9 నుంచి టీడీపీ బస్సు యాత్ర
ABN, First Publish Date - 2023-07-04T00:07:51+05:30
జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుంచి టీడీపీ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
పార్వతీపురం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుంచి టీడీపీ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ.. పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ నెల 9న సాలూరులో, 10న పార్వతీపురం, 11న కురుపాం, 12న పాలకొండలో యాత్ర చేపడతామని వివరించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలపై ఇప్పటికే విశేష స్పందన వస్తోందన్నారు. ప్రధానంగా తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంత మంది పిల్లలు చదివినా.. ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం, 18 ఏళ్ల నుంచి ప్రతి మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, ప్రతి కుటుంబానికి ‘ దీపం ’ కింద ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, ఇంటింటికీ తాగునీటి కొళాయి ఏర్పాటు వంటి సంక్షేమ పథకాలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయని తెలిపారు.
గిరిజన సమస్యలపై మాట్లాడలేరా?
అబద్ధాలు చెప్పడంలో సీఎం జగన్ నెంబర్ వన్ అని, ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని అన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మన్యానికి మొండిచేయి చూపించి వెళ్లిపోయారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి ఆరోపించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించలేదని, సాగునీటి ప్రాజెక్టులు, గిరిజనుల సమస్యలపై కూడా మాట్లాడలేదని తెలిపారు. ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు కూడా మాట్లాడే అవకాశం కల్పించకపోవడం దారుణ మన్నారు. గిరిజన యూనివర్సిటీని మన్యం జిల్లాలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న రెండు ఐటీడీఏల ద్వారా గిరిజనులకు పూర్తిసేవలు సేవలు అందడం లేదన్నారు. గిరిజనులను అన్నింటా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. జిల్లా ప్రజలను పట్టిపీడిస్తోన్న ఏనుగుల సమస్యపై ముఖ్యమంత్రి ప్రస్తావించకపోవడం ఎంతవరకు సమంజమన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల ఇన్‌చార్జిలు నిమ్మక జయకృష్ణ, తోయిక జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-04T00:07:51+05:30 IST