ఆర్‌బీఐ భారీ బొనాంజా
ABN, First Publish Date - 2023-05-20T02:57:07+05:30
గత ఆర్థిక సంవత్సరానికి (2022–23) కేంద్ర ప్రభుత్వానికి రూ.87,416 కోట్ల డివిడెండ్ చెల్లించనున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది.
కేంద్రానికి రూ.87,416 కోట్ల డివిడెండ్
ముంబై: గత ఆర్థిక సంవత్సరానికి (2022–23) కేంద్ర ప్రభుత్వానికి రూ.87,416 కోట్ల డివిడెండ్ చెల్లించనున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి చెల్లించిన రూ.30,307 కోట్ల డివిడెండ్‌తో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు అధికం. అంతేకాదు, ఈసారి ఆర్‌బీఐతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల నుంచి మొత్తం రూ.48,000 కోట్ల డివిడెండ్ లభించవచ్చని బడ్జెట్‌లో ప్రకటించిన అంచనా కన్నా కూడా ఇది అధికం. గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.లక్ష కోట్లకు పైగా లాభాలు ప్రకటించాయి. కాబట్టి, వీటి నుంచి కూడా ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లింపులు భారీగా పెరిగే అవకాశం ఉంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐతోపాటు ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి కేంద్రానికి రూ.40,953 కోట్ల డివిడెండ్ ఆదాయం లభించింది. 2022–23 బడ్జెట్లో ప్రకటించిన అంచనా రూ.73,948 కోట్ల కన్నా చాలా తక్కువ మాత్రమే సమకూరింది.
సెంట్రల్ బోర్డు ఆమోదం
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన సెంట్రల్ బోర్డు 602వ సమావేశంలో 2022–23 అకౌంటింగ్ సంవత్సరానికి మిగులు నిధుల్లోంచి రూ.87,416 కోట్లు కేంద్రానికి బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. అంతేకాదు, దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులతోపాటు ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిణామాలు సహా ఇతర సవాళ్లపై సమీక్షించారు. ఈ భేటీలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు మహేష్ కుమార్ జైన్, మైకేల్ పాత్ర, ఎం రాజేశ్వర్ రావు, టీ రవి శంకర్‌తోపాటు ఇతర డైరెక్టర్లు పాల్గొన్నారు.
రిస్క్ బఫర్ 6 శాతానికి పెంపు
ఊహించని, ఆకస్మిక అవసరాల్లో ఖర్చు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన కంటిజెన్సీ రిస్క్ బఫర్‌ను 6 శాతానికి పెంచాలని ఆర్‌బీఐ బోర్డు నిర్ణయించింది. 2021–22లో ఇది 5.5 శాతంగా ఉంది. ఈ బఫర్‌ను ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్‌లో 5.5–6.5 శాతం శ్రేణిలో ఉండేలా చూడాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు చేసింది.
Updated Date - 2023-05-20T02:57:07+05:30 IST