జీవీఎంసీలోకి నో ఎంట్రీ!
ABN, First Publish Date - 2023-02-08T01:31:26+05:30
విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ప్రధాన కార్యాలయంలోకి ఇతరుల రాకపోకలను కట్టడి చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.
ప్రధాన కార్యాలయంలో ఆంక్షలు
ఇతరుల ప్రవేశం ఇకపై చాలా కష్టం
అన్ని విభాగాలకు మాగ్నటిక్ ఆటోమేటిక్ లాకింగ్ డోర్‌లు
యాక్సిస్ కార్డు ఉంటేనే తెరుచుకుంటున్న తలుపులు
ఉద్యోగులకు మాత్రమే ఆ కార్డులు జారీ
కార్పొరేటర్లు సహా వివిధ పనులపై వెళ్లేవారికి నో ఎంట్రీ
జీవీఎంసీలో వ్యవహారాలు
బయటకు రాకుండా ఉండేందుకేనని ఆరోపణలు
కమిషనర్ తీరుపై సర్వత్రా విమర్శలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ప్రధాన కార్యాలయంలోకి ఇతరుల రాకపోకలను కట్టడి చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఎక్కడికక్కడ మాగ్నటిక్ ఆటోమేటిక్ లాకింగ్ డోర్‌లను ఏర్పాటుచేశారు. దీనివల్ల యాక్సిస్ కార్డు కలిగిన ఉద్యోగులు మినహా ఇతరులెవరూ లోపలకు ప్రవేశించేందుకు అవకాశం ఉండడం లేదు. జీవీఎంసీలో జరుగుతున్న వ్యవహారాలపై పత్రికల్లో తరచూ కథనాలు వస్తుండడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మీడియాను నియంత్రించాలనే ఉద్దేశంతో ఆటోమేటిక్ లాకింగ్ డోర్లు ఏర్పాటుచేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్ల కిందటే దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసినప్పటికీ అన్నివర్గాల నుంచి విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ఏం జరిగిందో మళ్లీ సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు.
మేయర్, కమిషనర్ సహా అన్ని విభాగాల అధిపతులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఉంటారు. ఇంటి నిర్మాణం ప్లాన్ కోసం, స్థలాల సర్వే, ఇల్లు/ఖాళీ స్థలాలకు పన్నుల విధింపు, కొళాయి కనెక్షన్లు, రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాల కల్పన, పెన్షన్లు మంజూరు, కొత్త ఇల్లు/పట్టాలు వంటి అనేక సమస్యల పరిష్కారం కోసం నగరం నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి వస్తుంటారు. వీరితోపాటు అభివృద్ధి పనులు చేపట్టే కాంట్రాక్టర్లు కూడా తమ పనులపై సంబంధిత అధికారులను కలుస్తుంటారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. కానీ ప్రస్తుత కమిషనర్ పి.రాజాబాబు ఇప్పుడు ఉద్యోగులు మినహా ఇతరులు కార్యాలయంలోకి ప్రవేశించకుండా చర్యలకు ఉపక్రమించారు. జీవీఎంసీలో యూసీడీ, టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలతోపాటు అదనపు కమిషనర్లు ఛాంబర్‌లు, ‘సీ’ సెక్షన్ వంటి ప్రధాన విభాగాల్లో 28 చోట్ల యాక్సిస్ కార్డుతో పనిచేసే మాగ్నటిక్ ఆటోమెటిక్ లాకింగ్ డోర్‌లను ఏర్పాటుచేశారు. ఉద్యోగుల గుర్తింపు కార్డు స్వైప్ చేస్తేనే తలుపులు తెరుచుకునేలా యాక్సిస్ ఇచ్చారు. గుర్తింపుకార్డులు/యాక్సిస్ కార్డులు లేనివారు లోపలకు వెళ్లేందుకు అవకాశం ఉండదు. యాక్సిస్ కార్డు ఉన్నవారు వచ్చి డోర్ తెరిస్తేనే ఇతరులు లోపలకు వెళ్లేందుకు వీలుంటుందన్నమాట. దీంతో కార్పొరేటర్లు, వివిధ పనులపై జీవీఎంసీకి వచ్చేవారు లోపలకు వెళ్లడానికి వీల్లేకపోవడంతో బయట ఉండిపోవాల్సి వస్తోంది. పైగా ఎవరైనా సిబ్బంది యాక్సిస్ కార్డుతో డోర్ ఓపెన్ చేసి వారిని లోపలకు పంపించినా...ఎవరు డోర్ ఓపెన్ చేసి వారిని పంపించారనేది కంప్యూటర్‌లో, సీసీ కెమెరాల్లో రికార్డవుతోంది. దీంతో సిబ్బంది కూడా ఎవరినైనా లోపలకు పంపించేందుకు భయపడుతున్నారు. మంగళవారం 45వ వార్డు కార్పొరేటర్ కంపా హనోక్ తలుపు తెరిచి ఉండడంతో గమనించకుండా ఎప్పటిలాగే టౌన్‌ప్లానింగ్ విభాగంలోకి వెళ్లారు. కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చేందుకు తలుపు లాగినా రాకపోవడంతో విషయం ఏమిటని అక్కడి సిబ్బందిని ఆరా తీయగా డోర్ లాక్ అయిపోయిందని, యాక్సిస్ కార్డు వుంటేనే తెరుచుకుంటుందని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. అధికారులు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. సిబ్బంది యాక్సిస్ కార్డుతో డోర్‌ను ఓపెన్ చేయడంతో బయటకు వచ్చి, అధికారుల తీరును తప్పుబట్టారు. దీనిపై కమిషనర్‌తో మాట్లాడుతానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెండు, మూడు నెలల కిందటే దీన్ని ప్రయోగాత్మకంగా టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో అమలుచేశారు. మొదటిరోజే దీనిపై విమర్శలు రావడంతో కమిషనర్ వెనక్కితగ్గారు. తర్వాత నుంచి తలుపులను బార్లా తీసేసి వదిలేయడంతో ఎప్పటిలాగే అందరూ వచ్చిపోతున్నారు. తాజాగా సోమవారం నుంచి అన్ని విభాగాల్లోనూ తలుపులు మూసేసి మాగ్నటిక్ ఆటోమెటిక్ డోర్‌లాకింగ్ విధానాన్ని అమలుచేస్తుండడం చర్చనీయాంశమైంది.
మీడియాను కట్టడి చేయాలన్నదే లక్ష్యమా
జీవీఎంసీలో జరుగుతున్న వ్యవహారాలపై పత్రికల్లో వరుసగా కథనాలు వస్తున్నాయి. మీడియా ప్రతినిధులు ఒక్కో విభాగంలో ఏం జరుగుతుందనే దానిపై అక్కడ పనిచేసే సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకుంటుంటారు. ప్రజాధనం దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా జరిగే పనులపై పత్రికల్లో వార్తలు వస్తుంటాయి. వాటిపై ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతుండడం కమిషనర్‌తోపాటు కొంతమంది ఉన్నతాధికారులకు ఇబ్బందిగా మారిందంటున్నారు. మీడియాను కార్యాలయం లోపలకు రాకుండా అడ్డుకోగలిగితే చాలావరకూ విషయాలను గుట్టుగా ఉంచవచ్చునని కమిషనర్‌కు ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఒక అధికారి సలహా ఇచ్చినట్టు తెలిసింది. దీంతో కమిషనర్ ఎంత ఖర్చయినా సరే మాగ్నటిక్ ఆటోమేటిక్ డోర్ లాకింగ్ విధానం ఏర్పాటుచేయాలని ఆదేశించినట్టు తెలిసింది. 28 చోట్ల వీటిని అమర్చాలని నిర్ణయించగా ప్రస్తుతానికి టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, యూసీడీ, అదనపు కమిషనర్-1 ఛాంబర్లకు అమర్చారు. మిగిలినవి దశలవారీగా అమర్చనున్నారు. కమిషనర్ తీరును కార్పొరేటర్లు, వివిధ పనులపై జీవీఎంసీకి వచ్చేవారు తప్పుబడుతున్నారు.
Updated Date - 2023-02-08T01:31:27+05:30 IST