా రాజుపై వైసీపీ నేతలు దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. నక్కవానిపాలెం జంక్షన్ వద్ద ఈ దాడి జరిగిందని, తన చేతిపై గాయాలయ్యాయని శనివారం రాత్రి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి తప్పించుకొని వచ్చి సబ్బవరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. దీనిపై సీఐ పి.రంగనాఽథంను వివరణ కోరగా ఫిర్యాదు చేయడం వాస్తవమేననీ, ఇంకా కేసు నమోదు చేయలేదని తెలిపారు. కేసు నమోదు చేసిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
88 కిలోల గంజాయి స్వాధీనం
నక్కపల్లి, ఏప్రిల్ 15: ఒడిశా నుంచి ఐషర్ వ్యాన్‌లో 88 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నామని ఎస్‌ఐ జి.శిరీష శనివారం తెలిపారు. మధ్యప్రదేశ్ హీరాపూర్ గ్రామానికి చెందిన రాజా భయ్యా వర్మ ఒడిశాలో ఐషర్ వ్యాన్‌లో గంజాయిని లోడింగ్ చేసి రాజమహేంద్రవరం తరలిస్తుండగా వేంపాడు టోల్‌ప్లాజా వద్ద స్వాధీనపర్చుకున్నామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి తణుకు ప్రాంతానికి చెందిన శివ, ధనుష్ పాత్ర వుండడంతో ఇద్దరిని సీఐ నారాయణరావు అరెస్టు చేశారన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ1.76 లక్షలు వుంటుందన్నారు.
విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు
అనకాపల్లి టౌన్, ఏప్రిల్ 15: విద్యార్థి అదృశ్యంపై శనివారం కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు. పార్వ తీపురానికి చెందిన ఎం.జగన్ అనే బాలుడు స్థానిక వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడని చెప్పారు. శనివారం ఉద యం నుంచి విద్యార్థి కనిపించకపోవడంతో హాస్టల్ కేర్ టేకర్ నరేంద్ర ఫోన్ చేసి విద్యార్థి తండ్రి నాగేశ్వరరావుకు విషయం తెలియజేశారన్నారు.
Updated Date - 2023-04-16T01:22:04+05:30 IST