ఏనుగుల జోన్‌కు ప్రతిపాదనలు
ABN, First Publish Date - 2023-02-26T00:22:25+05:30
జిల్లాలో ఏనుగుల జోన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన తెలిపారు.
గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో ఏనుగుల జోన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన తెలిపారు. గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో అటవీశాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న టేకు, తదితర ప్లాంటేషన్లను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏనుగుల దాడిలో గత నాలుగేళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.40 లక్షల వరకూ నష్టపరిహారం రావల్సి ఉందన్నారు. సుమారు 3,900 ఎకరాల్లో పంటలను రైతులు నష్టపోయారని తెలిపారు. త్వరలోనే బాధితులకు పరిహారం అందజేస్తామని చెప్పారు. జిల్లాలో వనసంరక్షణ సమితులు, పైర్ ప్రొటెక్షన్ స్కీమ్‌ల కోసం రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల కోసం నివేదికలు పంపామన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విలువైన చెట్లను ఎవరైనా నరికితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో కురుపాం రేంజర్ వి.రాజబాబు, గుమ్మలక్ష్మీపురం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సింహాచలం, ఫారెస్ట్ బీట్ అధికారులు తిరుమలరావు, కడాయి, నీలవేణి, మోహన్‌రావు, ఫారెస్ట్ బేస్‌క్యాంప్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-02-26T00:22:26+05:30 IST