ముసురేసింది
ABN, First Publish Date - 2023-07-25T01:59:29+05:30
ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది.
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
అల్పపీడనం.. రేపటికి వాయుగుండంగా..
అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
రేపు 4 జిల్లాల్లో అసాధారణ వర్షాలు
ఏలూరు, పశ్చిమ, అల్లూరి, పల్నాడుకు ముప్పు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల సంస్థ
విశాఖపట్నం, అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి బుధవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత పశ్చిమ వాయవ్యంగా పయనించనుంది. దీంతోపాటు రుతుపవనద్రోణి తూర్పుభాగం జగదల్‌పూర్ మీదుగా పయనిస్తున్నందున రుతుపవనాలు చురుగ్గా మారాయి. సోమవారం కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయి. మంగళవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల భారీవర్షాలు, అక్కడక్కడా అతిభారీవర్షాలు కురవనున్నాయి. బుధవారం కోస్తాలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వ ర్షాలు, అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాల్లో అసాధారణ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడి పశ్చిమ వాయవ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని, దీంతో ఒడిశా, ఛత్తీ్‌సగడ్, విదర్భ, తెలంగాణల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నందున గోదావరికి వరద పెరుగుతుందని వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు. భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ సూచించారు.
రాష్ట్రమంతా ముసురు..
రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. జూన్‌లో నైరుతి రుతుపవనాలు వచ్చాక.. రాష్ట్రవ్యాప్తంగా ముసురు పట్టి, వానలు కురవడం ఇదే ప్రథమం. ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా రావడంతోపాటు, ఎల్‌నీనో ప్రభావంతో ఎక్కువ జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. ఇప్పటికి వర్షపాతం 21.7ు లోటు ఉంది. విజయనగరం, మన్యం, అల్లూరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వర్షపాతం మెరుగైంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణ వర్షపాతానికి దగ్గరగా ఉంది. మిగిలిన జిల్లాల్లో 20 నుంచి 50శాతం దాకా వానలోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ సాగు కొద్దిగా పుంజుకుంది.
రాయలసీమలో లోటు వర్షపాతం..
నైరుతి సీజన్‌లో కోస్తా మొత్తమ్మీద ఇప్పటివరకూ 225.7 మి.మీ.కుగాను 182.7 మి.మీ. వర్షపాతం (19 శాతం తక్కువ) నమోదైంది. అదే రాయలసీమలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకావడం ఖరీ్‌ఫపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమలో 138 మి.మీ.లకుగాను 97.5 మి.మీ.(29 శాతం తక్కువ) వర్షపాతం నమోదైంది. కాగా, మంగళవారం ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఈనెల 27వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దీంతో కోస్తాలో నెల్లూరు జిల్లా తప్ప మిగిలిన జిల్లాల్లో ఖరీ్‌ఫకు మేలు జరగనున్నదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. అయితే రాయలసీమలో మాత్రం రెండు, మూడు రోజులు వర్షాలు కురిసినా లోటు కొనసాగుతుందన్నారు.
వరదలో చిక్కుకున్న ట్రావెల్స్ బస్సు..
చింతూరు, జూలై 24: గోదావరి, శబరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతోపాటు కుండపోత వర్షం కురుస్తుండడంతో అల్లూరి జిల్లా చింతూరు మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని నెల్లిపాక వీరాయిగూడెం నడుమ కూడా రాకపోకలు నిలిచిపోయా యి. చింతూరు మండలంలోని పలువురు నాటు పడవలపై చింతూరు చేరుకొని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. ఒడిసాకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చింతూరు కుయుగూరు నడుమ జాతీ య రహదారిపై వరద నీటిలో చిక్కుకుపోయింది. స్థానికుల సహకారంతో బస్సును ఒడ్డుకు చేర్చారు.
భారీగా సీపేజీ జలాలు..
డయాఫ్రం వాల్ పనులు నిలిపివేత
పోలవరం వద్ద నిలకడగా గోదావరి
పోలవరం, జూలై 24: పోలవరం ప్రాజెక్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య సీపేజీ జలాలు భారీగా చేరడంతో అధికారులు ప్రధాన డయాఫ్రం వాల్ పనులను సోమవారం నిలిపివేశారు. గ్యాప్‌ల పూడ్చివేత పనులు, డయాఫ్రం వాల్ వైబ్రో కంపాక్షన్ పనులు ఆగిపోయాయి. వరదల ప్రభావం, సీపేజీ జలాల వల్ల ప్రధాన డ్యాం నిర్మాణ పనులు ఆగినా వరద ప్రభావం లేని ప్రాంతాల్లో పనులను ఈ సీజన్‌లోనే పూర్తి చేసేందుకు సిద్ధం చేస్తున్నామని ఎస్‌ఈ నరసింహమూర్తి తెలిపారు. ప్రాజెక్టులో కొండల నడుమ గ్యాప్‌ల పూడ్చివేత, పవర్ హౌస్ ప్రాంతంలో పనులను చేస్తున్నట్లు చెప్పారు. కాగా.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం సోమవారం నాటికి నిలకడగా ఉంది. 22.087 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టులోకి వస్తున్న 9,36,296 లక్షల క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఈఈ పి.వెంకటరమణ తెలిపారు. స్పిల్ వే ఎగువన 32.350 మీటర్ల నీటిమట్టం, స్పిల్‌వే దిగువన 24 మీటర్లు, ఎగువ కాఫర్ డ్యాంకు ఎగువన 33.070 మీటర్లు, దిగువ కాఫర్ డ్యాంకు దిగువన 23.410 మీటర్ల నీటిమట్టం నమోదైంది.
Updated Date - 2023-07-25T04:28:07+05:30 IST