హత్య కేసులో భార్యాభర్తలు అరెస్టు
ABN, First Publish Date - 2023-05-28T01:04:31+05:30
గిరిజనుడి హత్య కేసులో భార్యాభర్తలను అరెస్టు చేసినట్టు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి.
గూడెంకొత్తవీధి, మే 27: గిరిజనుడి హత్య కేసులో భార్యాభర్తలను అరెస్టు చేసినట్టు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి. మండలంలోని కొండకించంగి గ్రామానికి చెందిన గెమ్మెలి చిన్నారావుకు, అదే ప్రాంతంలోని పూజారి మల్లన్న భార్య అనుషతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. నెల రోజుల క్రితం చిన్నారావు పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అనుష పెళ్లి చేసుకోవద్దని, తనను దూరం చేయవద్దని చిన్నారావును కోరింది. అయినప్పటికీ పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటుండడంతో ఈ నెల 25వ తేదీన చిన్నారావు ఇంటికి వెళ్లి అనుష గొడవ పడింది. తన వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని చిన్నారావు వాదించగా, అతనిపై అనుష దాడి చేసింది. దీంతో అనుష జుత్తును చిన్నారావు పట్టుకోగా, అదే సమయంలో వస్తున్న అనుష భర్త మల్లన్న ఈ ఘటనను చూశాడు. దీంతో అనుష ఒక్కసారిగా మాటమార్చి, చిన్నారావు తనను శారీరకంగా లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని మల్లన్నతో చెప్పింది. దీనికి తీవ్రంగా రగిలిపోయిన మల్లన్న వెంటనే తన గృహంలోని కత్తి తీసుకువచ్చి చిన్నారావు మెడపై బలంగా నరికేశాడు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారావును కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ కేసులో మల్లన్న, అతని భార్య అనుషను అరెస్టు చేసినట్టు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. అతని వెంట ఎస్‌ఐ అప్పలసూరి ఉన్నారు.
పాము కాటుతో గొర్రెల కాపరి మృతి
ఎస్. రాయవరం, మే 27: మండలంలోని లక్ష్మీపతిరాజుపేటకి చెందిన ఎస్.వెంకన్న (47) అనే గొర్రెల కాపరి పాముకాటుకు గురై శుక్రవారం రాత్రి మృతి చెందినట్టు హెడ్ కానిస్టేబుల్ భూలోక తెలిపారు. హెచ్‌సీ అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని లక్ష్మీపతిరాజుపేటకు చెందిన వెంకన్నకు 50 గొర్రెలు ఉన్నాయి. వాటిని ఆయన ప్రతి రోజూ మేత కోసం పెదఉప్పలం గ్రామానికి తీసుకువెళుతుంటాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం వెంకన్న గొర్రెలను మేత కోసం తీసుకెళ్లి సాయంత్రం ఆరు గంటల సమయంలో వాటిని పత్తిపాడు చినసత్తిబాబుకు చెందిన తోటలో ఉంచి, ఇంటికెల్లి భోజనం చేసి తిరిగి గొర్రెల మంద దగ్గరికి వెళుతుండగా మార్గం మధ్యలో కాలుపై పాము కాటు వేసింది. వెంటనే వెంకన్న గ్రామస్థులకు చెప్పడంతో నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు అనంతరం మెరుగైన చికిత్స కోసం తుని ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడకు తరలిస్తుండగా నక్కపల్లి టోల్ గేటు వద్దకు వెళ్లేసరికి మృతి చెందినట్టు హెచ్‌సీ భూలోక తెలిపారు. మృతుడి భార్య ముసలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
గడ్డి మందు తాగి 18 మేకలు మృతి
అచ్యుతాపురం రూరల్, మే 27: మండలంలోని జగ్గన్నపేట గ్రామ శివార్లలో శనివారం గడ్డి నివారణ మందు నీటిని తాగడంతో 18 మేకలు మృతి చెందాయి. మండలంలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన ధూళి నూకరాజు, ధూళి రాజులు తమ మేకల మందలను మేత నిమిత్తం శనివారం ఉదయం జగ్గన్నపేట గ్రామ శివార్లలో బస ఏర్పాటు చేశారు. వీరు జగ్గన్నపేట శివారులో ఒక రైతు పొలంలో తమ మేకలను మేతకు వదిలారు. ఇదే సమయంలో సమీప పొలంలో గల ఒక రైతు తన పొలానికి గడ్డి నివారణ మందు పిచికారీ చేస్తున్నాడు. డ్రమ్ములో కలిపి కొంచెం కొంచెంగా పిచికారీ చేస్తుండడంతో, మిగిలి ఉన్న ఆ విషపు నీటిని మేకలు సేవించడంతో ఒక్కసారిగా నురగలు కక్కుకుని కింద పడిపోయాయి. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే 18 మేకలు మృత్యువాత పడ్డాయి. మరో రెండు మేకలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. ఈ ప్రమాదంలో ధూళి నూకరాజుకు చెందిన 15 మేకలు, ధూళి రాజుకు చెందిన మూడు మేకలు మృతి చెందాయి. ప్రభుత్వం స్పందించి మేకల యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని యాదవ సంఘం నాయకులు కోరుతున్నారు.
ఆనందపురంలో చోరీ
తులంన్నర బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు అపహరణ
కశింకోట, మే 27: ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగులగొట్టి బంగారం, వెండి అపహరించుకుపోయిన సంఘటన శనివారం వెలుగులోకొచ్చింది. ఈ సంఘటనకు సం బంధించి ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సుందరయ్యపేట పంచాయతీ ఆనందపురం గ్రామంలో చుం డూరు వెంకట రామకృష్ణ శాస్ర్తి ఇంట్లో అతని బంధువైన జీఎస్పీ ప్రసాదరావు నివాసముంటున్నారు. ఈనెల 22న ఆయన బయటకు వెళ్లి 27వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటికి వచ్చాడన్నారు. ఇంటికి వచ్చి తలుపులు తీసి చూసేసరికి సామగ్రి అంతా చిందరవందరగా పడి ఉంది. బెడ్ రూమ్ తలుపులు పగులగొట్టి ఉన్నాయి. అలాగే ఇంట్లో ఉన్న బీరువా తలుపులు పగులగొట్టి 50తులాల వెండి ఆభరణాలు, తులమున్నర బంగారం దుండగులు అపహరించుకుపోయినట్టు ప్రసాదరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి చెప్పారు.
Updated Date - 2023-05-28T01:04:31+05:30 IST