Rushikonda : రుషికొండలో ఉల్లంఘనలు నిజం!
ABN, First Publish Date - 2023-04-13T02:03:07+05:30
విశాఖలోని రుషికొండపై నిర్మాణాల్లో ఉల్లంఘనలు జరిగాయని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ (ఎంవోఈఎఫ్) కమిటీ నిర్ధారించింది. అనుమతులకు మించి అక్రమంగా తవ్వకాలు జరిపి, నిర్మాణాలు జరుపుతున్నది వాస్తవమేనని హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
బోడి గుండే...
అనుమతులు అతిక్రమించి తవ్వకాలు, నిర్మాణాలు
మా పర్మిషన్ లేకుండానే మార్పులు చేసేశారు
కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కమిటీ నివేదిక
9.88 ఎకరాల్లోనే నిర్మాణాలకు అనుమతి
కానీ 17.96 ఎకరాలను వాడుతున్నారు
అక్కడ తవ్వితీసిన మట్టి
సీఆర్‌జడ్-2 పరిధిలో డంపింగ్
హైకోర్టుకు నివేదిక సమర్పణ
స్పందన తెలపాలని పిటిషనర్లకు
ధర్మాసనం ఆదేశం
విచారణ 26కి వాయిదా
అమరావతి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): విశాఖలోని రుషికొండపై నిర్మాణాల్లో ఉల్లంఘనలు జరిగాయని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ (ఎంవోఈఎఫ్) కమిటీ నిర్ధారించింది. అనుమతులకు మించి అక్రమంగా తవ్వకాలు జరిపి, నిర్మాణాలు జరుపుతున్నది వాస్తవమేనని హైకోర్టుకు నివేదిక సమర్పించింది. తమ శాఖ నుంచి పొందిన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని స్పష్టం చేసింది. ఎంవోఈఎఫ్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే భూవినియోగ విధానం (ప్యాట్రన్), నిర్మాణ బ్లాకుల సంఖ్య, బ్లాకుల నిర్మాణ విస్తీర్ణం (బిల్ట్ అప్ ఏరియా)లో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మార్పులు చేసిందని పేర్కొంది. ఎంవోఈఎఫ్ ఇచ్చిన అనుమతులకు మించి కొండ ఎత్తుగా ఉండే (అప్‌హిల్ సైడ్) వైపు తవ్వకాలు జరిపారని తెలిపింది. మొత్తం 9.88 ఎకరాల్లో నిర్మాణాలకు కేంద్ర పర్యావరణశాఖ అనుమతిస్తే.. 17.96 ఎకరాలను పనుల కోసం వినియోగిస్తున్నారని నివేదికలో స్పష్టం చేసింది. రుషికొండపై తవ్వితీసిన మట్టిని కొండకు దక్షిణం వైపు ఉన్న సీఆర్‌జెడ్-2 పరిధి, ఇతర ప్రాంతాల్లో డంప్ చేశారని నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఏపీటీడీసీ 7 బ్లాకుల స్థానంలో నాలుగు బ్లాకులను నిర్మిస్తోందని.. 19,968 చదరపు మీటర్లలో నిర్మాణాల కోసం సీఆర్‌జెడ్ అనుమతులు ఉండగా 15,363 చదరపు మీటర్లలో నిర్మాణాలు జరుపుతోందని తెలిపింది. క్షేత్ర స్థాయిలో పనులను తాము పరిశీలించిన నాటికి ల్యాండ్ స్కేపింగ్, హార్డ్ స్కేపింగ్ పనులు ప్రారంభించలేదని పేర్కొంది.
రుషికొండపై నిర్మాణం కోసం వినియోగిస్తున్న స్ధలంతో పాటు కొండ వాలును చదరం చేసేందుకు, నిర్మాణ సామగ్రిని ఉంచేందుకు వినియోగిస్తున్న మొత్తం విస్తీర్ణాన్ని నిర్ధారించేందుకు నిపుణుల బృందంతో రియల్ టైం గతిశాస్త్రం (కైనమాటిక్స్) విధానాన్ని అనుసరించినట్లు కమిటీ తెలిపింది. ఈ ఏడాది మార్చి 13న క్షేత్రస్థాయిలో రుషికొండపై పనులు పరిశీలించామని వెల్లడించింది. తన నివేదికను బుధవారం హైకోర్టుకు సమర్పించింది. రుషికొండపై అక్రమ తవ్వకాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు బుధవారం హైకోర్టులో విచారణకు రాగా.. కేంద్ర కమిటీ నివేదికను మెమో రూపంలో కోర్టు ముందుంచామని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం నివేదికపై స్పందన తెలపాలని పిటిషనర్లను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.
ఇదీ కేసు..
కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్‌జడ్)కు విరుద్ధంగా విశాఖ జిల్లా చినగదిలి మండలం ఎండాడ గ్రామం పరిధిలోని సర్వే నంబరు 19లో రుషికొండను తవ్వేయడంతో పాటు చెట్లను తొలగిస్తున్నారని పేర్కొంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖనగర వాసి, జనసేన నాయకుడు పీవీఎన్‌ఎన్ మూర్తి యాదవ్ వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే వ్యాజ్యంలో తన వాదనలు కూడా వినాలని కోరుతూ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవన్నీ ఇటీవల విచారణకు రాగా కొండపై నిర్మాణాల కోసం జరిపిన తవ్వకాలపై సర్వే నిర్వహించి, నివేదికను కోర్టు ముందుంచాలని కేంద్ర పర్యావరణ-అటవీ మంత్రిత్వశాఖ (ఎంవోఈఎ్‌ఫ)ను కోర్టు ఆదేశించింది. ఎంవోఈఎఫ్ శాస్త్రవేత్త డాక్టర్ సురేశ్‌బాబు పసుపులేటి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ వీవీఎస్ శర్మ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్త డి.సౌమ్య, నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ శాస్త్రవేత్త డాక్టర్ మాణిక్ మహాపాత్ర, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేసీ నాయక్‌తో కమిటీ ఏర్పాటు చేసింది. క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
రుషికొండపై నిర్మిస్తున్నవి ఆఫీసు భవనాలే!
పర్యాటక వసతుల జాడే లేదు.. కళ్లు మూసుకున్న జీవీఎంసీ
కోర్టులో కేసు ఉండగానే 65 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతి
దగ్గరుండి మరీ పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): రుషికొండపై అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న పనులను అడ్డుకోవలసిన మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అడ్డగోలుగా భారీ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు ఇచ్చింది. కానీ దానికి విరుద్ధంగా ఏపీటీడీసీ అధికారులు ప్రతిపాదనలు పెడితే.. 65 ఎకరాల్లో నిర్మాణాలకు జీవీఎంసీ అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా రుషికొండలో అక్రమాల నిర్ధారణకు హైకోర్టు కమిటీ వేసిందని తెలిసి కూడా లెక్కచేయకుండా అన్నిరకాల నిర్మాణాలకు ఎటువంటి కొర్రీలు వేయకుండానే అనుమతులుమంజూరు చేసేసింది. వాస్తవానికి రుషికొండ మొత్తం కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జడ్) ప్రాంతంలో ఉంది. అక్కడ కేవలం పర్యాటకులకు సంబంధించిన వసతులతో కూడిన నిర్మాణాలే చేపట్టాలి. హోటళ్లు, రిసార్టుల వంటివే నిర్మించాలి.
వాటిని పర్యాటకులకే ఉపయోగించాలి. రుషికొండపై గతంలో పర్యాటకుల కోసం హరిత రిసార్ట్ ఉండేది. దానిని మరింత అభివృద్ధి చేసి, పర్యాటకులకు మరిన్ని వసతులు కల్పిస్తామంటూ జగన్ ప్రభుత్వం దానిని కూల్చివేసింది. ఆ స్థలంలో పర్యాటకులకు ఉపయోగపడే భవనాలు కాకుండా ప్రభుత్వ ఆఫీసులు నిర్వహించుకోవడానికి వీలుగా భవనాలు నిర్మిస్తోంది. వాటిని పరిశీలించిన వారంతా.. పర్యాటకులకు అక్కడ వసతులు ఏమీ లేవని, పెద్ద పెద్ద హాళ్లు, కిటికీలు చూస్తుంటే.. కార్పొరేట్ కార్యాలయాల కోసం నిర్మించినట్లుగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఉద్దేశం కూడా అదే. పైకి పర్యాటకుల కోసమని చెబుతూ.. విశాఖకు పరిపాలనా రాజధాని తీసుకొస్తే.. రుషికొండపై సీఎం కార్యాలయం నిర్వహించాలని యోచన చేసింది. అందుకే రూ.200 కోట్లతో భవన నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రంలో.. ముఖ్యంగా విశాఖలో ఏ ప్రాజెక్టుకూ ఈ ప్రభుత్వం ఇన్ని నిధులు కేటాయించలేదు. ఈ నిర్మాణాలన్నీ సీఆర్‌జడ్ నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తాయి. ఇవన్నీ అక్రమ నిర్మాణాలని తేల్చి, ఆపాల్సిన జీవీఎంసీ అధికారులే దగ్గరుండి పర్యవేక్షిస్తూ పనులు జరిపిస్తున్నారు. దీనిపై కూడా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలని కొందరు యోచిస్తున్నారు.
Updated Date - 2023-04-13T03:10:18+05:30 IST