చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌ల రాజీనామాలు ఆమోదం
ABN, First Publish Date - 2023-04-16T01:21:29+05:30
మునిసిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో చైర్‌పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొలుసు నర్సింహమూర్తిల రాజీనామాలు ఆమోదించారు. శనివారం చైర్‌పర్సన్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైస్ చైర్మన్, చైర్ పర్సన్‌ల రాజీనామాలతో పాటు 12 అంశాలను కౌన్సిల్ సమావేశంలో అజెండాగా ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా 26వ వార్డు కౌన్సిలర్ (టీడీపీ) చింతకాయల పద్మావతి మాట్లాడుతూ రాజీమానా చేసిన చైర్‌పర్సన్ అజెండాపై సంతకం చేయవచ్చా?, కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించవచ్చా? అని ప్రశ్నించారు.
- రాజీనామా చేసిన చైర్‌పర్సన్ అజెండాపై సంతకం ఎలా చేస్తారని నిలదీసిన టీడీపీ కౌన్సిలర్ పద్మావతి
- 2023-24 బడ్జెట్ ఎందుకు ప్రవేశ పెట్టలేదని నిలదీత
- కౌన్సిల్ సమావేశం నుంచి టీడీపీ కౌన్సిలర్లు బాయ్‌కాట్
- రవాణా వాహనాలకు డీజిల్ డబ్బులు లేకపోవడంపై జనసేన ఫైర్
నర్సీపట్నం, మార్చి 15 : మునిసిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో చైర్‌పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొలుసు నర్సింహమూర్తిల రాజీనామాలు ఆమోదించారు. శనివారం చైర్‌పర్సన్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైస్ చైర్మన్, చైర్ పర్సన్‌ల రాజీనామాలతో పాటు 12 అంశాలను కౌన్సిల్ సమావేశంలో అజెండాగా ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా 26వ వార్డు కౌన్సిలర్ (టీడీపీ) చింతకాయల పద్మావతి మాట్లాడుతూ రాజీమానా చేసిన చైర్‌పర్సన్ అజెండాపై సంతకం చేయవచ్చా?, కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించవచ్చా? అని ప్రశ్నించారు. మెయిన్ రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా 9 మంది కోర్టులో రిట్ పిటీషన్లు దాఖలు చేశారని అన్నారు. చట్టాన్ని అనుసరించి రోడ్లు విస్తరణ చేయాలని, భవనాల జోలికి వెళ్లవద్దని కోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని తెలిపారు. చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును అజెండాలో ఎందుకు పెట్టలేని అధికారులను పద్మావతి నిలదీశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తీసుకోకుండా కొత్త పనులకు నిధులు మంజూరు చేయకూడదని, ఈ అజెండాలో పొందుపరిచిన పనులకు ఏ బడ్జెట్‌లో ఆమోదం తీసుకున్నారని ప్రశ్నించారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం అంటూ అజెండాలో మూడు అంశాలను పెట్టారని, ఇప్పుడు నడుస్తున్నది వేసవి కాలం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఎండలు ముదిరిపోయాయని, ఇంకా టెండర్లు పిలవాలంటున్నారని, బడ్జెట్ ఆమోదం లేకుండా ఇవన్నీ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. పనులు వర్షాకాలంలో చేస్తారా?, లేదా చేసినట్టు చూపించి ఆ డబ్బులు తినేస్తారా? అని ప్రశ్నించారు. ఇందుకు నిరసనగా కౌన్సిల్ సమావేశం నుంచి టీడీపీ బాయ్‌కాట్ చేస్తుందని ప్రకటించారు. టీడీఆర్ బాండ్లు వద్ద, నగదు రూపంలో నష్టపరిహారమే ముద్దు అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లి పోయారు. తరువాత అజెండాలోని అంశాలు చదువుతుండగా చైర్‌పర్సన్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. ఇంకెందుకు అజెండా, ఆమోదించేయండి అని చెప్పేసి లేచి వెళ్లి పోయారు. అనంతరం 9వ వార్డు కౌన్సిలర్(జనసేన) అద్దెపల్లి సౌజన్య అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా సమావేశం కోసం ఈ అజెండాలో రూ.2 లక్షలు ఖర్చు చూపించారని, గత ఏడాది వైఎస్సార్ ఆసరా సమావేశం కోసం రూ.11 లక్షలు ఎందుకు ఖర్చు అయిందని ప్రశ్నించారు. అప్పట్లోనే దీనిపై జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంతో పాటు ప్రతీ సచివాలయం పరిధిలో ఆసరా సమావేశాలు నిర్వహించినట్టు అధికారులు జిల్లా కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఒక్క రోజు మాత్రమే ఆసరా సమావేశం నిర్వహించినట్టు మెప్మా అధికారులు లిఖిత పూర్వకంగా రాసిచ్చారని తెలిపారు. దీనిపై ఎంత వరకైనా వెళ్లి తిన్న డబ్బులు కక్కిస్తామని కౌన్సిలర్ హెచ్చరించారు. డీజిల్‌కి డబ్బులు లేవని చెత్తలు ఎత్తడం మానేస్తున్నారని విమర్శించారు. రెండేళ్ల కౌన్సిలర్ గౌరవ వేతనాన్ని తాను విరాళంగా ఇస్తానని అన్నారు. వాహనాలకు డీజిల్ కొట్టించి వార్డులో చెత్త ఎత్తాలని కోరారు. ఆమె మాట్లాడుతుండగా వైసీపీ కౌన్సిలర్లు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆమె ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు తప్పు చేస్తుంటే అధికార పక్షం గళం విప్పి ప్రశ్నించాలని, ఈ విధంగా చేయడం భావ్యం కాదని అన్నారు.
Updated Date - 2023-04-16T01:21:29+05:30 IST