ఆడుదాం ఆంధ్రాకు ఆసక్తి అంతంతే !
ABN, Publish Date - Dec 27 , 2023 | 12:30 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఆడుదాం ఆంధ్రాకు అంతంత మాత్రమే స్పందన లభిస్తోంది. నమోదు చేసిన క్రీడాకారులు ఆటలకు దూరంగా ఉంటున్నారు. తొలిరోజు వలంటీర్లు, సచివా లయ సిబ్బంది ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యం కానరాలేదు.
తొలిరోజు ర్యాలీలతో ఆర్భాటం
మైదానాలు ఖాళీ.. కానరాని ప్రేక్షకులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఆడుదాం ఆంధ్రాకు అంతంత మాత్రమే స్పందన లభిస్తోంది. నమోదు చేసిన క్రీడాకారులు ఆటలకు దూరంగా ఉంటున్నారు. తొలిరోజు వలంటీర్లు, సచివా లయ సిబ్బంది ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యం కానరాలేదు. ఆటల్లోనూ కొన్ని చోట్ల వలంటీర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొనాల్సి వచ్చింది. క్రీడాకారుల నుంచి ఆసక్తి లేకపోవడంతో వలంటీర్లు రంగంలోకి దిగారు. నమోదు చేసుకున్న వారంతా ఆటల్లో పాల్గొనేందుకు వస్తారని ఆశించారు. మైదానాలు సిద్ధం చేశారు. గ్రామ స్థాయి, మండల స్థాయిలో క్రీడలు ఏర్పాటు చేశారు. అధికార పార్టీ కార్య కర్తలు కొన్ని చోట్ల పాలు పంచుకున్నారు. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో అయితే కార్యకర్తలు కూడా ముఖం చాటేశారు. భీమవరంలో ఖాళీ కుర్చీలు తారసపడ్డాయి. ఆటలను తిలకించేందుకు ప్రేక్షకులు పాల్గొనలేదు. క్రికిట్, వాలీబాల్, బాడ్మింటన్, కోకో, బాస్కెట్ బాల్ క్రీడలను నిర్వహించారు. ఒక్కో చోట ఒక్కో రకమైన క్రీడకు ప్రాధాన్యం ఇచ్చారు. గోతులతో ఉండడంతో క్రికెట్ ఆడేందుకు భీమవరం లోని ఓ మైదానంలో క్రికెట్ ఆడేందుకు క్రీడాకారులు ఆసక్తి చూపలేదు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆటలు తూతూ మంత్రంగానే సాగాయి. పాఠశాల విద్యార్థులను కొన్నిచోట్ల భాగస్వామ్యులను చేశారు. అంతే తప్పా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆడుదాం ఆంధ్రాపై క్రీడాకారులు ఆసక్తి చూపలేదు. ఆటల కోసం టెంట్‌లు వేశారు. చైర్‌లు సమకూర్చారు. క్రీడా కారులు లేకపోయినా సరే తమకు ఖర్చులు తప్పడం లేదంటూ సిబ్బంది వాపోతు న్నారు. ప్రతి పంచాయతీకి లక్ష రూపా యల వంతున వ్యయం కానున్నదని గగ్గోలు పెడుతున్నారు.
Updated Date - Dec 27 , 2023 | 12:30 AM