అనుభవాలే గురువులై నడిపించాయి
ABN, First Publish Date - 2023-01-09T01:07:24+05:30
తాను కళాశాల విద్య పూర్తి చేయకపోవడం పట్ల ఆసియాలోనే అత్యంత సంపన్నుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ విచారం ప్రకటించారు...
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ
న్యూఢిల్లీ: తాను కళాశాల విద్య పూర్తి చేయకపోవడం పట్ల ఆసియాలోనే అత్యంత సంపన్నుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ విచారం ప్రకటించారు. ప్రాథమిక అనుభవాలు తనలో తెలివితేటలు పెంచిన మాట వాస్తవమే అయినా సాధారణ విద్య మనిషిలో జ్ఞానాన్ని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని పలన్‌పూర్ విద్యామందిర్ ట్రస్ట్ 75వ వార్షికోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పవర్ కంపెనీగా, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల విభాగంలో అతి పెద్ద ఆపరేటర్‌గా, దేశంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీగా, దేశంలో రెండో పెద్ద సిమెంట్ తయారీ కంపెనీగా, 22,500 కోట్ల డాలర్ల మార్కెట్ విలువ గల దిగ్గజంగా అదానీ గ్రూప్‌ను తీర్చిదిద్దడంలో తన నాలుగున్నర దశాబ్దాల అద్భుతమైన ప్రయాణాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు. అనుభవాలే గురువులుగా తనను ఇంత ఎత్తుకు నడిపించాయని ఆయన అన్యాపదేశంగా చెప్పారు.
1978 సంవత్సరంలో కేవలం 16 ఏళ్ల వయసులో అదానీ విద్యాభ్యాసాన్ని వదిలివేసి ముంబై రైలెక్కారు. ఒక జపాన్ కొనుగోలుదారుతో కలిసి రూ.10,000 కమిషన్‌కు వజ్రాల వ్యాపారంలో ప్రవేశించడం ద్వారా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. నేనెందుకు నా కుటుంబంతో కలిసి పని చేయకుండా ముంబై తరలిపోయాను అని అప్పుడప్పుడూ ప్రశ్నించుకుంటూ ఉంటానని ఆయన చెప్పారు. అయితే ఏదైనా కొత్తగా చేయాలన్న తపనే తనను అలా నడిపించిందని అదానీ చెప్పారు. తొలితరం ఎంటర్‌ప్రెన్యూర్లకు ఒక ప్రత్యేకమైన లాభం ఉంటుందని, పోగొట్టుకునేందుకు ఏమీ ఉండదనేదే ఆ ప్రయోజనమని ఆయన చెప్పారు. ఆ విశ్వాసమే వారి బలమన్నారు. తాను అనుసరించడానికి ప్రత్యేకమైన వారసత్వం అంటూ ఏదీ లేదని, తాను వారసత్వాన్ని సృష్టించాలనేది నాటి తన ఆలోచన అని ఆయన చెప్పారు. భారత్ రాబోయే మూడు దశాబ్దాల పాటు అవకాశాల గనిగా నిలుస్తుందని, పెద్దగా కలలు కనేందుకు ఇదే సరైన సమయమని అదానీ సూచించారు.
ధీరూభాయ్ అంబానీ రోల్ మోడల్, ముకేశ్ మిత్రుడు
రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ తనకు రోల్ మోడల్ అని, ముకేశ్ అంబానీ మంచి మిత్రుడని అదానీ చెప్పారు. ఇటీవల కాలంలో అదానీ గ్రూప్.. రిలయన్స్‌తో పలు వ్యాపార విభాగాల్లో పోటీ పడుతున్న విషయం విదితమే. ఇండియా టీవీలో ప్రసారమయ్యే రజత్ శర్మ నిర్వహణలోని ‘‘ఆప్ కీ అదాలత్’’ షోలో ఇదే ప్రస్తామన వచ్చినప్పుడు అదానీ చెప్పిన సమాధానం ఇది. ‘‘ముకేశ్ భాయ్ నాకు మంచి మిత్రుడు. ఆయన్ని ఎంతో గౌరవిస్తాను. జియో, టెక్నాలజీ, రిటైల్ రంగాల్లో కూడా ప్రవేశించి ఆయన రిలయన్స్ గ్రూప్‌నకు కొత్త మార్గం చూపించారు. దేశాభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు’’ అని అదానీ ప్రశంసలు కురిపించారు.
Updated Date - 2023-01-09T01:07:26+05:30 IST