ఏఎంసీ కనుమరుగే
ABN, First Publish Date - 2023-03-31T23:52:40+05:30
జిల్లాలోనే భీమవరం వ్యవసాయ మార్కెట్ కమి టీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.
కలెక్టరేట్‌కు 20 ఎకరాలు కేటాయింపు
స్వాధీనం చేసుకోవాలంటూ ప్రభుత్వ ఉత్తర్వులు.. గతంలో నిరాకరించిన మార్కెటింగ్ శాఖ
తాజా నిర్ణయంతో ఏఎంసీ అధికారుల్లో విస్మయం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలోనే భీమవరం వ్యవసాయ మార్కెట్ కమి టీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. మార్కెట్ సెస్, అద్దెల రూపంలో ప్రభుత్వానికి ఏటా రూ.15 కోట్ల మేర అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతోంది. ధాన్యం ఆరబె ట్టేందుకు మార్కెట్ యార్డును రైతులు ఉపయోగిం చుకుంటున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు కోసం 1976లో అప్పటి ఎమ్మెల్యే కలిదిండి విజయనరసింహ రాజు స్థలాన్ని కొనుగోలు చేయడంలో కీలక పాత్ర వహించారు. అది ఇప్పుడు కనుమరుగు కాబోతోంది. జిల్లా కలెక్టరేట్ కోసం భీమవరం ఏఎంసిని కేటా యిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఇప్పుడు ఏఎంసి పాలకవర్గంలో కలవరపాటుకు గురి చేస్తోంది. మరోవైపు కలెక్టరేట్‌కు అనుకూలమైన ప్రాం తం ఏఎంసీ స్థలమేనని ప్రభుత్వం గుర్తించింది. రెవె న్యూ శాఖ మూడుచోట్ల స్థలాలను గుర్తించి ప్రభుత్వా నికి పంపింది. గునుపూడి, విస్సాకోడేరులో ప్రభుత్వ స్థలాలతోపాటు, భీమవరం మార్కెట్ యార్డును ప్రతి పాదించింది. చివరకు ప్రభుత్వం మార్కెట్ యార్డు వైపే మొగ్గు చూపింది. ఏఎంసీ నుంచి 20 ఎకరాల ను స్వాధీనం చేసుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌కు అధి కారాన్ని కట్టబెట్టింది. ఆ ప్రక్రియ ముందుకు వెళితే ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డు చరిత్ర పుటల్లోకి ఎక్కిపోనుంది.
నిరాకరించిన ఉన్నతాధికారులు
గతంలో మార్కెట్ యార్డును జిల్లా కలెక్టరేట్‌కు ప్రతిపాదిస్తే ఉన్నతాధికారులు నిరాకరించారు. రైతుల కు ఉపయోగపడే ఆస్తిని కలెక్టరేట్‌కు ఇచ్చేది లేదం టూ ఆ ప్రతిపాదనలను తోసిపుచ్చారు. దాదాపు రూ.100 కోట్లు విలువైన ఆస్తిని ఇవ్వకూడదంటూ మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టుదలతో ఉన్నారు. మార్కెటింగ్ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ కార్యదర్శికి భీమవరం మార్కెట్ యార్డు ఆవశ్యకతను క్షేత్రస్థాయి అధికారులు వివరించారు. దీంతో ఉన్నతాధికారులు స్థలం ఇచ్చేది లేదన్న అభిప్రాయంతో ఉన్నారు. ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ జారీచేసింది. మార్కె ట్ యార్డులో 20 ఎకరాలను స్వాధీనం చేసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది.
అంత స్థలం సాధ్యమేనా ?
జిల్లా కలెక్టరేట్‌కు భీమవరం ఏఎంసి అనువైనదని ప్రభుత్వం తేల్చింది. రవాణా సౌకర్యం ఉంది. మార్కె ట్‌యార్డుకు ఆనుకుని భీమవరం–తణుకు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం ఆటోలు తిరుగు తుంటాయి. జిల్లా ప్రజలు కలెక్టరేట్‌కు చేరుకోవడానికి రవాణా సౌకర్యం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నారు. అది ఎవరికీ అందుబాటులో లేదు. కలెక్టరేట్‌కు వెళ్లాలంటే జనం ఇబ్బందులు పడుతున్నారు. ఏఎంసీలో ఏర్పాటు చేస్తే అందుబాటులో ఉంటుంది. సువిశాలమైన స్థలం సమకూరుతుంది. దీనిపై కలెక్టరేట్ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఏఎంసీ వర్గాలు కంగుతిన్నాయి. అంత స్థలం మళ్లీ సమకూర్చుకోవడం సాధ్యమయ్యే పనికాదు. గోదాములు, ఇతర నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఇదే ఇప్పుడు మార్కెటింగ్ శాఖను కలవరపెడుతోంది.
ఏఎంసీలో ఏమున్నాయి
భీమవరం ఏఎంసీలో వేలాది టన్నుల సామ ర్థ్యం ఉన్న గోదాములు ఉన్నాయి. ఆక్వా మేత, ఇతర సరుకులు నిల్వ చేసుకుంటారు. ఏఎంసీకి అద్దె చెల్లిస్తారు. అదే యార్డులో రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి ఉపయోగించుకుంటారు. రైతు భరోసా కేంద్రాలు అక్కడ ఏర్పాటుచేశారు. తాజాగా ఎంపెడా కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఏఎంసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Updated Date - 2023-03-31T23:52:40+05:30 IST