నర్సీపట్నం ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు బంద్
ABN, First Publish Date - 2023-08-15T01:57:29+05:30
స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో సర్జన్ పోస్టులన్నీ ఖాళీగా వుండడంతో పలు రకాల శస్త్ర చికిత్సలు జరగడంలేదు.
రెండు నెలల నుంచి జనరల్ సర్జన్ పోస్టు ఖాళీ
డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు కూడా..
ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు
శస్త్ర చికిత్సకు రూ.25-40 వేల వరకు ఖర్చు
ఆర్థిక స్థోమతలేని రోగులు కేజీహెచ్‌కు పయనం
నర్సీపట్నం, ఆగస్టు 13:
స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో సర్జన్ పోస్టులన్నీ ఖాళీగా వుండడంతో పలు రకాల శస్త్ర చికిత్సలు జరగడంలేదు. దీంతో ఆయా రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఆర్థిక స్థోమత లేనివారు విశాఖ కేజీహెచ్‌కు వెళుతున్నారు. సర్జన్ పోస్టులతోపాటు పలురకాల ఇతర పోస్టులు కూడా నెలల తరబడి భర్తీకి నోచుకోకపోవడంతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది.
మైదాన ప్రాంతంలోని ఏడెనిమిది మండలాలతోపాటు ఏజెన్సీలో కొయ్యూరు, చింతపల్లి, జీకే వీధి మండలాల నుంచి రోగులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వచ్చి వైద్య సేవలు పొందుతుంటారు. 150 పడకలు వున్న ఈ ఆస్పత్రికి రోజూ 500 నుంచి 600 వరకు ఓపీ వుంటుంది. వీరిలో 70 నుంచి 80 మంది వరకు ఇన్‌పేషెంట్లు వుంటారు. ఇదిలావుండగా ప్రాంతీయ ఆస్పత్రిలో జనరల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ముఖ్యంగా రెండు నెలల నుంచి జనరల్ సర్జన్ పోస్టును భర్తీ చేయకపోవడంతో ఆపరేషన్లు జరగడం లేదు. జనరల్ సర్జన్ డాక్టర్ ప్రధాన్ రెండు నెలల క్రితం బదిలీ అయ్యారు. ఆయన ఉన్నప్పుడు హెర్నియా, హైడ్రోసిల్, అపెండిసైటిస్ వంటి సమస్యలతో వచ్చిన రోగులకు శస్త్ర చికిత్సలు చేసే వారు. ఆయన బదిలీ తర్వాత మరో జనరల్ సర్జన్‌ను నియమించలేదు. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులలో ఆపరేషన్లు చేయించుకోవాల్సి వస్తున్నది. ఒక్కో ఆపరేషన్‌కు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అవుతున్నదని రోగులు చెబుతున్నారు. ఆర్థిక స్థోమత లేనివారు విశాఖలోని కేజీహెచ్‌కు వెళుతున్నారు. కాగా ఆస్పత్రిలో జనరల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్‌తోపాటు జనరల్ ఫిజీషియన్ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఇంకా 36 మంది నర్సింగ్ సిబ్బంది అవసరం 24 మంది మాత్రమే పని చేస్తున్నారు. వీరిలో తొమ్మిది మంది మాత్రమే రెగ్యులర్ సిబ్బందికాగా, మిగిలిన వారు కాంట్రాక్టు సిబ్బంది. అయితే 100 పడకల ఆస్పత్రిలో ఉండాల్సిన సిబ్బందితో 150 పడకల స్థాయిలో పనులు చేయిస్తున్నారు. ఆస్పత్రి పరిపాలనాధికారి, జూనియర్ అసిస్టెంట్లు, జనరల్ డ్యూటీ అటెండర్స్ పోస్టులు కూడా ఖాళీగా వున్నాయి. ఎక్స్‌రే విభాగంలో డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్టు ఖాళీ ఉంది. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతపై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి దేవిని వివరణ కోరగా, జనరల్ సర్జన్ పోస్టు భర్తీ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. రోగులకు ఆపరేషన్లు చేయడా నికి డిప్యూటేషన్ మీద వారానికి ఒక జనరల్ సర్జన్ డాక్టర్‌ను ఇక్కడకు పంపాలని కోరినట్టు ఆమె పేర్కొన్నారు.
Updated Date - 2023-08-15T01:57:29+05:30 IST