సౌకర్యాలు లేని సంతలెన్నో!
ABN, First Publish Date - 2023-01-13T00:53:47+05:30
వారపు సంతల్లో కనీస వసతులు లేక వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం షెడ్ల నిర్మాణం లేక వర్షాకాలం, వేసవిలో అవస్థలు పడుతున్నారు. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- కనీసం షెడ్డులు కరువు
- టార్పాలిన్లతో టెంట్లు వేసుకుని వ్యాపారం
- వర్షాకాలం, వేసవిలో అవస్థలు
- వ్యాపారులు, వినియోగదారులకు తప్పని ఇబ్బందులు
కొయ్యూరు, జనవరి 12: వారపు సంతల్లో కనీస వసతులు లేక వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం షెడ్ల నిర్మాణం లేక వర్షాకాలం, వేసవిలో అవస్థలు పడుతున్నారు. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో రాజేంద్రపాలెం, డౌనూరు, పలకజీడి, గరిమండ గ్రామాల్లో వారపు సంతలు జరుగుతాయి. డౌనూరు వారపు సంత మినహా మిగిలిన ఏ సంతకు వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు వీలుగా కనీసం షెడ్లు నిర్మించలేదు. ఈ వారపు సంతలపై సుమారు 30 నుంచి 50 గ్రామాల ప్రజలు ఆధారపడ్డారు. అలాగే మైదాన ప్రాంతాలకు చెందిన వంద మందికి పైగా చిరు వ్యాపారులకు ఈ సంతలే జీవనాధారం. వారానికి సరిపడా నిత్యావసర సరకులను గిరిజనులు వారపు సంతల్లోనే కొనుగోలు చేస్తుంటారు. అటువంటి సంతలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ఇటు పంచాయతీలు గానీ, అటు మార్కెటింగ్ కమిటీ గానీ కనీస చర్యలు చేపట్టడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డౌనూరు, రాజేంద్రపాలెం వారపు సంతలకు అప్పటి చింతపల్లి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు దుచ్చరి చిట్టిబాబు షెడ్ల నిర్మాణాలకు వీలుగా నిధులు కేటాయించారు. డౌనూరులో పనులు జరిగి సంతకు కొంత మేర ఇబ్బందులు తప్పాయి. అయితే రాజేంద్రపాలెంలో పనులు చేపట్టలేదు. దీంతో వ్యాపారులు ఆదివారం నిర్వహించే రాజేంద్రపాలెం వారపు సంతను రహదారి పక్కనే దుకాణాలు వేసుకుని నిర్వహిస్తున్నారు. దీని వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. మంగళవారం జరిగే గరిమండ వారపు సంత, గురువారం జరిగే పలకజీడి వారపు సంతల్లో వ్యాపారులు టార్పాలిన్లతో టెంట్లు వేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే వర్షాకాలం, వేసవిలో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం మార్కెట్ కమిటీలకు రెండు దఫాలు కార్యవర్గాన్ని మార్పులు చేసి పార్టీకి సంబంధించిన వారికి పదవులు కట్టిబెట్టింది తప్పితే ఏజెన్సీలో ఉన్న వారపు సంతల అభివృద్ధికి వీలుగా చర్యలు చేపట్టలేదు. దీంతో చింతపల్లి మార్కెట్ కమిటీ పరిధిలోని మండలానికి చెందిన ఈ నాలుగు వారపు సంతలు కనీస అభివృద్ధికి నోచుకోలేదు. మార్కెట్ కమిటీలు రైతులు పండించిన పంటలపై, అటవీ ఫలసాయాలపై సెస్ రూపంలో వేలాది రూపాయలు వసూలు చేయడం మినహా వాటి అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఈ వారపు సంతల అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ఫొటో రైటప్, 12పిడిఆర్ రూరల్ 8: గుత్తులపుట్టు వారపు సంతలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిన దృశ్యం
గుత్తులపుట్టు వారపు సంతలో ట్రాఫిక్ జామ్
పాడేరురూరల్, జనవరి 12: మండలంలోని గుత్తులపుట్టు గ్రామంలో గురువారం జరిగే వారపు సంత ప్రధాన రహదారిలో ఉండడంతో గురువారం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పండగ సంత కావడంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో సంత ప్రాంగణం రద్దీగా మారింది. ఆ సమయంలో ప్రైవేటు వాహనాలు, లారీలు, ఆటోలు, జీపులు ఆ మార్గంలో ఒకేసారి రావడంతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడ్డారు. వారపు సంత రోజైనా ఈ ప్రాంతంలో పోలీసులను ఏర్పాటు చేసి ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.
Updated Date - 2023-01-13T00:53:56+05:30 IST