ఆంధ్రా టు ఒడిశా
ABN, First Publish Date - 2023-08-18T00:33:13+05:30
జిల్లాలో పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది.
కొన్నిచోట్ల రీసైక్లింగ్ చేసి విక్రయాలు
దాడుల్లో పట్టుబడుతున్నా.. మారని అక్రమ వ్యాపారులు
యథేచ్ఛగా కొనసాగిస్తున్న దందా
6-ఏ కేసుల నమోదుకే అధికార యంత్రాంగం పరిమితం
(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. వాహనాల్లో అక్రమంగా బియ్యం తరలిస్తున్న సమయంలో అధికారులకు పట్టుబడుతున్నా , మరోవైపు 6ఏ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఈ దందా ఆగడం లేదు. అక్రమ వ్యాపారులు ఏ మాత్రం మారడం లేదు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం నుంచే వారు బియ్యాన్ని సేకరిస్తూ.. మైదాన ప్రాంతాలు, ఒడిశాకు తరలిస్తున్నారు. కార్డుదారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేస్తూ.. వాటిని ఆయా ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరికొన్నిచోట్ల పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వాటిని స్వతహాగా తయారు చేసిన బస్తాల్లో నింపి బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ విధంగా జిల్లాలో బియ్యం అక్రమ వ్యాపారం జరుగుతున్నా.. సివిల్ సప్లయిస్ శాఖాధికారులు ప్రత్యేకంగా దాడులు చేస్తున్న సంఘటనలు తక్కువనే చెప్పాలి. ముందస్తు సమాచారం లేదా ఫిర్యాదుల మేరకు ఎక్కువగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులే పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి జిల్లాలో ఉంది.
కేసుల నమోదు ఇలా..
జిల్లా ఏర్పడిన తర్వాత.. గతేడాదిలో మొత్తంగా 30 కేసులు నమోదు చేశారు. 880 క్వింటాళ్ల 46 కిలోల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2022, జనవరిలో నాలుగు కేసులు, ఫిబ్రవరిలో నాలుగు, మార్చిలో 9, ఏప్రిల్‌లో ఒకటి, మేలో మూడు, జూన్‌లో రెండు, సెప్టెంబరులో 3, అక్టోబరులో ఒకటి, నవంబరులో ఒకటి, డిసెంబరులో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాదిలో చూసుకుంటే.. జనవరిలో నాలుగు కేసులు , మార్చిలో 8 , ఏప్రిల్‌లో రెండు, జూన్‌లో ఐదు, జూలై ఆరు చొప్పున కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 262 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈనెల ఏడో తేదీన ఒక్క సీతంపేట మండలంలోని 53 క్వింటాళ్లు, 11న 23 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. కాగా ఇందులో అత్యధిక కేసులు నమోదు చేసింది విజిలెన్స్ అధికారులే అని చెప్పొచ్చు.
ఒడిశాలో విక్రయం..
బియ్యం స్థానికంగా కొనుగోలు చేసిన వారి నుంచి మరొకరి చేతికి అక్కడ నుంచి ఇంకొకరి వెళ్తూ.. క్రమంగా ఒడిశాకు అక్రమ రవాణా జరుగుతుంది. కొందరు యథేచ్ఛగా ఇదే వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఏవోబీ సరిహద్దు ప్రాంతాలైన సాలూరు, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, కొమరాడ తదితర మండలాల నుంచే ఒడిశాకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. జిల్లాలో కిలో రేషన్ బియ్యాన్ని రూ.8 నుంచి రూ.10కు కొంతమంది కొనుగోలు చేసి ఒడిశాకు తరలిస్తున్నారు. అక్కడ వాటిని కిలో రూ.18 నుంచి రూ.20కు విక్రయించి.. అక్రమ వ్యాపారులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. గతంలో పార్వతీపురం పట్టణంలో ఒక డీలరు రేషన్ బియ్యం బదులు కార్డుదారులకు నగదు ఇచ్చిన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అధికారులు దాడులు నిర్వహించి కేసు నమోదుతోనే సరిపెట్టారు. మరోవైపు దాడుల్లో పట్టుబడుతున్న సమయంలో అధికారులు 6ఏ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో బియ్యం అక్రమ వ్యాపారానికి బ్రేక్ పడడం లేదు. కాగా ఇంకొంతమంది వ్యాపారులు రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వాటిని రీసైక్లింగ్ చేసి సన్న బియ్యంగా మారుస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న బియ్యంలో వాటిని కలిపి విక్రయాలు జరుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలోని సాలూరులో ఈ తరహా దందా కొనసాగుతుందన్న వాదనలు లేకపోలేదు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. ముడుపులు చెల్లించి అక్రమార్కులు తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తంగా వారి దందా మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగుచర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.
దాడులు నిర్వహిస్తున్నాం
విజిలెన్స్, పోలీసుల సిబ్బందితో కలిసి దాడులు నిర్వహిస్తున్నాం. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేస్తున్నాం. నేను విధుల్లో చేరి మూడు నెలలు కాలంలో సాలూరులో రెండు కేసులు నమోదు చేశాం. మిగిలిన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాం. 6ఏ కేసు నమోదుతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదువుతున్నాయి.
- శివప్రసాద్, డీఎస్‌వో, పార్వతీపురం మన్యం జిల్లా...
Updated Date - 2023-08-18T00:33:13+05:30 IST