వణికిస్తున్న ఘాట్ ప్రయాణం
ABN, First Publish Date - 2023-06-16T01:03:58+05:30
పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించాలంటే ఘాట్ ప్రయాణం తప్పనిసరి. పాడేరు మండలం మినుములూరు నుంచి వి.మాడుగుల మండలం గరికబంద వరకు 26 కిలోమీటర్లు ఘాట్ మార్గమే. దీనికి తోడు ఈ మార్గంలో ఇరువైపులా తుప్పలు దట్టంగా పెరగడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
- రహదారికి ఇరువైపులా దట్టంగా పెరిగిన తుప్పలు
- ఈ ఏడాది జంగిల్ క్లియరెన్స్ చేపట్టక మలుపుల వద్ద మూసుకుపోయిన వైనం
- ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు
- భీతిల్లుతున్న పర్యాటకులు, డ్రైవర్లు
(ఆంధ్రజ్యోతి- పాడేరు)
పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించాలంటే ఘాట్ ప్రయాణం తప్పనిసరి. పాడేరు మండలం మినుములూరు నుంచి వి.మాడుగుల మండలం గరికబంద వరకు 26 కిలోమీటర్లు ఘాట్ మార్గమే. దీనికి తోడు ఈ మార్గంలో ఇరువైపులా తుప్పలు దట్టంగా పెరగడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా మలుపుల వద్ద ఏపుగా పెరిగిన తుప్పల వల్ల ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
స్థానిక ఘాట్ మార్గంలో ఇరువైపులా ఏపుగా తుప్పలు పెరగడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్‌లో మలుపు మార్గం కనిపించక నిత్యం వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఘాట్‌లో రోడ్డుకు ఇరువైపులా దట్టంగా తుప్పలు పెరగడంతో ఎదురుపడే వాహనాలకు దారి ఇవ్వడం ఒక సమస్య అయితే, మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించలేకపోవడం మరో సమస్యగా మారుతోంది. దీంతో ఘాట్‌లో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రమాదాలకు గురవుతున్నారు. బుధవారం పాడేరు నుంచి వడ్డాది వెళుతున్న బొలేరో పికప్ మినీవ్యాన్ రాజాపురం వద్ద ప్రమాదానికి గురికాగా, మంగళవారం పాడేరులో సిమెంట్ అన్‌లోడ్ చేసి తిరిగి విశాఖపట్నం వెళుతున్న లారీ మలుపువద్ద అదుపు తప్పింది. ప్రస్తుతం ఘాట్‌లో ఇరువైపులా ఉన్న తుప్పల కారణంగా డ్రైవర్లు వాహనాల రాకపోకలను గుర్తించడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయని పలువురు డ్రైవర్లు అంటున్నారు. ఈ విధంగా రోజుకు కనీసం రెండు వాహనాలు ఘాట్‌లో ప్రమాదాలకు గురికావడం పరిపాటిగా మారింది.
ఘాట్‌లో పెరిగిన వాహనాల రాకపోకలు
పాడేరు మండలం మినుములూరు నుంచి వి.మాడుగుల మండలం గరికబంద వరకు 26 కిలోమీటర్లు ఘాట్ మార్గం ఉంది. ఏజెన్సీలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాలతోపాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. అలాగే పాడేరు జిల్లా కేంద్రం కావడంతో గతంలో పోలిస్తే వాహనాల రాకపోకలు మరింతగా పెరిగాయి. దీంతో స్థానిక ఘాట్ మార్గం నిత్యం వాహనాలతో రద్దీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రమాదాలు అధికమవుతున్నాయి.
ఈ ఏడాది జరగని జంగిల్ క్లియరెన్స్
గతేడాది లాగానే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఘాట్ మార్గంలో తుప్పలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ప్రతి ఏడాది వర్షాకాలం తరువాత ఘాట్‌లో విధిగా జంగిల్ క్లియరెన్స్ చేయాల్సి ఉంది. కానీ ఈ ఏడాది ఎటువంటి జంగిల్ క్లియరెన్స్ చేపట్టకపోవడంతో ఘాట్ మొత్తం తుప్పలే కనిపిస్తున్నాయి. దీంతో ఘాట్‌లోని రోడ్డు పక్కకు వాహనాన్ని దింపలేని దుస్థితి కొనసాగుతున్నది. వాస్తవానికి రోడ్డుకు ఇరువైపులా రెండేసి అడుగుల చొప్పున అంచులు ఉంటాయి. కానీ ఆ అంచులన్నీ తుప్పలతోనే కప్పేశాయి. ముఖ్యంగా మలుపుల వద్ద ఎక్కువగా తుప్పలు మొలిచిపోవడంతో మలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనం కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. మలుపుల వద్ద ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖాధికారులు స్పందించి ఘాట్ మార్గంలో మలుపుల వద్ద ప్రమాదకరంగా ఉన్న తుప్పలను తొలగించాలని డ్రైవర్లు, ప్రయాణికులు, పర్యాటకులు కోరుతున్నారు.
Updated Date - 2023-06-16T01:03:58+05:30 IST