అంగన్‌వాడీలను అడ్డుకున్న పోలీసులు
ABN, First Publish Date - 2023-03-21T00:06:34+05:30
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన చలో విజయవాడను పోలీసులు భగ్నం చేశారు.
ఆకివీడు, మార్చి 20: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన చలో విజయవాడను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం విజయవాడ వెళుతున్న అంగన్‌వాడీలను స్థానిక రైల్వే స్టేషన్‌లో పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే వారు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా నిరసనలు తెలిపారు. ఆందోళన కారులను ఉదయం 8 నుంచి 11 గంటలు వరకు పోలీస్ స్టేషన్‌లో ఉంచి ఇళ్ళకు పంపించారు.
నరసాపురం టౌన్: అంగన్‌వాడీల చలో విజయవాడ కార్యక్రమాన్ని సోమవారం పోలీ సులు భగ్నం చేశారు. విజయవాడ వెళ్లకుండా రైల్వే, బస్టాండ్‌ల్లో అడ్డుకున్నారు. గంటల కొద్ది రైల్వే స్టేషన్ విశ్రాంతి హాల్‌లో ఉంచేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్త ంగా అంగన్‌వాడీలు ఛలో విజయవాడ నిరసన కార్యక్రమానికి బయలుదేరారు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్న పోలీసులు ఉదయం 4గంటల నుంచే రైల్వే, బస్టాండ్లలో మోహరిం చారు.
భీమవరం అర్బన్: విజయవాడకు వెళ్ళన్విలేనందుకు నిరసనగా అంగన్వాడీలంతా ప్రకాశం చౌక్‌కి చేరుకుని నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించాలనే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డు కున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాసేపు తోపులాట, వాగ్వివదం జరిగింది. కార్యక్రమంలో సీఐటీయు జిల్లా కార్యదర్శి కల్యాణి, నాయకులు ఎం.ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్, విజయలక్ష్మి, విమల, మేరిగ్రేష్, వరలక్ష్మి, అరుణ, సుష్మ తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పలుచోట్ల అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా కార్యదర్ళి బి.బలరాం అన్నారు.
పాలకొల్లు అర్బన్: పాలకొల్లు, పోడూరు మండలాలకు చెందిన సుమారు 40మంది అంగన్‌వాడీలు సోమవారం ఉదయం 5.30 గంటలకు పాలకొల్లు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వారిని విజయవాడ వెళ్ళకుండా పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సిఐటియు కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్, పోడూరు ప్రాజెక్టు నాయకు రాలు రాజమణిలతో పాటు రైల్వే స్టేషన్‌కు వచ్చిన అంగన్‌వాడీలను అదుపులోకి తీసుకున్నారు.
తణుకు: చలో విజయవాడ వెళుతున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీవీ ప్రతాప్, కేతా గోపాలన్ తెలిపారు. సోమవారం టౌన్, రూరల్ పోలీసు స్టేషన్‌లలో అరెస్టయిన వారిని పరామర్శించారు. సీపీఎం నాయకులు అడ్డగర్ల అజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
కాళ్ళ: సీఐటీయూ మండల అధ్యక్షుడు గొర్ల రామకృష్ణ, అంగన్‌వాడీ నాయకులు దావులూరి మార్తమ్మతో పాటు మండలంలోని అంగన్‌వాడీ టీచర్లుని సోమవారం తెల్లవారుజామున కాళ్ళ ఎస్‌ఐ మూర్తి హౌస్ అరెస్టు చేశారు.
వీరవాసరం: వీరవాసరం బస్టాండ్ సెంటర్‌లో అంగన్‌వాడీలు ఆందోళనకు దిగారు. సమస్యలను పరిష్కరించవలసినది పోయి అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించటం దారుణమని సీఐటీయూ నాయకుడు ఎం.ఆంజనేయులు అన్నారు.
Updated Date - 2023-03-21T00:06:34+05:30 IST