అదానీ గ్రూప్ అప్పుల కొండే
ABN, First Publish Date - 2023-03-01T01:34:00+05:30
అదానీగ్రూప్ అప్పులపై అంతర్జాతీయ నిపుణులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రూప్ శక్తికి మించి 3 రెట్లు ఎక్కువ అప్పులు చేసిందని.. కంపెనీల ఆస్తులను వెల కట్టడంలో...
మూడు రెట్లు ఎక్కువ అప్పులు.. ఏఈఎల్ షేర్లు గాలి బుడగ!
న్యూఢిల్లీ: అదానీగ్రూప్ అప్పులపై అంతర్జాతీయ నిపుణులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రూప్ శక్తికి మించి 3 రెట్లు ఎక్కువ అప్పులు చేసిందని.. కంపెనీల ఆస్తులను వెల కట్టడంలో అంతర్జాతీయ ప్రముఖుడిగా పేరొందిన అశ్వత్ దామోదరన్ స్పష్టం చేశారు. వ్యాపారాల కోసం ఇలా అప్పులు చేయడం ‘దుష్ట వ్యాపార సంప్రదాయం’ అన్నారు.
ఏఈఎల్‌కు అంత సీన్ లేదు: అదానీ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) షేరు ప్రస్తుత ధరపైనా దామోదరన్ పెదవి విరిచారు. హిండెన్‌బర్గ్ నివేదికను పక్కన పెట్టినా ఏఈఎల్ షేరు కోసం రూ.945 కంటే ఎక్కువ పెట్టడం వృధా అన్నారు.
జర జాగ్రత్త: మంగళవారం అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల షేర్లలో ఎనిమిది కంపెనీల షేర్లు లాభాలతో ముగిశాయి. అయితే ట్రేడైన షేర్ల పరిమాణం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ లాభాలు చూసి తొందరపడి అదానీ షేర్లలో పెట్టుబడులకు దిగవద్దని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఏ మాత్రం తొందర పడినా బుక్కయి పోతారని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎన్ని సానుకూల వార్తలు వచ్చినా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలను ‘వేలాడుతున్న కత్తి’లానే చూడాలని క్యాపిటల్ మింట్ బ్రోకరేజీ వ్యవస్థాపకుడు దీపక్ షెనాయ్ హెచ్చరించారు.
ఇంకా ఆధారాలు లభించలేదు : సెబీ
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సెబీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అదానీ గ్రూప్ కంపెనీల ఖాతా పుస్తకాలు, రికార్డులను జల్లెడ పడుతోంది. ముఖ్యంగా లిస్టింగ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు సమర్పించిన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు సెబీకి ఎలాంటి ఆధారాలు లభించలేదని బ్లూంబర్గ్ తెలిపింది.
Updated Date - 2023-03-01T01:34:00+05:30 IST