ఆకాశంలో మబ్బులు.. అన్నదాత గుబులు!
ABN, First Publish Date - 2023-04-23T23:47:45+05:30
వాతావరణం రైతులను భయపెడుతోంది. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం, దానికి తగ్గట్టుగా ఆదివారం తెల్లవారుఝామున పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో పాటు ఈదురుగాలులు వీయడంతో రైతులు బెంబేలెత్తిపోయారు.
కల్లాల్లోనే ధాన్యం..కలవరపరుస్తున్న వాతావరణం
జిల్లాలో స్వల్పంగా చిరు జల్లులు
రైతుల్లో ఆందోళన.. ధాన్యం ఒబ్బిడి
తగ్గిన ఉష్ణోగ్రతలు.. ఎండల నుంచి ఉపశమనం
ఏలూరుసిటీ, ఏప్రిల్ 23 :
వాతావరణం రైతులను భయపెడుతోంది. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం, దానికి తగ్గట్టుగా ఆదివారం తెల్లవారుఝామున పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో పాటు ఈదురుగాలులు వీయడంతో రైతులు బెంబేలెత్తిపోయారు. ధాన్యం కల్లాల్లోకి పరుగులు తీశారు. ఇప్పుడు ధాన్యం తడిస్తే మద్దతు ధర రాదని, తేమశాతం పెరిగిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వేసవి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 35డిగ్రీలకు పడిపోయాయి.
జిల్లాలో 90వేల 720 ఎకరాల్లో రబీ వరి సాగు, లక్షకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న పంటకు చేతికి అందడం, ఇంకా కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరగక పోవడంతో ఆయా రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీ వరి సాగులో పంట బాగానే పండింది. కోసిన ధాన్యాన్ని కుప్పలుగా వేయడం, ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవడంలో రైతులు నిమగ్నమయ్యారు. మబ్బుల వాతావరణంతో ఆదివారం ధాన్యం మాసూళ్లను నిలిపి వేశారు. ధాన్యంపై బరకాలు కప్పారు. కోసిన వరి పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించడంలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. 17లోపు తేమ శాతం ఉంటేనే మద్దతు ధర లభిస్తుందని, వర్షాలకు ధాన్యం తడిస్తే తేమ శాతం పెరిగి మద్దతు ధర రావటం కష్టతరమని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఆరు మండలాల్లో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ప్రస్తుతం వరి కోతలు ప్రారంభిస్తున్నారు. రబీ వరి పంట దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నాయని చెబుతున్నారు. అనుకున్నదానికంటె ఎక్కువగానే వరి దిగుబడులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత వాతావరణం రైతులను కలవరపెడుతోంది. మరోవైపు మామిడి రైతులు కూడా వాతావరణ మార్పులతో ఆందోళన చెందుతున్నారు.
ముసురుతో రైతుల్లో ఆందోళన
చింతలపూడి/చాట్రాయి : ముసురు వాతావరణంతో చింతలపూడి మండలంలోని రైతులు ఆందోళన పడుతున్నారు. ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభిస్తున్నారు. మొక్కజొన్న పంట కల్లాలపైనే ఉంది. ఆదివారం సాయంత్రం ఆకాశం మేఘావృతం కావడంతో రైతులు పరుగులు పెట్టారు. గతంలో కల్లాలపై ఆరబోసిన పంటను కాపాడుకోవడానికి బరకాలను సబ్సిడీపై రైతులకు అందించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ముందస్తుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని, సంచులు సిద్ధం చేయాలని రైతుసంఘాలు డిమాండ్ చేసినా కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరగడంతో ధాన్యం రైతుల వద్దే ఉండి పోయింది. ముసురు వాతావరణంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
చాట్రాయి మండలంలో సుమారు 10 వేల ఎకరాల్లో రబీ మొక్కజొన్న సాగుచేశారు.. ప్రస్తుతం 40 శాతం మొక్కజొన్న పంట కల్లాలపై ఉంది. పెద్ద వర్షాలు పడితే పంట తడిసి తీవ్రంగా నష్టపోతామని రైతులు భయపడుతున్నారు. కల్లాలపై పంటను తడవకుండా కాపాడుకోడానికి రైతులు పట్టాలు కప్పుతున్నారు.
ఆక్వా రైతుల్లో ఆందోళన
కలిదిండి, : వాతావరణంలో మార్పులతో ఆదివారం అకాల వర్షం కురవడంతో ఆక్వా రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షం కారణంగా చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్ సమస్య ఏర్పడి రొయ్యలకు వైరస్ సోకి చనిపోయి లక్షలాది రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వేసవిలో రొయ్యల సాగుకు వాతా వరణం అనుకూలంగా ఉండడంతో మండలంలో సుమారు 15 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేపట్టారు. 100 కౌంటు దశలో అధికంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో అకాల వర్షాలు కురుస్తుండడంతో ఆక్సిజన్ కొరత నివారణకు చెరువుల్లో నిరంతరాయంగా ఏరియేటర్లు తిప్పుతున్నారు. విద్యుత్ కోత ఏర్పడితే ప్రత్యామ్నాయంగా అద్దె జనరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే రొయ్యలకు గిట్టుబాటు ధర లేక మేతల ధరలు, విద్యుత్ ధరలు పెరగడంతో నష్టాల పాలయ్యారు. అకాల వర్షాలతో పంట చేతికి వస్తోందో లేదోనని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.
ధాన్యం తడిస్తే ప్రభుత్వానిదే బాధ్యత..
భీమడోలు, ఏప్రిల్ 23 : అకాల వర్షానికి ధాన్యం తడిసిపోతే ప్రభు త్వమే బాధ్యత వహించాలని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ హెచ్చరించారు. ధాన్యం రవాణాకు లారీలు ఏర్పాటు చేయాలం టూ ఆదివారం భీమడోలు మండలం పూళ్ళలో ఏపీ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రైతులు ధాన్యం బస్తాలు రోడ్డుపై ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా తెరవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని గోనెసంచుల రవాణా, హమాలీలు వంటి సమస్యలు పరిష్కరించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. సీపీఎం నాయకులు లింగరాజు, రైతు సంఘం నాయకులు కట్టా భాస్కరరావు, కౌలు రైతులు పాల్గొన్నారు.
గోనె సంచులు ఇవ్వండి : ఏపీ రైతు సంఘం
ఉంగుటూరు : రైతులకు, కౌలు రైతులకు ధాన్యం పట్టుబడులకు గోనె సంచులు ఇవ్వాలని రవాణాకు లారీలు ఏర్పాటు చేయాలని ఏపీ రైతు, కౌలు రైతు సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. కైకరంలో ఆదివారం వారు కల్లాలను, ధాన్యం రాశులను పరిశీలించారు.ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, కౌలు రైతు సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు, వెజ్జు శ్రీరామమూర్తి, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-23T23:48:29+05:30 IST