పోలీసు అడ్డా
ABN, First Publish Date - 2023-02-12T00:38:02+05:30
ఖాకీ చొక్కా, తలపై టోపీ, చేతిలో లాఠీ.. ఇదీ పోలీసు చిహ్నం. సమాజసేవలో.. బాధితులకు అండగా, నేరస్తులకు సింహ స్వప్నంగా గుర్తింపు లభించాలంటే అది ఒక్క పోలీసు ద్వారానే సాధ్యం
గుర్వాయిపాలెం నుంచే వంద మంది ఖాకీలు
కలిదిండి, ఫిబ్రవరి 11 : ఖాకీ చొక్కా, తలపై టోపీ, చేతిలో లాఠీ.. ఇదీ పోలీసు చిహ్నం. సమాజసేవలో.. బాధితులకు అండగా, నేరస్తులకు సింహ స్వప్నంగా గుర్తింపు లభించాలంటే అది ఒక్క పోలీసు ద్వారానే సాధ్యం. అలాంటి ఉద్యోగం దక్కించుకు నేందుకు ఎంతో మంది రాత్రింబవళ్లూ కష్టపడుతూనే ఉం టారు. ఖాకీ చొక్కా ధరించడమనేది చాలామందికి ప్యాషన్. ఇందుకోసమేనేమో ఆ ఊరు ఊరంతా పోలీసు ఉద్యోగాల బాట పట్టింది. ఐదు వేలు జనాభా కూడా లేని కలిదిండి మండలం గుర్వాయిపాలెం పోలీసుల ఊరుగా రాష్ట్రవ్యాప్తం గా ప్రసిద్ధి చెందింది. పోలీసు సెలక్షన్లకు ఈ గ్రామం నుంచి యువత వెళితే కొలువు గ్యారంటీ అనే నానుడి మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఒకరు సాధించిన పోలీసు ఉద్యోగం గ్రామ యువతలో స్ఫూర్తినింపింది. ఒక్కో కుటుం బంలో ఇద్దరు, ముగ్గురు పోలీసు ఉద్యోగాలు సాధించారు. గ్రామం నుంచి 100 మందికిపైగా ఖాకీ చొక్కాలను సొంతం చేసుకున్నారు.
ఇలా మొదలైంది
గుర్వాయిపాలెం కబడ్డీ ఆటకు పెట్టింది పేరు. శరీర దారుఢ్యం కోసం గ్రామంలో యువకులు రోజూ పాఠశాల వద్ద వ్యాయామం చేసేవారు. కబడ్డీ ఆడేవారు. దీంతో పోలీసు సెలక్షన్లకు ఈ గ్రామం నుంచి వెళ్లి యువకులు రన్నింగ్, హైజంప్, లాంగ్ జంప్, 100 మీటర్లు, 200 మీటర్లలో ప్రతిభ చూపుతున్నారు. కబడ్డీ పోటీల్లో సత్తా చాటుతున్నారు. ఇది పోలీసు ఉద్యోగానికి తొలి మెట్టుగా నిలిచింది. తొలుత యార్లగడ్డ నాంచారయ్య కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందారు. తర్వాత గోదావరి రంగయ్య రాజమ్మల కుమారులు మురళి (రిటైర్డ్ డీఎస్పీ), ఉమామహేశ్వరరావు (ఏఎస్‌ఐ – మచిలీపట్నం), శ్రీనివాసరావు (సీసీ డీఎస్పీ) 1988–89 బ్యాచ్‌లో ఒకేసారి ఎంపికయ్యారు. ఇదే బ్యాచ్‌లో గ్రామానికి చెందిన పయ్యెద్దు ప్రకాశరావు ఉద్యోగం సాధిం చారు. తర్వాత ఒకే కుటుంబానికి చెందిన బొల్లా రాంబాబు, బొల్లా వెంకటేశ్వరరావు, పోసిన శ్రీనివాసరావు, పోసిన నాగరాజు, పడమటి రామకృష్ణ, పడమటి రవికాంత్ కొలువు లు పొందారు.
మొత్తం గ్రామంలో సుమారు 60 కుటుంబాల నుంచి పోలీసు ఉద్యోగాలు పొందారు. డీఎస్పీ 1, ఏఎస్‌ఐలు 4, హెడ్ కానిస్టేబుల్స్ 3, కానిస్టేబుల్స్ 55, హోం గార్డులు 40 మంది ఉన్నారు. తాజాగా విడుదలైన కాని స్టేబుల్, ఎస్‌ఐలో నోటిఫికేషన్‌లలో పెద్ద సంఖ్యలో దరఖా స్తులు పెట్టారు. ఇందులో కూడా కొందరు జాబ్స్ సాధించ డం ఖాయమని నమ్మకంతో ఉన్నారు.
ప్రజా సేవ చేయటం అదృష్టం
పోలీసు శాఖలో సేవ చేయటం అదృష్టంగా భావిస్తున్నా. నాతోపాటు ఇద్దరు సోదరులు పోలీసులుగా పనిచేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ లక్ష్యాన్ని నిర్ణయించుకుని శ్రమిస్తే జీవితంలో విజయం సాధిస్తారు. ఈ స్ఫూర్తితో మరింత మంది యువత ముందుకు రావాలి.
గోదావరి మురళి, డీఎస్పీ (ఇంటెలిజెన్స్)
విజయాలకదే కారణం
గ్రామంలో యువకులంతా వ్యాయామం చేయడంతో ఫిట్‌గా ఉండి పోలీసు శాఖలో కొలువు తీరుతున్నారు. నేను కూడా వ్యాయామంతోపాటు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవడంతో ఎస్‌ఐ ఉద్యోగం పొందాను. డీఎస్పీ మురళీని ఆదర్శంగా తీసుకుని 100 మందికిపైగా పోలీసు కొలువులు సాధించారు.
కలిదిండి రాజేష్, ఎస్‌ఐ విజయవాడ
గర్వంగా భావిస్తున్నా
పోలీసుశాఖ ద్వారా సమాజసేవ చేయటం ఎంతో గర్వంగా భావిస్తున్నా. మా కుటుంబం నుంచి పోలీసు శాఖలో పలువురు విధులు నిర్వర్తించటంతో వారిని ఆదర్శంగా తీసుకుని ఈ ఉద్యోగంలోకి వచ్చాను. చాలా సంతృప్తిగా ఉంది.
గోదావరి శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ, గుడివాడ
ఆదర్శంగా తీసుకోవాలి
గ్రామం నుంచి పోలీసు శాఖలో కొలువు తీరిన వారిని యువత ఆదర్శంగా తీసు కుని ఉన్నత ఉద్యోగాలను సాధించాలి. నీతి, నిజాయితీ పనిచేస్తూ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి. గ్రామం నుంచి 100 మందికి పైగా పోలీసులు ఉండటం ఎంతో గర్వంగా ఉంది.
బత్తిన ఉమామహేశ్వరరావు, గ్రామ సర్పంచ్
ముగ్గురు బిడ్డలూ పోలీసులే..
మా కుటుంబంలో ముగ్గురు బిడ్డలను పోలీసు శాఖకు అందిం చాను. అందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మా బిడ్డలు ప్రజలకు సేవ చేయటం ఎంతో గర్వంగా ఉంది. పండుగ సమ యంలో అందరూ ఇంటికి వస్తారు. వారిని చూస్తుంటే ఎంతో గర్వం గాను, సంతోషం గాను ఉంటుంది.
– గోదావరి రాజమ్మ, డీఎస్పీ మురళి తల్లి
Updated Date - 2023-02-12T00:38:04+05:30 IST