ప్రజల ఆస్తులను ప్రైవేటుపరం చేయొద్దు
ABN, First Publish Date - 2023-02-02T00:22:38+05:30
పీపీపీ పేరుతో ప్రజల ఆస్తులను ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదని వామపక్షాల నేతలు హెచ్చరించారు. బుధవారం వారు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం మెయిన్ గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
సిరిపురం, ఫిబ్రవరి 1 : పీపీపీ పేరుతో ప్రజల ఆస్తులను ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదని వామపక్షాల నేతలు హెచ్చరించారు. బుధవారం వారు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం మెయిన్ గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు, సీపీఎం 78వ వార్డు కార్పొరేటర్ బి. గంగారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. పైడిరాజు మాట్లాడుతూ పీపీపీ పేరుతో పూర్ణామార్కెట్, ముడసర్లోవ భూములను వైసీపీ అనుయాయులకు అప్పగించే ప్రతిపాదన తక్షణమే విరమించుకోకపోతే వైసీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. పూర్ణామార్కెట్ విశాఖ ఏర్పడిన నాటి నుంచి ఉందని, మార్కెట్‌లో వందలాది వాణిజ్య, వ్యాపారులతో పాటు చిరు వ్యాపారులు కూడా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ముడసర్లోవ పార్కుకు అభివృద్ధి పేరుతో జీవీఎంసీ నిధులు రూ. 50 కోట్లు ఖర్చు చేశారని, ఇప్పుడు పార్కుకు చెందిన 283 ఎకరాల స్థలాన్ని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అనుయాయులకు కట్టబెట్టేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని ఆరోపించారు. విశాఖ రాజధాని అంటూ ప్రభుత్వ భూములను గెద్దల్లా వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కొల్లగొడుతున్నారని విమర్శించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తక్షణమే వీటిని ఆపాలని, లేదంటే ఆయనకు కూడా ఇందులో భాగం ఉన్నట్టుగా భావించాల్సి వస్తోందన్నారు. అధి కారులు జీ 20 సమావేశాల పేరుతో తోపుడు బండ్లు, చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ చర్యలను ఆపకుంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు ఆర్కేఎస్వీ కుమార్, బొట్టా ఈశ్వరమ్మ, బి. జగన్, బి. వెంకటరావు, సుబ్బారావు, నరేంద్రకుమార్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
భారీగా మోహరించిన పోలీసులు
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి పోలీసులు భారీగా మోహరించారు. జీవీఎంసీ ఇరువైపులా వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యే కార్పొరేటర్లు, కోఆప్షన్స్ సభ్యులు, జీవీఎంసీ అధికారులను మాత్రమే లోపలికి పంపించారు. కౌన్సిల్ ప్రారంభమైన తరువాత అటుగా వెళ్లే వాహనదారులను వేరే మార్గాల వైపు మళ్లించారు. జీవీఎంసీ ఉద్యోగులను ప్రధాన మార్గం వైపు కాకుండా అండర్ గ్రౌండ్ వైపుగా అనుమతించారు.
Updated Date - 2023-02-02T00:22:46+05:30 IST