ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాదైనా బాలారిష్టాల్లోనే..!

ABN, First Publish Date - 2023-04-04T00:51:52+05:30

విశాఖపట్నం జిల్లా నుంచి వేరుపడి కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లాలో పరిపాలన ఇంకా బాలారిష్టాలను దాటిలేదు. ఏడాది అయినా ఇంతవరకు ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి కూడా సొంత భవనం సమకూర లేదు. వివిధ శాఖలకు చెందిన మొత్తం 45 జిల్లాస్థాయి కార్యాలయాలు వున్నాయి. వీటిలో కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయంతోపాటు అత్యధిక శాఖల కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.

Anakapalli District Administration
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గాడిన పడని అనకాపల్లి జిల్లా పాలన

మంజూరుకాని నిధులు.. సాగని అభివృద్ధి పనులు

అద్దె భవనాల్లో కలెక్టరేట్‌, జిల్లా పోలీసు సహా అత్యధిక కార్యాలయాలు

అరకొర వసతితో ఉద్యోగుల ఇక్కట్లు

కొనసా..తున్న సిబ్బంది సర్దుబాటు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం జిల్లా నుంచి వేరుపడి కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లాలో పరిపాలన ఇంకా బాలారిష్టాలను దాటిలేదు. ఏడాది అయినా ఇంతవరకు ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి కూడా సొంత భవనం సమకూర లేదు. వివిధ శాఖలకు చెందిన మొత్తం 45 జిల్లాస్థాయి కార్యాలయాలు వున్నాయి. వీటిలో కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయంతోపాటు అత్యధిక శాఖల కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. చాలా కార్యాలయాలు వసతి చాలక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇక పలు ప్రభుత్వ శాఖలకు ఉద్యోగుల సర్దుబాటు ఏడాది పొడవునా సాగుతూనే ఉంది. జిల్లా రిజిస్ట్రార్‌, గృహ నిర్మాణం, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి, మౌలిక వసతుల కల్పన, గనుల శాఖలకు దిగువ స్థాయి సిబ్బందిని పూర్తిగా నియమించలేదు. అభివృద్ధి పరంగా కూడా చెప్పుకోదగిన ప్రాజెక్టులు ఏవీ పట్టాలెక్కలేదు. ప్రధానంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. భూసేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ‘జైకా’ రుణంతో గత ఏడాది చేపట్టిన రైవాడ రిజర్వాయర్‌ కాలువల ఆధునికీకరణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. పెద్దేరు, కోనాం జలాశయాలు, పంట కాలువల ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు మూడేళ్ల నుంచి ప్రతిపాదనలకే పరిమితమైంది. నదులు, గెడ్డలపై వున్న గ్రోయిన్లు, ఆనకట్ట మరమ్మతుల పరిస్థితి కూడా ఇదే విధంగా వుంది. ఉమ్మడి జిల్లాగా వున్నప్పుడు సబ్బవరంలో నిర్మాణం ప్రారంభించిన జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. నఎన్‌డీబీ నిధులు రూ.120 కోట్లతో రెండున్నరేళ్ల క్రితం శంకుస్థాపన బీఎన్‌ రోడ్డు విస్తరణ పనులు ఇంతవరకు పది శాతం కూడా పూర్తికాలేదు. అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నంలో గత ప్రభుత్వ హయాంలో పేదలకు నిర్మించిన టిడ్కో ఇళ్లను ఇంతవరకు ఒక్క లబ్ధిదారునికి కూడా పంపిణీ చేయలేదు.

‘‘జిల్లాల పునర్విభజనతో పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతోఅన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని గత ఏడాది 2022 ఏప్రిల్‌ 4వ తేదీన నూతన జిల్లాల ఏర్పాటు సందర్భంగా పాలకులు చెప్పిన మాటలు. కానీ ఏడాది గడిచినా చెప్పుకోదగ్గ మార్పు లేదని అత్యధిక శాతం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల హడావుడి తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులకు బడ్జెట్‌లో నిధుల కేటాయించలేదు. భూసేకరణ కోసం జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు. ‘జైకా’ రుణంతో చేపట్టిన రైవాడ జలాశయం కాలువల ఆధునికీకరణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. తాండవ, పెద్దేరు, కోనాం జలాశయాల ఆధునికీకరణ పనులకు నిధుల మంజూరు ప్రతిపాదనల దశ నుంచి ముందుకు కదలడంలేదు.

అద్దె భవనాల్లో ఉద్యోగులు అగచాట్లు

కొత్త జిల్లా ఏర్పాటైన తరువాత ఇంతవరకు ఒక్క కార్యాలయానికి కూడా సొంత భవనం సమకూర్చ లేదు. కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయాలతోపాటు పలు శాఖల కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అత్యధిక జిల్లాస్థాయి కార్యాలయాలను కొద్దిపాటి వసతి వున్న భవనాల్లో ఏర్పాటు చేశారు. దీంతో విధులు నిర్వహించడానికి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణానికి ఉద్యాన శాఖ కార్యాలయంలో సుమారు 8 ఎకరాలను అధికారులు గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు నిధులు కేటాయింపు జరగలేదు. మొత్తం 45 ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు వుండగా, వీటిలో పది మినహా మిగిలినవన్నీ ప్రైవేటు అద్దె భవనాల్లోనే నడుపుతున్నారు. జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ కార్యాలయాన్ని ఒక అద్దె భవనం సెల్లార్‌లో ఏర్పాటు చేశారు. ఎస్‌ఈబీ కార్యాలయాన్ని కొప్పాక గ్రామానికి సమీపంలో ఒక ప్రైవేటు భవనంలో ఏర్పాటు చేశారు. అద్దె చెల్లించడం లేదని భవన యజమాని చెబుతున్నారు. గృహ నిర్మాణ సంస్థ పీడీ కార్యాలయాన్ని రింగురోడ్డు సమీపంలో ఒక అపార్టుమెంట్‌ ఫ్లాట్‌లో ఏర్పాటు చేశారు. ఉద్యోగులతోపాటు వివిధ పనులపై వచ్చే వారికి అసౌకర్యంగా వుంటున్నది. జిల్లా ఖజానా కార్యాలయాన్ని వాణిజ్య సముదాయం రెండో అంతస్థులో ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో వుండాల్సిన జల వనరుల శాఖ కార్యాలయాన్ని చోడవరం డీఈఈ కార్యాలంలో కొనసాగిస్తున్నారు. జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో సిబ్బందికి సరిపడినన్ని గదులు లేకపోవడంతో స్టోర్‌ రూమ్‌లో కూడా విధులు నిర్వహించాల్సి వస్తున్నది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి భూసేకరణ విభాగం అధికారులకు తలుపులు కూడా లేని ఆర్డీఓ కార్యాలయం పైభాగంలో గదులను కేటాయించారు. ఇదిలావుండగా ప్రధానమైన కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయాలను జాతీయ రహదారి నుంచి సుమారు మూడు కిలోమీటర్లు దూరంలో ఏర్పాటు చేయడంతో మహిళా ఉద్యోగులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఇక వివిధ పనులపై జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు అనకాపల్లి నుంచి కలెక్టరేట్‌కు ఆటోలో చేరుకోవడానికి మనిషికి రూ.100 చొప్పున చెల్లించుకోవాల్సి వస్తున్నది.

కొనసా..తున్న సిబ్బంది సర్దుబాటు

కొత్త జిల్లా ఏర్పాటై ఏడాది అవుతున్నప్పటికీ ఉద్యోగుల సర్దుబాటు కొనసాగుతూనే వుంది. వివిధ శాఖల జిల్లా కార్యాలయాలకు సుమారు 650 మంది ఉద్యోగులను విశాఖ, అల్లూరి జిల్లాల నుంచి సర్దుబాటు చేశారు. జిల్లా రిజిస్ట్రార్‌, గృహ నిర్మాణం, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి, మౌలిక వసతుల కల్పన, గనుల శాఖల్లో దిగువ స్థాయి సిబ్బందిని పూర్తిగా నియమించలేదు. పంచాయతీరాజ్‌, జల వనరులు, ఈపీడీసీఎల్‌ వంటి ముఖ్య శాఖలకు కార్యాలయాలను ఏర్పాటు చేసినప్పటికీ గతంలో పనిచేస్తున్న డివిజన్‌ స్థాయి అధికారులకు జిల్లా అధికారులుగా హోదా కల్పించారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కొంతమంది సిబ్బందిని నియమించారు. కానీ విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్‌ ఒక్కరే ఉన్నారు.

స్పందన అంతంతే...

జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలు అందజేస్తున్న అర్జీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పలు శాఖల అధికారులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తే, ఇక్కడ స్వీకరించిన అర్జీలను తిరిగి ఆయా మండలాకు పంపుతున్నారని, దీంతో సమస్య మళ్లీ మొదటికే వస్తున్నదని పలువురు అర్జీదారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన అర్జీలు పరిష్కారం కావడంలేదని అంటున్నారు. పలు మండలాల్లో అధికార పార్టీ నేతల భూ కబ్జాలపై ప్రజలు అందిస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-04-04T00:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising