పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు ఒక్క బిడ్డూ దాఖలు కాలేదు
ABN, First Publish Date - 2023-09-23T01:13:37+05:30
పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు ఒక్క బిడ్డూ దాఖలు కాలేదు
ఫోటటోరైటప్:
22ఎస్‌ఎల్‌ఆర్8:
ఫోటోరైటప్:
22ఎస్‌ఎల్‌ఆర్1: గుంటవాడ రిజర్వాయర్‌పై అధికారులతో మాట్లాడుతున్న గోదావరి రివర్ బోర్డు చైర్మన్ ఎంకే సిన్హా.
కాంట్రాక్టర్లు పలు సందేహాలు వ్యక్తం చేశారు
వచ్చే నెలలో అటవీ అనుమతులు వచ్చే అవకాశం
డిసెంబరులో పనులు ప్రారంభం కావొచ్చు
ఏపీ జెన్‌కో డైరెక్టర్ (హైడల్) సత్యనారాయణ
సీలేరు, సెప్టెంబరు 22 :సీలేరులో ప్రతిపాదిత 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇటీవల టెండర్లు పిలవగా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదని ఏపీ జెన్‌కో డైరెక్టర్ (హైడల్) ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం సీలేరులో విలేకరులతో మాట్లాడుతూ, ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టర్లు కొన్ని సందేహాలు వ్యక్తం చేశారని, నిబంధనల గురించి అడిగారని, దీనిపై బోర్డు స్థాయిలో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. డిసెంబరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెక్నో ఎకనమిక్ క్లియరెన్సులు వచ్చాయని, వచ్చే నెలలో అటవీ అనుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. పర్యావరణ అనుమతులు వస్తేనే పనులు మొదలుపెట్టాల్సి వుంటుందని ఆయన తెలిపారు. సీలేరు కాంప్లెక్సులోని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో రెండవ దశ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. సివిల్ వర్కులు పూర్తికాగానే పెన్‌స్టాక్ ఫ్యాబ్రికేషన్ పనులు చేపడతారన్నారు. సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా వున్నాయని చెప్పారు. అంతకుముందు ఆయన పొల్లూరు, డొంకరాయి, సీలేరు జలవిద్యుత్ కేంద్రాలను, గుంటవాడ, బలిమెల, డొంకరాయి జలాశయాలను పరిశీలించారు.
సీలేరు కాంప్లెక్సులో జీఆర్‌బీ చైర్మన్ పర్యటన
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి, గుంటవాడ, బలిమెల జలాశయాలను శుక్రవారం గోదావరి రివర్ బోర్డు (జీఆర్‌బీ) చైర్మన్ ఎంకె సిన్హా పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలతో జలాశయాల్లోకి ఎన్ని టీఎంసీలు నీరు చేరిందని ఏపీ, ఒడిశా రాష్ర్టాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీలేరులో ప్రతిపాదిత పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఎక్కడ నిర్మిస్తారు, రివర్స్ పంపింగ్ కోసం ఏ ప్రదేశం నుంచి నీటిని వినియోగిస్తారు అని ఏపీ జెన్ కో అధికారులను అడిగారు. పొల్లూరులో 5, 6 యూనిట్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీలేరులో మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ ఉత్పత్తితోపాటు గోదావరి డెల్టాకు రబీలో నీరందిస్తున్న సీలేరు కాంప్లెక్సు జలాశయాలు ఉభయ గోదావరి జిల్లాలకు ఎంతో మేలు చేస్తున్నాయని అన్నారు. ఆయన వెంట ఏపీ జెన్‌కో డైరెక్టర్ (హైడల్) ఎంవీవీ సత్యనారాయణ, సీలేరు కాంప్లెక్సు సీఈ బి.శ్రీధర్, ఎస్‌ఈ కేకేవీ ప్రశాంత్‌కుమార్, ఈఈలు బాలకృష్ణ, ప్రభాకరరావు, ఏడీఈ టి.అప్పలనాయుడు, ఏఈ సురేశ్ తదితరులు వున్నారు.
Updated Date - 2023-09-23T01:13:42+05:30 IST