Rs 2000 Notes: రూ.2 వేల నోటును బ్యాంకుకు వెళ్లి మార్చుకోండి తప్ప ఈ పని మాత్రం చేయకండి..!
ABN, First Publish Date - 2023-05-22T18:39:53+05:30
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీవారి ఆలయంలో రద్దైన కరెన్సీ నోట్ల కట్టలు స్ట్రాంగ్ రూమ్‌ల్లో మూలుగుతున్నాయి. వాటిని మార్పిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక..
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీవారి ఆలయంలో రద్దైన కరెన్సీ నోట్ల కట్టలు స్ట్రాంగ్ రూమ్‌ల్లో మూలుగుతున్నాయి. వాటిని మార్పిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆలయ అధికారులు సతమతమౌతున్నారు. ఈ ఆలయమే కాదు, రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లోని స్ట్రాంగ్ రూమ్‌ల్లో రద్దయిన కరెన్సీ నోట్లు మూలుగుతున్నాయి. ఇదే జాబితాలో తాజాగా రూ.2000 నోటు చేరబోతోంది.
ఆలయ హుండీలు తెరిస్తే చాలు ఇప్పటికీ పాత రూ.500, రూ.1000 నోట్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఈ నోట్లు రద్దయి దాదాపు ఏడేళ్లు గడచినా కొందరు భక్తులు ఇంకా ఆ నోట్లను హుండీలలో వేస్తూనే ఉన్నారు. దీంతో ఇవి ఆలయాల స్ట్రాంగ్ రూమ్‌ల్లో కట్టలుకట్టలుగా పేరుకుపోతున్నాయి.
ప్రస్తుతం రూ.2 వేల నోటు రద్దయి సెప్టెంబర్ వరకూ మార్పిడికి సమయం ఉన్నప్పటికీ ఆ తరువాత హుండీలలో చేరే వాటిని తలుచుకుని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే రూ.500, రూ. 1000 నోట్లను అధికారులు దాచలేక, పడేయలేక నానా తంటాలు పడుతున్నారు. విలువ లేని ఈ నోట్లను మూటల్లో కట్టి బీరువాల్లో భద్రపరుస్తున్నారు. ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, పెనుగంచిప్రోలు వంటి ప్రముఖ ఆలయాల్లో కోట్లాది రూపాయల మేర రద్దయిన పాత కరెన్సీ పేరుకుపోయింది. నోట్లు రద్దయిన రెండేళ్ల తర్వాత దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు అన్ని ఆలయాల సిబ్బంది ముంబాయిలోని రిజర్వ్ బ్యాంక్‌కు వెళ్లి పాత నోట్లు మార్చమంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు లేవని చెప్పడంతో వారు వెనుతిరిగారు.
మొక్కుబడులుగా..
చిన వెంకన్న దేవస్ధానంలో మార్చి 31, 2023 నాటికి రూ.83.53 లక్షల విలువైన పాత కరెన్సీ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మే నెల హుండీల లెక్కింపులో కూడా రూ.500 నోట్లు 19, రూ.1000 నోట్లు తొమ్మిది వచ్చాయి. తమ వద్ద ఉన్న రద్దైన నోట్లను పారేయడం ఇష్టం లేకే భక్తులు మొక్కుబడుల పేరుతో హుండీలలో వేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని దాయడం తప్ప ఏం చేయలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Updated Date - 2023-05-22T18:40:16+05:30 IST