మొక్కజొన్న రైతుకు క‘న్నీరు’
ABN, First Publish Date - 2023-05-02T00:28:19+05:30
అకాల వర్షంతో మొక్కజొన్న రైతుల మదిలో కలవరం మొదలైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షంలో తడిచిపోయింది. సేకరించాల్సిన పంటతో పాటు ఆరుబయట ఆరేసిన కంకులు కూడా తడిచిపోయాయి. పంటను రక్షించుకునేందుకు రైతులు సోమవారం ఉదయం నుంచి అనేక అవస్థలు పడడం కనిపించింది. అప్పటికప్పుడు టార్పాలిన్లు సేకరించి కప్పారు. నువ్వు పంట రైతులకూ ఇబ్బందులు తప్పలేదు.
వర్షాలకు తడిచిపోయిన పంట
మొలకలు వచ్చేస్తాయని ఆవేదన
నువ్వు రైతులకూ ఇబ్బందులు
అకాల వర్షంతో మొక్కజొన్న రైతుల మదిలో కలవరం మొదలైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షంలో తడిచిపోయింది. సేకరించాల్సిన పంటతో పాటు ఆరుబయట ఆరేసిన కంకులు కూడా తడిచిపోయాయి. పంటను రక్షించుకునేందుకు రైతులు సోమవారం ఉదయం నుంచి అనేక అవస్థలు పడడం కనిపించింది. అప్పటికప్పుడు టార్పాలిన్లు సేకరించి కప్పారు. నువ్వు పంట రైతులకూ ఇబ్బందులు తప్పలేదు.
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంటను రైతులు విస్తారంగా సాగు చేశారు. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల, గుర్ల, బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, చీపురుపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ తదితర మండలాల్లో పండిస్తున్నారు. ఖరీఫ్‌లో మంచి ధర పలికిన కారణంగా రబీలోనూ అనేక మంది రైతులు మొక్కజొన్న పంట వేశారు. అయితే రబీలో మొదటి నుంచి వర్షాలు వారిని టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. చివరిలో నష్టానికి గురి చేస్తున్నాయి. పంటను ఇటీవలే రైతులు కళ్లాలకు చేర్చి ఎండబెట్టారు. కొందరు రోడ్డుపక్కన ఆరేశారు. అయితే ఊహించని వర్షం వల్ల పంటకు నష్టం వస్తుందేమోనని భయపడుతున్నారు. పంట అయితే చాలాచోట్ల తడిచిపోయింది. భోగాపురం, పూసపాటిరేగ, గుర్ల, చీపురుపల్లి, గరివిడి ప్రాంతాల్లో ఈ పరిస్థితి కన్పించింది. రాజాం, బొబ్బిలి, తెర్లాం ప్రాంతాల్లో పంటను ఇంకా సేకరించాల్సి ఉంది. కంకుల నుంచి వేరు చేసిన పిక్కలతో పాటు పొలాల్లో ఉన్న కంకుల నుంచి కూడా మొలకలు వచ్చేస్తామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రబీలో 19220 హెక్టార్లలో మొక్కజొన్న వేశారు. భారీగా దిగుబడులు వస్తాయని ఆశిస్తున్న సమయంలో వర్షాలు నిరాశ పరుస్తున్నాయి. ఇదిలా ఉండగా జిల్లాలో నువ్వు పంట 10వేల ఎకరాల వరకు ఉంది. ప్రస్తుత వర్షాల కారణంగా ఈ పంటకూ నష్టమని రైతులు చెబుతున్నారు. రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందంటున్నారు. తడిచిన పంటను నిల్వ ఉంచే కొద్దీ నష్టం పెరిగే ప్రమాదం ఉంది.
కొనుగోలు కేంద్రాలు ఎప్పుడో?
మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది కాని ఎక్కడా ఈ పరిస్థితి లేదు. ఇప్పటికే రైతులు దళారుల వలలో పడిపోయారు. వారు రైతులను దోపిడీ చేస్తున్నారు. క్వింటాలుకు ప్రభుత్వం మద్దతు ధర రూ.1962గా ప్రకటించగా దళారులు రూ.1600 నుంచి రూ.1700 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా అరువు పద్ధతిలో కొనుగోలు చేసి వారు తిరిగి పంట విక్రయించాక చెల్లింపులు చేపడుతున్నారు. మరోవైపు పండిన పంటను భద్రపర్చుకునేందుకు కూడా చాలా మంది రైతులకు అవకాశాలు లేవు. ఆరుబయట విడిచి పెట్టలేక తక్కువ ధరకే అమ్ముతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేని కారణంగా దోపిడీకి గురవుతున్నారు.
ఆదేశాలు వచ్చిన వెంటనే కొనుగోలు
మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం. ప్రతి ఆర్‌బీకే కేంద్రమూ కొనుగోలు కేంద్రమే. ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలేదు. అదేశాల కోసం చూస్తున్నాం. బహిరంగ మార్కెట్లో రైతులకు ఆశాజనకమైన ధర లభిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు వద్ద రూ.1962గా ఉంది. ఆదేశాలొచ్చిన వెంటనే కొనుగోళ్లు ప్రారంభిస్తాం.
- విమల, డీఎం, మార్కోఫెడ్
Updated Date - 2023-05-02T00:28:19+05:30 IST