ట్రాఫికర్
ABN, First Publish Date - 2023-03-05T23:49:40+05:30
జంగారెడ్డిగూడెం పట్టణంలో ట్రాఫిక్ సమస్య భూతంగా తయారైంది. ప్రధాన రహదారులపై ప్రయాణించాలంటే విసుగు చెందుతున్నారు.
ఎక్కడపడితే అక్కడే వాహనాల పార్కింగ్
జంగారెడ్డిగూడెం, మార్చి 5 : జంగారెడ్డిగూడెం పట్టణంలో ట్రాఫిక్ సమస్య భూతంగా తయారైంది. ప్రధాన రహదారులపై ప్రయాణించాలంటే విసుగు చెందుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఏమాత్రం అమలు కావడం లేదు. ప్రధాన రహదారిపైకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. చిన్నపాటి సెంటర్లలో భారీ వాహనాలు తీసుకుని వెళ్ళడం, అక్కడున్న దుకాణాలకు సరుకులను సరఫరా చేసేందుకు గంటల తరబడి రోడ్డుపైనే వాహనాలను నిలివేయడంతో ట్రాఫిక్ అంతరాయం కల్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది వాహనాలు...జంగారెడ్డిగూడెం పట్టణం పరిసరరంలోని వంద గ్రామాలకు వాణిజ్య కేంద్రంగా ఉంది. అటు ఏజెన్సీ మండలాలతో పాటు మెట్ట ప్రాంతంలోని పలు మండలాలకు చెందిన ప్రజలు ఏ చిన్న అవసరం అయినా జంగారెడ్డిగూడెం రావలసిందే. జంగారెడ్డిగూడెంలో వ్యాపార సంస్థలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. వేలాది సంఖ్యలో ప్రజలు వచ్చి పట్టణంలోని దుకాణాల్లో సరుకులు, పనిముట్లు కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో విజయవాడ, రాజమండ్రి ఇతర పట్టణాల నుంచి లారీలపై సరుకులు తరుచూ వస్తుంటాయి.
పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు రద్దీగా ఉండే సెంటర్లలో ద్విచక్రవాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. గంగానమ్మ గుడి సెంటర్, బుట్టాయిగూడెం రోడ్డు, శ్రీనివాసపురం రోడ్డు మార్కెట్ వద్ద చింతలబజార్, పంగిడిగూడెం, బస్టాండ్ సెంటర్‌ల వద్ద దుకాణాల ఎదుటే రోడ్డుపైనే ద్విచక్ర వాహనాలు నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
బుట్టాయిగూడెం రోడ్డు టు శ్రీనివాసపురం రోడ్డు...
సంత మార్కెట్ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రోడ్డుపై కూడా వాహనాలు ఎక్కడ పడితేఅక్కడే నిలిపివేస్తున్నారు. ప్రధానంగా బుట్టాయిగూడెం రోడ్డులోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద నుంచి శ్రీనివాసపురం రోడ్డులోని కాలేజీ రోడ్డు వరకు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు నడుస్తున్నాయి. వీటితో పాటు మునిసిపల్ కార్యాలయం సెంటర్‌ల వద్ద మాంసపు దుకాణాల ఎదుట వాహనాలు నిలిపివేయడం, జేపీ సెంటర్ కూడా నిత్యం రద్దీ. ఇక్కడే మద్యం దుకాణం ఉండడం వల్లే రోడ్డుపైనే వాహనాలు నిలిపి వేస్తుంటారు. ఇక్కడ నుంచి సిటీకేబుల్ ఆఫీసు మీదుగా చింతలబజారు రోడ్డు మరింత దారుణం. ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉండడం, పలు దుకాణాల వద్దకు వచ్చిన వారంతా తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయడంతో ఈ రోడ్డు మీద ప్రయాణించాలంటే భయపడి చస్తున్నారు.
స్కూల్ వాహనాలు..
ఇక ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటలకు వరకు పలు ప్రైవేట్ స్కూల్స్‌కు సంబంధించిన బస్సుల హడావుడి కన్పిస్తోంది. సుమారు ఎనిమిది ప్రైవేట్ స్కూల్‌కు సంబంధించి వందకు పైగానే బస్సులు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి విద్యార్థులను ఉదయం ఎక్కించుకుని సాయంత్రం మళ్లీ ఇళ్ల వద్ద దింపడంతో ఉదయం, సాయంత్రం ప్రధాన రహదారులపై బస్సుల హడావుడి ఉంటుంది. ఇదే సమయంలో లారీలు, టిప్పర్లు రావడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.
Updated Date - 2023-03-05T23:49:40+05:30 IST