Eluru Dist.: నేడు ద్వారకాతిరుమలలో గిరి ప్రదక్షిణ
ABN, Publish Date - Dec 22 , 2023 | 09:01 AM
ఏలూరు: ద్వారకాతిరుమలలో శ్రీవారి గిరి ప్రదక్షిణ శుక్రవారం జరగనుంది. శేషాచల కొండ చుట్టూ 6 కి.మీ. మేర భక్తులు, గోవింద స్వాములు గిరిప్రదక్షిణ చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు చిన వెంకన్న పాదాల వద్ద గిరిప్రదక్షిణ ప్రారంభంకానుంది.
ఏలూరు: ద్వారకాతిరుమలలో శ్రీవారి గిరి ప్రదక్షిణ శుక్రవారం జరగనుంది. శేషాచల కొండ చుట్టూ 6 కి.మీ. మేర భక్తులు, గోవింద స్వాములు గిరిప్రదక్షిణ చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు చిన వెంకన్న పాదాల వద్ద గిరిప్రదక్షిణ ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. శనివారం ముక్కోటి పర్వదినం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు.
ద్వారకా తిరుమల శ్రీవారి గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. ముక్కోటి ఏకాదశి పర్వదినం ముందురోజున గిరిప్రదక్షిణ చేయడం ఇక్కడ సంప్రదాయం. ఈ క్రమంలో ఇప్పటికే ఆ మార్గాన్ని సిబ్బంది శుభ్రం చేశారు. స్థానిక శ్రీవారి పాదుకామండపం వద్ద నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ యాత్ర అట్టహాసంగా ప్రారంభమవుతుంది. సుమారు ఆరు కిలోమీటర్ల మేర గజ, అశ్వ, భజన మండళ్లు, కోలాటాలు, గోవింద దీక్షాధారుల స్వామి నామస్మరణలతో యాత్రను వైభవంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభానికి రెండు గంటల ముందు ఎండుగడ్డిని ఒకపొరగా పరిచి నీటితో తడుపనున్నట్టు అధికారులు తెలిపారు. భక్తులకు మార్గమధ్యలో నాలుగు చోట్ల మంచినీరు, ప్రసాదం, టీ కాఫీ, బిస్కెట్, పాలు వంటివి ఇచ్చేలా చర్యలు చేపట్టారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలో శనివారం జరిగే ముక్కోటి పర్వదిన వేడుకలకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఆ రోజు శ్రీవారిని ఉత్తరద్వారం మీదుగా వీక్షించే క్రమంలో ఇప్పటికే ఉత్తరద్వారాలను సిద్ధం చేశారు. ఆలయ గోపురాలు విద్యుత్ దీప తోరణాలతో, రంగులతో ముస్తాబయ్యాయి. శ్రీవారు వెండిగరుడ, శేషవాహనాలపై కొలువై భక్తులకు దర్శనమీయనున్నారు. సంబంధిత వాహనాలను సిబ్బంది ముస్తాబు చేశారు.
విస్తృత ఏర్పాట్లు చేశాం : ఈవో
ముక్కోటి రోజున ఉదయం 4.30 గంటల నుంచి ప్రొటోకాల్, సర్వదర్శనం, రూ.100, 200, 500 టికెట్లు ఏర్పాటు చేస్తున్నామని ఈవో వి.త్రినాథరావు తెలిపారు. రూ.500లకు స్లాట్స్ సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు. గోవింద స్వాములకు, స్థానికులకు ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశామని, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్స్, అధిక సంఖ్యలో భక్తులకు రానుండడంతో ఉదయం 9.30 గంటల నుంచి అన్నప్రసాదానికి అనుమతి ఉంటుందన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే స్థానికులు తమ గుర్తింపు కోసం ఆధార్ లేదా ఏదో ఒక ఐడీ తెచ్చుకోవాలని ఈవో కోరారు.
Updated Date - Dec 22 , 2023 | 09:01 AM