ముగిసిన ఆశ కార్యకర్తల మహాధర్నా
ABN, Publish Date - Dec 16 , 2023 | 12:49 AM
ఆశ కార్యకర్తల 36 గంటల మహాధర్నా శుక్రవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. కనీస వేతనాలు అమలు, పని ఒత్తిడి తగ్గించాలని, తదితర డిమాండ్లతో ఆశ కార్యకర్తలు గురువారం ఉదయం కలెక్టరేట్ ఎదుట ధర్నా ప్రారంభించిన విషయం తెలిసిందే.
డీఆర్వో, డీఎంహెచ్‌వోలకు డిమాండ్ల వినతిపత్రం
అనకాపల్లి రూరల్, డిసెంబరు 15: ఆశ కార్యకర్తల 36 గంటల మహాధర్నా శుక్రవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. కనీస వేతనాలు అమలు, పని ఒత్తిడి తగ్గించాలని, తదితర డిమాండ్లతో ఆశ కార్యకర్తలు గురువారం ఉదయం కలెక్టరేట్ ఎదుట ధర్నా ప్రారంభించిన విషయం తెలిసిందే. రాత్రికి కూడా శిబిరంలోనే నిద్రించిన కార్యకర్తలు శుక్రవారం ఉదయం నుంచి ధర్నాను కొనసాగించారు. సాయంత్రం ముగింపు సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు కలెక్టరేట్‌లోకి వెళ్లబోగా పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న డీఆర్‌వో బి.దయానిధి, డీఎంహెచ్‌వో హేమంత్.. ధర్నా శిబిరం వద్దకు వచ్చి ఆశ కార్యకర్తల సమస్యలు, డిమాండ్‌లను ఆలకించారు. ఈ నెల 25వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చి వినతిపత్రం స్వీకరించారు. అంతకుముందు పలువురు ఆశ కార్యకర్తలు మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పనిభారం విపరీతంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పనికి తగ్గట్టుగా వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. కాగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆశ కార్యకర్తల ధర్నా శిబిరాన్ని సందర్శించి వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. న్యాయమైన డిమాండ్‌లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.
Updated Date - Dec 16 , 2023 | 12:49 AM