ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నత్తనడకన జగనన్న ఇళ్లు!

ABN, First Publish Date - 2023-02-14T01:00:16+05:30

జిల్లాలో వైఎస్సార్‌ గృహ నిర్మాణ పథకం కింద చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి.

అనకాపల్లి మండలం తగరంపూడిలో జగనన్న లేఅవుట్‌లో పునాదుల స్థాయిలో నిర్మాణాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వైఎస్సార్‌ గృహ నిర్మాణ పథకం కింద చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. లబ్ధిదారులకు ఏడాదిన్నర క్రితం పక్కా ఇళ్లు మంజూరు చేయగా, ఇంతవరకు పది శాతం ఇళ్లు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. సగానికిపైగా ఇళ్లు పునాదుల్లోనే వున్నాయి. మూడు శాతం మంది లబ్ధిదారులకు ఇంతవరకు పునాదులు కూడా తీయలేదు. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్రజాప్యం కావడం, నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోయి ప్రభుత్వం ఇచ్చే సాయం సగం ఇంటి నిర్మాణానికి కూడా చాలకపోవడం, బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడం, గ్రామానికి చాలా దూరంలో నివాస యోగ్యానికి అనువుగా లేని ప్రదేశాల్లో లేఅవుట్‌లు వేయడం వంటి కారణాలతో చాలా మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. ఇళ్ల పనులు పూర్తిచేయకపోతే పట్టాలు రద్దవుతాయని అధికారులు హెచ్చరిస్తుండడంతో అప్పుడప్పుడు కొద్దిపాటి పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కాగా ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయించి వచ్చే నెలలో ఉగాది పర్వదినాన లబ్ధిదారులతో అట్టహాసంగా గృహప్రవేశాలు చేయించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.

జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలంతోపాటు పక్కా ఇల్లు కూడా మంజూరు చేస్తామని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించింది. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపిక, ఇళ్ల స్థలాల కోసం భూముల సేకరణ, లేఅవుట్లుగా అభివృద్ధి వంటి పనులు పూర్తయ్యేసరికి రెండేళ్లు పట్టింది. జిల్లాలో 787 లేఅవుట్‌లలో 2021 మార్చిలో ఉగాది పండుగ రోజున లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. తరువాత ఆరు నుంచి ఎనిమిది నెలల్లో 53,567 మందికి పక్కా ఇళ్లు మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం మాత్రమే ఇవ్వగా, ఇంటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ఒక్కో ఇంటికి రూ.1.8 లక్షల చొప్పున కేటాయించింది. ఇళ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు తొలుత మూడు ఆప్షన్లు ఇచ్చింది. ఇసుక ఉచితంగా సరఫరా చేసి, రూ.20,250 విలువ చేసే 90 బస్తాల సిమెంటు, రూ.28 వేల విలువ చేసే అర టన్ను ఐరన్‌ అందజేసి మిగిలిన సొమ్మును (రూ.1,31,750) నాలుగు విడతల్లో చెల్లించడం మొదటి ఆప్షన్‌. ఇసుక ఉచితంగా సరఫరా చేసి, రూ.1.8 లక్షలతో లబ్ధిదారులకు నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకోవడం రెండో ఆప్షన్‌. ఇక ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అప్పగించడం మూడో ఆప్షన్‌. లక్షా 80 వేల రూపాయలతో ఇంటి నిర్మాణం కష్టమన్న ఉద్దేశంతో ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇవ్వాలని ఎక్కువ మంది లబ్ధిదారులు దరఖాస్తుల్లో పేర్కొన్నారు. తీరా ఇళ్ల నిర్మాణం మొదలయ్యే సమయానికి మూడో ఆప్షన్‌ను ప్రభుత్వం రద్దుచేసింది. మొదటి రెండు ఆప్షన్లలో ఏదో ఒకదానినిఎంచుకుని లబ్ధిదారులే ఇళ్లను నిర్మించుకోవాలని స్పష్టం చేసింది. వెంటనే పనులు ప్రారంభించకపోతే ఇంటి పట్టా రద్దువుతుందని అధికారులు మౌఖికంగా హెచ్చరించారు. దీంతో లబ్ధిదారులు భయపడుతూ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే చాలా కాలనీలకు అప్రోచ్‌ రోడ్లు, బోర్లు, విద్యుత్‌ లైన్లు వేయకపోవడం, నీటి సదుపాయం లేకపోవడంతో చాలా మంది పనులు ఆపేశారు. కొన్ని లేఅవుట్‌లు గ్రామానికి చాలా దూరంలో నివాసయోగంకాని ప్రాంతాల్లో వేయడంతో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు విముఖత చూపారు. వీటికి తోడు సిమెంటు, స్టీలు, పిక్క, ఇటుకల ధరలు, లేబర్‌ చార్జీలు పెరగడం, బిల్లుల మంజూరులో జాప్యం, తదితర కారణాలతో ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా మందగించాయి. కొన్నిచోట్ల వైసీపీ నాయకులు మధ్యవర్తులుగా వుండి ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతోపాటు ఒక్కో ఇంటికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు లబ్ధిదారులు సొంత సొమ్ము ఇచ్చేలా ఒప్పందం చేయించి, ఇళ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే కొన్నిచోట్ల లబ్ధిదారుల నుంచి ముందస్తుగా సొంత డబ్బులు వసూలు చేసిన కాంట్రాక్టర్లు.. ఇళ్లు నిర్మించకుండా మొహం చాటేశారు. మొత్తం మీద ఏడాదిన్నర అవుతున్నా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పది శాతం కూడా పూర్తికాలేదు. గృహనిర్మాణ శాఖ అధికారుల సమాచారం మేరకు మొత్తం 53,567 ఇళ్లకుగాను ఇంతవరకు 5,150 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 1,691 మంది లబ్ధిదారులు పునాదుల పనులు కూడా చేపట్టలేదు. 30,602 ఇళ్లు పునాదుల స్థాయిలోనే వున్నాయి. 9,894 ఇళ్లు బేస్‌మెంట్‌, 2,681 ఇళ్లు గోడల వరకు, 3,549 ఇళ్లు శ్లాబ్‌ వరకు పనులు పూర్తయ్యాయి.

మచ్చుకు కొన్ని మండలాల్లో...

అనకాపల్లి మండలానికి 3,096 ఇళ్లు మంజూరయ్యాయి. 59 మంది ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. 1,758 ఇళ్లు పునాదుల స్థాయిలో వున్నాయి.

ఎలమంచిలి అర్బన్‌లో 1,636 ఇళ్లు మంజూరు కాగా ఇంతవరకు 364 ఇళ్లు పూర్తి చేశారు. 25 మంది పనులు ప్రారంభించలేదు. 755 ఇళ్లు పునాదుల స్థాయిలో, మిగిలినవి వివిధ దశల్లో వున్నాయి.

నర్సీపట్నం మండలంంలోని లబ్ధిదారులకు 1,076 ఇళ్లు మంజూరయ్యాయి. 55 మంది ఇంకా పనులు ప్రారంభించలేదు. 64 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.

పాయకరావుపేట మండలానికి 2,976 గృహాలు మంజూరయ్యాయి. 183 మంది ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. 361 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

చోడవరం మండలానికి 2,790 ఇళ్లు మంజూరు కాగా 47 మంది పనులు చేపట్టలేదు. 164 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.

మాడుగుల మండలానికి 2,530 ఇళ్లు మంజూరయ్యాయి. 117 ఇళ్లు పూర్తికాగా. 180 ఇళ్లకు పునాదులే పడలేదు. మిగిలినవి వివిధ దశల్లో వున్నాయి.

‘నర్సీపట్నం’లో 10 శాతమే పూర్తి

మంజూరైన ఇళ్లు 8,979

ఇప్పటి వరకు పూర్తయినవి 952!

పునాదుల స్థాయిలో 5,356 ఇళ్లు

నర్సీపట్నం, ఫిబ్రవరి 13 : నర్సీపట్నం నియోజకవర్గంలోని జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మాణాలు ఏడాదిన్నర నుంచి కొనసా...గుతున్నాయి. నర్సీపట్నం మునిసిపాలిటీతోపాటు మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం, నర్సీపట్నం మండలాల్లో రెండేళ్ల క్రితం 160 లేఅవుట్లు వేసి 8,979 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. వీటిలో సుమారు 10 శాతం మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశారు ఈ నెల 13వ తేదీనాటికి ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తే.... 130 మంది ఇంతవరకు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేదు. 5,356 ఇళ్లు పునాదుల స్థాయిలో వున్నాయి. 1,637 ఇళ్లు పునాదులు పూర్తికాగా, 389 ఇళ్లు శాబ్‌ స్థాయికి చేరాయి. 515 ఇళ్లకు శ్లాబ్‌లు వేశారు. 952 ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా నిర్మాణాలు మొదలు పెట్టని ఇళ్లు 130 ఉన్నాయి. రెండేళ్ల కాలంలో కేవలం నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లు 10 శాతం మాత్రమే ఉన్నాయి. కాగా ఈ నెల ఒకటో తేదీనాటికి శ్లాబ్‌ స్థాయికి వచ్చిన, శ్లాబ్‌లు వేసిన ఇళ్ల పనులను వేగవంతం చేసి ఉగాది నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ లెక్కన రెండు వేలకు మించి ఇళ్లు పూర్తయ్యేపరిస్థితి కనిపించడంలేదు.

Updated Date - 2023-02-14T01:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising