Sagar Cements : సాగర్ సిమెంట్స్ గూటికి ఆంధ్రా సిమెంట్స్
ABN, First Publish Date - 2023-01-15T00:18:04+05:30
దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా ఆంధ్రా సిమెంట్స్‌ను చేజిక్కించుకున్నట్లు సాగర్ సిమెంట్స్ శనివారం ప్రకటించింది. తమను విజేత బిడ్డర్‌గా ప్రకటిస్తూ ఆంధ్రా సిమెంట్స్ లిమిటెడ్ దివాలా పరిష్కార నిపుణుడి నుంచి సమాచారం అందుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సాగర్

దివాలా పరిష్కార చర్యల్లో భాగంగా కొనుగోలు
హైదరాబాద్: దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా ఆంధ్రా సిమెంట్స్‌ను చేజిక్కించుకున్నట్లు సాగర్ సిమెంట్స్ శనివారం ప్రకటించింది. తమను విజేత బిడ్డర్‌గా ప్రకటిస్తూ ఆంధ్రా సిమెంట్స్ లిమిటెడ్ దివాలా పరిష్కార నిపుణుడి నుంచి సమాచారం అందుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సాగర్ సిమెంట్స్ సమాచారం అందించింది. ఆంధ్రా సిమెంట్స్ కొనుగోలుకు సాగర్ సిమెంట్స్‌తో పాటు జిందాల్ పాలీ ఫిల్మ్స్, దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్, ఖండ్వాలా ఫిన్‌స్టాక్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా పోటీ పడ్డాయి. ఆంధ్రా సిమెంట్స్‌పై దివాలా పరిష్కార చర్యలు చేపట్టాల్సిందిగా జాతీయ కంపెనీల చట్టం ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్ గత ఏడాది ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసింది. నీరవ్ కే పుజారియాను దివాలా పరిష్కార నిపుణుడి (ఐఆర్‌పీ)గా నియమించింది. ఐడీఎ్‌ఫసీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీఎ్‌ఫసీ, కరూర్ వైశ్యా బ్యాంక్ సహా పలు బ్యాంక్‌ల నుంచి 2012-16 మధ్య కాలం లో ఆంధ్రా సిమెంట్స్ భారీగా రుణాలు తీసుకుంది. ఆ తర్వాత కాలంలో మొండి పద్దుల్లోకి చేరిన కంపెనీ బకాయిలతో పాటు కంపెనీ జారీ చేసిన రుణ పత్రాలపై లభించే వడ్డీ ఆదాయ హక్కులను రుణదాతల నుంచి ఎడెల్‌వీజ్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఎడెల్‌వీజ్ నుంచి కంపెనీకి చెందిన రూ.804 కోట్లకు పైగా రుణ బకాయిలతో పాటు సెక్యూరిటీ పత్రాలపై వడ్డీ ఆదాయ హక్కులను పృధ్వీ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ కొనుగోలు చేసింది. ఆ బకాయిలను రాబట్టుకునేందుకు పృధ్వీ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది.
రెండూ హైదరాబాద్ కంపెనీలే..
ఆంధ్రా సిమెంట్స్, సాగర్ సిమెంట్స్ రెండూ హైదరాబాద్‌కు చెందిన లిస్టెడ్ కంపెనీలే. ఆంధ్రా సిమెంట్స్ 2012లో జేపీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్న జేపీ గ్రూప్.. ఆంధ్రా సిమెంట్స్‌కు చెందిన రుణ బకాయిలను చెల్లించడంలో విఫలమైంది. ఆంధ్రా సిమెంట్స్‌కు గుంటూరు జిల్లాలోని దాచేపల్లితో పాటు విశాఖపట్నంలో మొత్తం 26 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రెండు ప్లాంట్లు ఉన్నాయి.
కాగా, సాగర్ సిమెంట్స్ గత ఏడాది మార్చి నాటికి 82.5 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్లాంట్ల విస్తరణ, కొనుగోళ్ల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని కోటి టన్నులకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధనకు ఆంధ్రా సిమెంట్స్ కొనుగోలు దోహదపడనుంది.
Updated Date - 2023-01-15T00:18:05+05:30 IST