టీడీపీ వర్సెస్ వైసీపీ
ABN, First Publish Date - 2023-03-30T02:09:42+05:30
నర్సీపట్నంలో ప్రధాన రహదారి విస్తరణపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం రసాభాసగా మారింది. విస్తరణ వల్ల ఆస్తులు కోల్పోతున్న బాధితులకు టీడీఆర్ సర్టిఫికెట్లు కాకుండా నగదు రూపంలో పరిహారం చెల్లించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.

నర్సీపట్నం కౌన్సిల్ సమావేశంలో వాగ్వాదం
రోడ్డు విస్తరణ బాధితులకు టీడీఆర్ సర్టిఫికెట్ల బదులు నగదు పరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్
2020 చట్టప్రకారం వీలుకాదన్న కమిషనర్
టీడీపీ హయాంలో టీడీఆర్ సర్టిఫికెట్లే ఇచ్చారన్న వైసీపీ సభ్యులు
ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం
---
నర్సీపట్నం, మార్చి 29 : నర్సీపట్నంలో ప్రధాన రహదారి విస్తరణపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం రసాభాసగా మారింది. విస్తరణ వల్ల ఆస్తులు కోల్పోతున్న బాధితులకు టీడీఆర్ సర్టిఫికెట్లు కాకుండా నగదు రూపంలో పరిహారం చెల్లించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇందుకు వైసీపీ సభ్యులు అడ్డుతగులుతూ.. టీడీపీ హయాంలో అనుసరించిన విధానాన్నే ఇప్పుడు పాటిస్తున్నామని చెప్పారు. దీంతో ఇరుపక్షాల కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. మునిసిపల్ చైర్‌పర్సన్ ఆదిలక్ష్మి వారించినా వినకపోవడంతో.. ‘ఇది కౌన్సిల్ సమావేశం అనుకుంటున్నారా? చేపల మార్కెట్ అనుకుంటున్నారా?’ అని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
ముునిసిపల్ చైర్‌పర్సన్ ఆదిలక్ష్మి అధ్యక్షతన బుఽధవారం ఉదయం మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటైంది. అబీద్ సెంటర్ నుంచి పెదబొడ్డేపల్లి వంతెన వరకు మెయిన్ రోడ్డును 100 అడుగులకు విస్తరించడంతోపాటు మరో ఏడు అంశాలను ప్రధాన అజెండాగా పెట్టారు. సమావేశం ప్రారంభం కాగానే 26వ వార్డు కౌన్సిలర్ (టీడీపీ) చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ గణనీయంగా పెరిగిపోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అందువల్ల 100 అడుగులకు విస్తరణకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. అయితే రోడ్డు విస్తరణ వల్ల ఆస్తులు నష్టపోతున్న వారికి టీడీఆర్ సర్టిఫికెట్లు కాకుండా నగదు రూపంలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 2017లో రూపొందించిన చట్టం ప్రకారం రోడ్ల విస్తరణ వల్ల కోల్పోయిన స్థలానికి ప్రత్యామ్నాయంగా మరోచోట స్థలం ఇవ్వాలని ఉందని అన్నారు. మునిసిపల్ కమిషనర్ కనకారావు మాట్లాడుతూ, 2017లో రూపొందించిన చట్టం కేవలం ముసాయిదా మాత్రమేనని, తర్వాత 2020లో మరో చట్టం చేశారని తెలిపారు. అప్పటి నుంచి రోడ్డు విస్తరణ బాధితులకు నగదు రూపంలో నష్ట పరిహారం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. రోడ్డు విస్తరణ కారణంగా ఆస్తులు కోల్పోతున్న వారికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సూచించిన ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం టీడీఆర్ సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. 24వ వార్డు కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు (టీడీపీ) మాట్లాడుతూ, రోడ్డు విస్తరణ బాధితులకు టీడీఆర్ సర్టిఫికెట్లకు బదులు నగదు రూపంలో పరిహారం ఇవ్వడానికి మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని కోరారు. ఇందుకు వైసీపీ కౌన్సిలర్లు కోనేటి రామకృష్ణ, మాకిరెడ్డి బుల్లిదొర, సిరసపల్లి నాని అభ్యంతరం చెప్పారు. రోడ్డు విస్తరణ బాధితులకు టీడీఆర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని చట్టంలోనే వుందని, గత ప్రభుత్వంలో కూడా రోడ్ల విస్తరణ బాధితులకు టీడీఆర్ సర్టిఫికెట్లే ఇచ్చారని అన్నారు. దీంతో ఇరుపక్షాల కౌన్సిలర్ల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దిగారు. దీంతో చైర్‌పర్సన్ ఆదిక్ష్మి అసహనం వ్యక్తం చేస్తూ... ఇది కౌన్సిల్ సమావేశంలా లేదని, చేపల మార్కెట్‌లా ఉందని అన్నారు. సభ్యుల ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలని సూచించారు. 9వ వార్డు కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య (జనసేన) మాట్లాడుతూ, మహాశివరాత్రి ఉత్సవాలకు రూ.10 లక్షలు ఖర్చు చేసినట్టు పేర్కొన్నారని, ఎక్కడ ఖర్చు చేశారో అధికారులు వెల్లడించాలని పట్టుబట్టారు. వరహా నదిలో పూడిక తీయలేదని, అక్కడ మట్టిని తీసి పక్కన పోశారని, ఒక టెంటు, కొన్ని కుర్చీలు, లైటింగ్‌కి రూ.10 లక్షలు ఖర్చు రాసుకున్నారని విమర్శించారు.
Updated Date - 2023-03-30T02:09:42+05:30 IST