Credit Card: మీకు క్రెడిట్ కార్డు ఉందా..? ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడని మూడు పొరపాట్లు ఏంటో తెలుసా..?
ABN, First Publish Date - 2023-02-12T18:03:15+05:30
క్రెడిట్ కార్డు ఉన్న వాళ్లు అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవే..
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో క్రెడిట్ కార్డుల(Credit Card) వినియోగం క్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో.. క్రెడిట్‌కార్డు దారులు పొరపాట్లు చేసే అవకాశాలు పెరుగుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా అవగాహన లేమితో క్రెడిట్ కార్డులను ఇష్టారీతిన వినియోగిస్తే అప్పుల ఊబిలో(Debt Trap) కూరుకుపోక తప్పదు. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో క్రెడిట్ కార్డుల విషయంలోనూ అంతే బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. క్రెడిట్ కార్డుదారులు కొన్ని తప్పులు(Mistakes) అస్సలు చేయకూడదని అనుభవజ్ఞులు చెబుతుంటారు. అవేంటంటే..
ఏటీఎంల నుంచి క్రెడిట్ కార్డుతో నగదు ఉపసంహరణ
క్రెడిట్ కార్డుతో ఏటీఎంల నుంచి నగదు తీసుకోకపోవడమే మంచిదనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. నగదు తీసుకున్న రోజు నుంచీ క్రెడిట్ కార్డుదారులు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులు ఉండవు. కాబట్టి.. అత్యవసర పరిస్థితులు మినహా క్రెడిట్ కార్డుతో నగదు విత్‌డ్రా చేసుకోవాలన్న ఆలోచనను మొగ్గలోనే తుంచేయాలి.
క్రెడిట్ కార్డ్ లిమిట్ విషయంలో జాగ్రత్త..
క్రెడిట్ కార్డుతో చేసే ఖర్చులకు ఓ పరిమితి ఉంటుంది. దాన్నే క్రెడిట్ లిమిట్(Credit Limit) అంటారు. ఒక్కో కార్డుకు ఒక్కో పరిమితి ఉంటుంది. దీని ఆధారంగానే క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోను లెక్కిస్తారు. మీ వద్ద ఉన్న క్రెడిట్ కార్డుల మొత్తం లిమిట్ ఎంత.. మీరు బ్యాంకులకు ఎంత బాకీ ఉన్నారు..అన్న విషయాల ఆధారంగా దీన్ని క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోను(Credit Utilization Ratio) లెక్క గడతారు. ప్రతి కార్డును లిమిట్ వరకూ వాడేస్తే అది మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా.. క్రెటిడ్ స్కోర్‌పై(Credit Score) తగ్గి భవిష్యత్తులో రుణాల పుట్టే అవకాశం సన్నగిల్లుతుంది. కాబట్టి.. క్రెడిట్ కార్డులతో ఖర్చుల విషయంలో సంయమనం పాటించాలి.
ఇక.. నెలనెలా చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు బిల్లులో పేర్కొన్న కనీస మొత్తాన్ని ఎప్పటికప్పుడు చెల్లిస్తే లేట్ పేమెంట్ చార్జీలు పడవు. కానీ..ఎల్లప్పుడూ ఇదే పంథాలో కొనసాగితే క్రెడిట్ కార్డు బాకీలు తడిసిమోపెడవుతాయి. బాకీ పడ్డ మొత్తంపై బ్యాంకులు రోజువారీ వడ్డీ వేస్తాయి. కాబట్టి.. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలి. క్రెడిట్ కార్డుల నియమనిబంధనలపై పూర్తి అవగాహనతో ఉంటే అప్పుల ఊబిలో చిక్కుకోకుండా మన అవసరాలు తీరుతాయనేది ఆర్థికనిపుణులు చెప్పేమాట.
Updated Date - 2023-02-12T18:03:18+05:30 IST