అడుగడుగునా ఆత్మీయస్వాగతం
ABN, Publish Date - Dec 16 , 2023 | 12:45 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. 223వ రోజైన శుక్రవారం ఎలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో సుమారు పదిహేను కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన లోకేశ్‌కు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు.
ఉత్సాహంగా సాగుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర
సమస్యలు చెప్పుకుంటున్న రైతులు, నిర్వాసితులు, మత్స్యకారులు
టీడీపీ-జనసేన ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అండగా ఉంటామని యువనేత భరోసా
నేవల్‌బేస్, ఎస్‌ఈజడ్ నిర్వాసితులతో ముఖాముఖి
వెదురువాడలో కొప్పల వెలమలతో భేటీ
223వ రోజు 14.7 కిలోమీటర్లు నడిచిన యువనేత
నేడు మునగపాక మండలం, అనకాపల్లి పట్టణంలో పాదయాత్ర
అనకాపల్లి/రాంబిల్లి/అచ్యుతాపురం రూరల్, డిసెంబరు 15: (ఆంధ్రజ్యోతి)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. 223వ రోజైన శుక్రవారం ఎలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో సుమారు పదిహేను కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన లోకేశ్‌కు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. రాంబిల్లి మండలం పంచదార్ల వద్ద విడిది కేంద్రంలో గురువారం రాత్రి బస చేసిన నారా లోకేశ్..శుక్రవారం ఉదయం 10 గంటలకు యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. అక్కడి నుంచి ధారభోగాపురం, హరిపురం జంక్షన్, వెంకటాపురం జంక్షన్ మీదుగా గొర్లిధర్మవరం వద్ద అచ్యుతాపురం మండలంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి పూడి, వెదురువాడ, అచ్యుతాపురం జంక్షన్, మోసయ్యపేట, చోడపల్లి, కొండకర్ల జంక్షన్, హరిపాలెం, ఖాజీపాలెం మీదుగా మునగపాక మండలం తిమ్మరాజుపేట వద్దకు చేరుకుని రాత్రి బస చేశారు. శుక్రవారం లోకేశ్ 14.7 కిలోమీటర్లు నడిచారు. దీంతో పాదయాత్ర 3088.7 కిలోమీటర్లు పూర్తయ్యింది. శనివారం మునగపాక మండలం, అనకాపల్లి పట్టణంలో పాదయాత్ర కొనసాగుతుంది.
యువనేతకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం
పంచదార్ల గ్రామం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రకు దారిపొడవునా టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో పాటు మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు, మత్స్యకారులు, కార్మికులు, చేతివృత్తిదారులు..ఇంకా పలు వర్గాల ప్రజలు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. రైతులు, నిర్వాసితులు, మత్స్యకారులు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. వెంకటాపురంలో ఇటీవల తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొగాకు తోటను లోకేశ్ పరిశీలించారు. కౌలు రైతు అప్పారావుమాట్లాడుతూ తాను ఎకరా రూ.20 వేలకు కౌలుకు తీసుకుని నాట్లు వేశానని, ఇటీవల తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్నదని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదని ఆవేదన చెందారు. లోకేశ్ మాట్లాడుతూ కౌలు రైతులతో పాటు సామాన్య రైతులకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులతో పాటు కౌలు రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
లోకేశ్‌ను కలిసిన ఎస్‌ఈజడ్ నిర్వాసితులు
లోకేశ్‌ను పూడి, చిప్పాడ గ్రామాలకు చెందిన ఎస్‌ఈజడ్ నిర్వాసితులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. 2004లో ఎస్‌ఈజడ్ కోసం 29 గ్రామాల్లో 9,200 ఎకరాలను సేకరించారని, తమను గ్రామాల నుంచి తరలించేనాటికి మేజర్లుగా ఉన్న 250 మందికి సర్వే నంబర్ 1లో 30 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆ భూములను అభివృద్ధి చేసి నిర్వాసితులకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. నిర్వాసితుల కుటుంబాల్లో మేజర్ల కటాఫ్ వయసును 2010వ సంవత్సరం నుంచి 2015వ సంవత్సరానికి పొడిగించాలని కోరారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ భూ నిర్వాసితుల విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్‌ఈజడ్ నిర్వాసితులకు కేటాయించిన భూమిని అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. చినపూడి, చినతాళ్లదిబ్బ గ్రామాలకు పునరావాసం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
ఎమ్మెల్యేపై వెదురువాడ వాసుల ఫిర్యాదు
పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారుడు గెలిచినా.. వైసీపీ ఆయనను కుర్చీలో కూర్చోనివ్వడం లేదని వెదురువాడ గ్రామస్థులు...లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు కమీషన్లు తీసుకొని పంచాయతీ పనులను వైసీపీ వారికే అప్పగిస్తున్నారని ఆరోపించారు. వాస్తవ లబ్ధిదారులకు ఇవ్వకుండా వైసీపీ సానుభూతిపరులకు జగనన్న ఇళ్లు, స్థలాలు ఇచ్చారన్నారు. ఎకరాకు రూ.18 లక్షలు ఇస్తామని చెప్పి ఏపీఐఐసీ భూములను తీసుకుందని, నాలుగేళ్లు గడిచినా నేటికీ పరిహారం అందలేదని తెలిపారు. ఎమ్మెల్యేను అడిగినా స్పందించడం లేదని, పైగా ఎమ్మెల్యే అనుచరులు ఆ భూముల్లో గ్రావెల్ తవ్వుకుని అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇందుకు స్పందించిన లోకేశ్.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ గ్రావెల్ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకొని నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు. పేదలకు స్థలాలు ఇవ్వడంతోపాటు పక్కా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
ఎస్‌ఈజడ్ బాధితులతో సమావేశం
మధ్యాహ్నం వెదురువాడ విడిది కేంద్రం వద్ద భోజన విరామ సమయంలో కొప్పలవెలమ, ఎస్‌ఈజడ్ బాధితులతో యువనేత లోకేశ్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్‌ఈజడ్ కోసం భూములిచ్చి ఉపాధి కోల్పోయామని, తమకు ఎలాంటి న్యాయం జరగలేదని నిర్వాసితులు వాపోయారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, మేజర్ అయిన కుమారులు, కుమార్తెలకు ఇప్పటివరకూ ప్యాకేజీ ఇవ్వలేదని చెప్పారు. యువనేత స్పందిస్తూ టీడీపీ హయాంలో ఎస్‌ఈజడ్ బాధితులకు కొంతమేర న్యాయం చేయడంతో పాటు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించామన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సెజ్ బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
కొప్పల వెలమలది ఇచ్చే గుణం...
కొప్పలవెలమ సంఘ ప్రతినిధులతో ముఖాముఖిలో యువనేత లోకేశ్ మాట్లాడుతూ, కొప్పలవెలమ అంటే ఆత్మగౌరవమని, వారిది ఇచ్చే గుణమని అన్నారు. వారి అభివృద్ధికి జగన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కొప్పల వెలమల సంక్షేమానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
యువనేత పాదయాత్రకు పలువురు నేతల సంఘీభావం
పాదయాత్రలో మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కోండ్రు మురళి, బండారు సత్యనారాయణమూర్తి, ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చింతకాయల విజయ్, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ లాలం భవానీ, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్‌కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు వి.వెంకటేశ్వరరావు (దిన్‌బాబు), డి.రంగనాయకులు, కసిరెడ్డి ప్రసాద్, బైలపూడి రామదాసు, పప్పల నూకన్నదొర, తదితరులు పాల్గొన్నారు.
పసుపు మయంగా అనకాపల్లి
అనకాపల్లి టౌన్, డిసెంబరు 15: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర శనివారం సాయంత్రం అనకాపల్లి పట్టణంలోకి చేరనున్నది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, నియోకవర్గం ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికేందుకు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రహదారికి ఇరువైపులా స్వాగత ద్వారాలు, ఫ్లెకీలు, తోరణాలు ఏర్పాటు చేసి పట్టణాన్ని పసుపు మయం చేశారు. అనకాపల్లిలో లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ, జనసేన పార్టీల శ్రేణులకు నాగదీశ్, పీలా గోవింద పిలుపునిచ్చారు.
నేడు అనకాపల్లిలో యువగళం పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర 224వ రోజైన శనివారం మునగపాక మండలం, అనకాపల్లి పట్టణంలో సాగుతుంది. ఉదయం 8 గంటలకు ముగనపాక మండలం తిమ్మరాజుపేట వద్ద విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం. 8.45 గంటలకు మునగపాకలో యువతతో సమావేశం. 9.15 గంటలకు అరబుపాలెంలో బీసీలతో, 10 గంటలకు గంగాదేవిపేట జంక్షన్‌లో రైతులతో, 10.10 గంటలకు ఒంపోలులో, 10.30 గంటలకు నాగులాపల్లిలో స్థానికులతో సమావేశాలు. 11 గంటలకు అనకాపల్లి బైపాస్ రోడ్డు పూడిమడక జంక్షన్ సమీపంలో భోజన విరామం. మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడే యాదవులతో ముఖాముఖి. సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర కొనసాగింపు. 4.20 గంటలకు బైపాస్ రోడ్డు జంక్షన్ సమీపంలో రైతులతో, 5.50 గంటలకు నెహ్రూచౌక్‌లో టీచర్లతో, 5.15 గంటలకు వేల్పుల వీధిలో కాపులతో, 5.25 గంటలకు వ్యాపారులతో, 5.40 గంటలకు రింగ్‌రోడ్డులో బెల్లం రైతులతో, 5.50 గంటలకు బాలకృష్ణ బస్టాప్ వద్ద పెన్షనర్లతో సమావేశమవుతారు. పాదయాత్ర 3,100 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రింగ్‌రోడ్డులోని టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 6.10 గంటలకు పరమేశ్వరి పార్కు వద్ద దివ్యాంగులతో, 6.30 గంటలకు సంతోషిమాత గుడి వద్ద మీసేవ ఉద్యోగులతో, 6.45 గంటలకు నూకాంబిక అమ్మవారి ఆర్చివద్ద విద్యార్థులతో సమావేశం అవుతారు. 6.55 గంటలకు మునగపాక మండలం తోటాడ స్మార్టు సిటీ వద్ద విడిది కేంద్రానికి చేరుకుని రాత్రి బసచేస్తారు.
Updated Date - Dec 16 , 2023 | 12:45 AM