సవాళ్ల సైకిల్ !
ABN, First Publish Date - 2023-03-29T00:35:04+05:30
ఎన్టీఆర్ స్ఫూర్తిని గుండెనిండా నింపుకుని, చంద్రబాబు ఆశయాలను పది మందికి చేర్చిన సైకిల్ నాలుగు దశాబ్దాలు అలవోకగా ప్రయాణించింది. తెలుగు నేలపై అనేక సవాళ్లకు ప్రతికూల, అనుకూల సమయాల్లో ప్రజల అండ పార్టీకి అస్తిత్వంగా మార్చుకుని నేడు 41వ ఏట అడుగుపెట్టి మున్ముందుకు పరుగులు తీస్తోంది.
నేడు 41వ ఏట అడుగిడిన తెలుగుదేశం
ఆనాడు ఎన్టీఆర్ చేయెత్తి జైకొట్టారు
నాలుగు దశాబ్దాల క్రితమే తెలుగు నేలపై పసుపు జెండా
అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక అనుకూల, ప్రతికూలతలు
ప్రజల చేయి వీడలేదు.. పోరాటాలు ఆపలేదు
ఉమ్మడి పశ్చిమలో యోధానుయోధులంతా టీడీపీ జెండా కిందే
అప్పుడు వైఎస్సార్‌తో, ఇప్పుడు జగన్‌తో ఢీ అంటే ఢీ
పాత అనుభవాలను నెమరేసుకుని కొత్త బాటన తమ్ముళ్లు
ఎన్టీఆర్ స్ఫూర్తిని గుండెనిండా నింపుకుని, చంద్రబాబు ఆశయాలను పది మందికి చేర్చిన సైకిల్ నాలుగు దశాబ్దాలు అలవోకగా ప్రయాణించింది. తెలుగు నేలపై అనేక సవాళ్లకు ప్రతికూల, అనుకూల సమయాల్లో ప్రజల అండ పార్టీకి అస్తిత్వంగా మార్చుకుని నేడు 41వ ఏట అడుగుపెట్టి మున్ముందుకు పరుగులు తీస్తోంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ తెలుగుదేశంను స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్రతిహతంగా తెలుగువారి సత్తాకు కేరాఫ్‌గా నిలిచి అధికారంలో ఉన్నా, ప్రతిపక్ష పాత్ర పోషించినా ఎన్నడూ జనం బాట వీడలేదు. ఎన్‌టీఆర్ నింపిన స్ఫూర్తితో ముందుకు సాగుతూనే ఉంది. టీడీపీ ఆవిర్భావంలో అంటే 1982లో ఎన్టీఆర్ పసుపు జెండా ఎగురవేయగా, పశ్చిమలో విద్యావంతులు, యువత, వైద్యులు, ఎన్టీఆర్ అభిమానులు మేమున్నామంటూ ముందు వరుసలో నిలిచారు. సినిమా నటుడి పార్టీ అంటూ అప్పట్లో కాంగ్రెస్ ఎద్దేవా చేసినా, మిగతా వారు మరెంతగానో చలోక్తులు విసిరినా ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం ఎవరినీ చెదరనీయలేదు. ఆవిర్భావం తరువాత తెలుగుదేశం పశ్చిమగోదావరి జిల్లా తొలి కన్వీనర్‌గా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన కోడూరి రామచంద్రరావు పార్టీ పగ్గాలు అందుకున్నారు. ఆ తరువాత వరుసగా దెందులూరు నుంచి రాధాకృష్ణ, భీమవరం నుంచి గొల్ల వెంకన్న, నరసాపురం నుంచి తాళ్ళూరి ఇందిరాదేవి, రాధాకృష్ణ, కొవ్వూరి నుంచి బుచ్చిరాయుడుతో సహా అనేక మంది తెలుగుదేశం బాట పట్టారు. అప్పట్లో పిల్ల నారాయణరావు, బొల్లి సాయిబాబా, పిల్లంగోళ్ళ రంగారావు, వెంకన్నబాబు, అప్పటి ఎన్టీఆర్ యువసేన జిల్లా అధ్యక్షుడు పాలి ప్రసాద్ ముందు వరుసలో ఉన్నారు.
అప్పటి నుంచి ఇప్పటివరకు యోధానుయోధులు ఎందరో..
ఏలూరు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఉమ్మడి పశ్చిమలో పార్టీలో యోధానుయోధులు పనిచేశారు. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా రాణించారు. దాదాపు ఐదు సాధారణ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను అందుకుంది. 2004, 2009, 2019లో వరుసగా ఒక డిజిట్‌లోనే స్థానాలు నిలబెట్టుకుంది. అయినా అప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీలో అనేక మంది పార్టీ రథసారథులుగా వ్యవహరించారు. షరీఫ్, నారాయణస్వామి, సారధి, నరసింహరాజు, అల్లు సత్యనారాయణ, కోటగిరి విద్యాధరరావు, బోళ్ళ బుల్లిరామయ్య, హరిరామజోగయ్య, మరడాని రంగారావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, కృష్ణబాబు వంటి నేతలెందరో పార్టీకి అండగా నిలబడ్డారు. వీరంతా ఒకటికి రెండుసార్లు అలవోకగా గెలుపొందినవారే. తణుకులో ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్, దెందులూరులో గారపాటి సాంబశివరావు వంటి నేతలంతా పార్టీకి ఓ వైపు కొమ్ముకాశారు. ఆ తరువాత ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీ పగ్గాలు అందుకున్న తరువాత కూడా పార్టీ రాణిస్తూనే వచ్చింది. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి ఉమ్మడి పశ్చిమలో 15 స్థానాలకుగాను 14 స్థానాలు అలవోకగా గెలుపొందడానికి ప్రజానీరాజనమే కారణం. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం అనేక సవాళ్ళను అధిగమించే ప్రయత్నం చేసింది. సీనియర్లు కోటగిరి విద్యాధరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి వారు పార్టీ మారినా, వారి స్థానంలో కొత్త తరానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. పదవుల్లోను ఒకింత బీసీ వర్గాలతోపాటు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం పార్టీలో మరిచిపోలేని విషయం. అయినప్పటికీ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రతిపక్షంగా తెలుగుదేశం వ్యవహరించింది. అప్పట్లో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు తొలి అడ్డు గోడగా నిలిచేది తెలుగుదేశమే. ఒకప్పటి నేతలంతా వయోభారంతో ఉన్నా వారి సలహాలు, సూచనలను ఇప్పటి తరం తీసుకుంటూ పార్టీకి తిరుగులేని జీవం పోస్తూ వచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఎదుర్కొన్న సవాళ్ళు, అనుభవాల నడుమ కేడర్ పటిష్టంగా మారింది.
ఇది ఎన్నికల కాలం..
తెలుగుదేశం ప్రతీ ఏటా మహానాడును తమ పార్టీ ఆవిర్భావ సంకేతంగా కార్యకర్తల్లో స్ఫూర్తినింపేలా నిర్వహించేది. కరోనా సమయంలో కరోనా కారణంగా మహానాడును నిర్వహించలేకపోయారు. కాని ఈసారి పార్టీలో రెట్టించిన ఉత్సాహం తొణికిసలాడుతుంది. 2019 ఎన్నికల్లో పరాజయం మూటకట్టుకున్నా ఈసారి అధికారం చేజిక్కించుకోవాలన్న తపన, ఆరాటం, ఆశయం ప్రతీ ఒక్కరిలో బలమైన స్ఫూర్తి నింపుతుంది. అందుకనే అధికార పక్షం ఆగడాలకు ఎదురొడ్డి నిలుస్తుంది. ఈ ఏడాది ఎన్నికల కాలం కావడంతో ఈసారి గత తప్పిదాల అనుభవాలను పునరాలోచించుకుని ఏకీకృత విధానంలో అందరినీ కలుపుకుపోయే స్ఫూర్తిదాయకంగా పార్టీ పనిచేయబోతుంది. జిల్లాల విభజన జరిగినా ఆ మేరకు ఎక్కడికక్కడ పార్టీ నిర్మాణం, యంత్రాంగం నడిపేందుకు కావాల్సిన నాయకత్వం క్షణాల్లో సమకూర్చింది. ఏలూరు జిల్లాకు గన్ని వీరాంజనేయులు, పశ్చిమగోదావరికి తోట సీతారామలక్ష్మి సారధ్యం వహిస్తున్నారు. మాజీ ఎంపీగా మాగంటి బాబుతో సహా సీనియర్లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలంతా పసుపుదారి పరుస్తున్నారు.
Updated Date - 2023-03-29T00:35:04+05:30 IST