ఎప్పుడెంత అవసరమో అంతే
ABN, First Publish Date - 2023-06-19T01:50:12+05:30
నేషనల్ పింఛన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) ఖాతాదారులు 60 సంవత్సరాల వయసు నిండిన రోజు నుంచి తమ ఖాతాలోని సొమ్ము అవసరానికి అనుగుణంగా కావలసినంత ఏకమొత్తంలో వితడ్రా చేసుకునేందుకు వీలు కల్పించే సిస్టమాటిక్ వితడ్రాయల్ ప్లాన్...
ఎన్‌పీఎస్ ఖాతాలో సొమ్ము వితడ్రాయల్‌కు కొత్త ప్లాన్
పీఎ్‌ఫఆర్‌డీఏ చైర్మన్ దీపక్ మొహంతి
న్యూఢిల్లీ: నేషనల్ పింఛన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) ఖాతాదారులు 60 సంవత్సరాల వయసు నిండిన రోజు నుంచి తమ ఖాతాలోని సొమ్ము అవసరానికి అనుగుణంగా కావలసినంత ఏకమొత్తంలో వితడ్రా చేసుకునేందుకు వీలు కల్పించే సిస్టమాటిక్ వితడ్రాయల్ ప్లాన్ ఒకటి పీఎ్‌ఫఆర్‌డీఏ రూపొందిస్తోంది. వచ్చే త్రైమాసికం చివరికి ఆ ప్లాన్ ప్రకటించే ఆస్కారం ఉన్నదని, ప్రస్తుతం అది రూపకల్పన తుది దశలో ఉన్నదని పీఎ్‌ఫఆర్‌డీఏ చైర్మన్ దీపక్ మొహంతి తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఖాతాదారులు 60 సంవత్సరాల వయసు దాటగానే 60 శాతం సొమ్ము ఏకమొత్తంలో తీసుకోవచ్చు. మిగతా 40 శాతం యాన్యువిటీ కొనుగోలుకు మరలుతుంది. కాని ఈ కొత్త ప్లాన్ వారికి నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, సంవత్సరం ప్రాతిపదికన 75 సంవత్సరాల వయసు వచ్చే వరకు కొంత మొత్తంలో సొమ్ము తీసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. చాలా మంది ఖాతాదారులు ఈ నిధి తమకు మంచి రాబడి అందిస్తున్నప్పుడు యాన్యుటీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తున్నారని, దానికి బదులు తాను ఖాతాను కొనసాగించుకుంటూ నిర్దిష్ట కాలపరిమితిలో కొంత సొమ్ము వంతున తీసుకునే సదుపాయం కల్పించాలని అభ్యర్థిస్తున్నారని చెప్పారు. ప్రజల సగటు జీవన కాలపరిమితి పెరిగినందు వల్ల ప్రవేశ వయసు 70 సంవత్సరాలకు, నిష్క్రమణ వయసు 75 సంవత్సరాలకు పెంచారు. దానికి అనుగుణంగా వారు తమ ఆర్థిక పరిస్థితి ఆధారంగా యాన్యువిటీని వాయిదా వేసుకుని అధిక యాన్యుటీ పొందే అవకాశం కూడా ఉంటుందని మొహంతి అన్నారు. ఇవన్నీ కొత్త ప్లాన్‌లో చేర్చేందుకు తాము కసరత్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పీఎ్‌ఫఆర్‌డీఏ నిర్వహణలోని నిధి (ఏయూఎం) రూ.10 లక్షల కోట్లు దాటుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం అది రూ.9.5 లక్షల కోట్లుందన్నారు. అలాగే ప్రత్యామ్నాయ పెన్షన్ ఉత్పత్తిని ప్రవేశపెడుతూ చట్టానికి ఒక సవరణను కూడా తాము ప్రభుత్వానికి సూచించామని మొహంతి తెలిపారు.
Updated Date - 2023-06-19T01:50:12+05:30 IST