రైతు పక్షాన తెలుగుదేశం
ABN, First Publish Date - 2023-05-10T00:27:22+05:30
నూక శాతం పేరుతో రైతుల నుంచి వసూలు చేసిన సొమ్మును తిరిగి చెల్లించాలని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ డిమాండ్ చేశారు.
అడ్డుకున్న పోలీసులు..
నిమ్మల, అంగర వాగ్వాదం
పాలకొల్లు రూరల్/యలమంచిలి : నూక శాతం పేరుతో రైతుల నుంచి వసూలు చేసిన సొమ్మును తిరిగి చెల్లించాలని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ డిమాండ్ చేశారు. రైతుల కష్టాలపై పాలకొల్లు, యలమంచిలి తహశీల్దార్ కార్యాలయాల వద్ద రైతులతో కలిసి నిరసన ప్రదర్శనకు దిగారు. వీరిని పోలీసులు అడ్డగించడంతో తోపులాట జరిగింది. తమ గోడును చెప్పుకునేందుకు రైతులు అధికారుల వద్దకు రాకూడదా అంటూ పోలీసులను ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల నిలదీశారు. రైతులను నిలువ దోపిడీ చేస్తున్న రైస్ మిల్లుల వద్దకు వెళ్లని పోలీసులు.. దగా పడ్డ రైతులను నిలువరించడం ఏమిటని ఎమ్మెల్యే నిమ్మల పోలీసులు, అధికారులపై మండిపడ్డారు. పాలకొల్లులో రైతులతో కలిసి ఉరి ప్రదర్శన చేయడంతో పట్టణ సీఐ డి.రాంబాబు ఉరి ప్రదర్శనలకు అనుమతులు లేవని, వాటిని తక్షణమేతొలగించాలని చెప్పడంతో ఎమ్మెల్యే నిమ్మల స్వయంగా ఉరి వేసుకోవడంతో అప్రమక్తమైన పోలీసులు బలవంతంగా తాడును తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 256 బస్తాల ధాన్యం అమ్మగా మిల్లుకు రూ.18 వేలు చెల్లించానని రైతు పెచ్చెట్టి ఆంజనేయులు, 441 బస్తాలు అమ్మగా రూ.45 వేలు చెల్లించామని మరో రైతు బొక్కా శ్రీను తహసీల్దారు ఎల్.నర్శింహరావుకు వివరించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను తహశీల్దార్లకు అందజేశారు. రుద్రరాజు సత్యనారాయణరాజు, మాతా రత్నంరాజు, బొప్పన హరికిశోర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-10T00:27:22+05:30 IST