ట్రాకర్... బేఫికర్
ABN, First Publish Date - 2023-07-02T12:12:53+05:30
స్కూల్‌కి వెళ్లిన చిన్నారులు ఇంటికి చేరుకునే వరకు తల్లిదండ్రులకు టెన్షనే. ఆడుకుంటామని బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చే వరకు కంగారే. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందడం సాధారణమే.
స్కూల్‌కి వెళ్లిన చిన్నారులు ఇంటికి చేరుకునే వరకు తల్లిదండ్రులకు టెన్షనే. ఆడుకుంటామని బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చే వరకు కంగారే. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందడం సాధారణమే. అయితే ఈ టైపు ఆందోళనకు ఫుల్‌స్టాప్ పెడుతున్నాయి ఛైల్డ్ ‘జీపీఎస్ ట్రాకర్స్’... వీటితో ఇక బేఫికర్...
ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బాబు ఎక్కడున్నాడో ఎంచక్కా చూడొచ్చు. స్నేహితుని బర్త్‌డే పార్టీకంటూ వెళ్లిన వాడు ఏ చోట ఉన్నాడో చిటికెలో కనుక్కోవచ్చు. స్కూలు నుంచి బయలుదేరిన పిల్లలు నేరుగా ఇంటికి వస్తున్నారా లేదా చెక్ చేయవచ్చు. ఇవన్నీ ఆధునిక జీపీఎస్ ట్రాకర్స్‌తో సాధ్యమవుతున్నాయి. పిల్లల (వారికి తెలియకుండా కూడా) స్కూలు బ్యాగుకు తగిలించడం లేదా సాధారణ వాచ్‌లా అందించడం ద్వారా పిల్లలను ట్రాక్ చేయవచ్చు. ట్రాకర్స్‌లో రకరకాల మోడల్స్ ఉన్నాయి. ధర, డిజైన్, పనితీరు ఆధారంగా వాటిని ఎంపిక చేసుకోవాలి.
ఎలాంటి ట్రాకర్ ఎంచుకోవాలి?
జీపీఎస్ ట్రాకర్‌ని ఎంచుకునే ముందు అందులో ఉన్న ఫీచర్స్‌ని గమనించాలి. లొకేషన్ ట్రాకింగ్‌తో పాటు అదనంగా ఏయే ఫీచర్లు ఉన్నాయో తెలుసుకోవాలి. టూ వే కాలింగ్, అలర్ట్స్ పొందే సదుపాయం, జియో ఫెన్స్‌డ్ జోన్స్ ఏర్పాటు, చిల్డ్రన్ ట్రాకింగ్ హిస్టరీ వంటి ఫీచర్ల గురించి కనుక్కోవాలి.
జీపీఎస్ ట్రాకర్‌లన్నీ లొకేషన్‌ను ట్రాక్ చేసి అందిస్తాయి. కానీ అవి కచ్చితమైన లొకేషన్‌ను అందిస్తున్నాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. పిల్లలు ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్లినప్పుడు అప్‌డేట్స్ అందిస్తున్నాయా, క్విక్ అలర్ట్స్‌ని అందిస్తాయా లేదా అనేది చెక్ చేయాలి.
ట్రాకర్ ఉపయోగించేందుకు సులువుగా ఉండాలి. డిజైన్ బాగున్న ట్రాకర్‌ను ఎంపిక చేసుకోవాలి. మన్నికైనది చూసుకోవాలి.
ట్రాకర్ కొనే ముందే నెల వారీ చార్జీల గురించి తెలుసుకోవాలి. కొన్ని సంస్థలు మొదటి ఏడాది సర్వీసును ఉచితంగా అందిస్తున్నాయి.
సెక్యూరిటీ నిబంధనలను పాటిస్తున్నాయా లేదా అన్న విషయాలను గమనించాలి. పాస్‌వర్డ్స్, యూజర్ నేమ్స్ మార్చుకునే సౌలభ్యం ఉందా లేదా తెలుసుకోవాలి.
జీపీఎస్ ట్రాకర్స్ ఎందుకు?
నేరం చేయకుండా క్రిమినల్స్‌ని అడ్డుకోలేము. కానీ ఆ నేరం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా మన పిల్లలను చూసుకోవచ్చు. భద్రత గురించి ఆందోళన చెందకుండా పిల్లలకు స్వేచ్ఛగా ఆడుకునే అవకాశాన్ని అందించవచ్చు. ముఖ్యంగా వర్కింగ్ పేరెంట్స్ అయితే తప్పక ఉపయోగించాల్సిన గ్యాడ్జెట్‌గా చెప్పుకోవచ్చు. స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్నారా లేదా అనేది ఆఫీసులో ఉండి చూసుకోవచ్చు. ఏ సమయంలో ఎక్కడ ఉన్నారో చెక్ చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో పిల్లలు పేరెంట్స్‌తో కనెక్ట్ కావడానికి ఈ ట్రాకర్స్ ఉపకరిస్తాయి. వాటిలో కొన్ని రకాలివి...
పూర్తి చరిత్ర చెబుతుంది
తక్కువ బడ్జెట్‌లో లభించే పాపులర్ ట్రాకింగ్ డివైజ్ ‘జియోబిట్’. ఈ డివైజ్ సహాయంతో పిల్లలు ఎక్కడున్నారో క్షణాల్లో ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు. లైవ్ లొకేషన్ ఫీచర్‌తో పిల్లల కరెంట్ లొకేషన్‌ను గుర్తించవచ్చు. ఇందులో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ‘అలర్ట్’ ఫీచర్‌ను పిల్లలు సులభంగా ఆపరేట్ చేయవచ్చు. ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులతో అర్జంట్‌గా కనెక్టివిటీ పొందాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ సహాయపడుతుంది. అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు పేరెంట్స్‌కు మెసేజ్ పంపడానికి ఉపయోగపడుతుంది. పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్లారో టైమ్‌లైన్‌లో పూర్తి హిస్టరీని చూడొచ్చు. ముఖ్యమైన కాంటాక్ట్ నంబర్లను యాడ్ చేసుకునే సదుపాయం ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే పది రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. సేవ్ మోడ్‌లో పెడితే 20 రోజుల పాటు ఉంటుంది. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
అలర్ట్స్‌ని అందిస్తుంది
యూజర్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్ ‘జియోజిల్లా’. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్టుగా ఇందులో కొన్ని ఫంక్షన్లు ఉంటాయి. ఎస్‌ఓఎస్ సింబల్‌తో ఉండే సెంట్రల్ బటన్ అత్యవసర సమయంలో సందేశం పంపడానికి సహాయపడుతుంది. జియోజిల్లా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ మ్యాప్స్ సహాయంతో పిల్లలు ఎక్కడున్నదీ సరైన లొకేషన్‌ను చూపిస్తుంది. ప్రతీ అరగంట లేదా గంటకోసారి పిల్లల లొకేషన్‌ను తెలుసుకోవడానికి ఇంటర్వెల్స్ సెట్ చేసుకోవచ్చు. ఇల్లు, స్కూల్, ట్యూషన్, ప్లే ఏరియా, వర్క్‌స్పేస్.. ఇలా ముఖ్యమైన ప్రదేశాలు కస్టమ్ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ ప్రదేశాల్లోకి పిల్లలు ప్రవేశించినా, అక్కడి నుంచి బయటకు వచ్చినా అలర్ట్ సందేశం అందుతుంది.
హిడెన్ ట్రాకింగ్ కోసం...
అగ్గిపెట్టె సైజులో ఉండే ‘అమ్‌క్రెస్ట్’ ట్రాకర్‌ను పిల్లలకు తెలియకుండా వాళ్ల స్కూల్ బ్యాగులో పెట్టడం ద్వారా నిరంతరం వారిని ట్రాక్ చేయవచ్చు. పిల్లలు స్కూల్‌కు వెళుతున్నారా? మరెక్కడికైనా వెళ్లారా? స్కూల్ నుంచి నేరుగా ఇంటికే బయలుదేరారా? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ‘అమ్‌క్రెస్ట్ ట్రాకర్’ ఉపయోగపడుతుంది. జియోఫెన్సింగ్ లోపల ఉన్నాడా లేదా ట్రాక్ చేసుకోవచ్చు. అదే సమయంలో అలర్ట్స్ పొందవచ్చు. స్కూల్, ప్లేగ్రౌండ్, స్నేహితుల ఇళ్లు... వంటి కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసి వర్చువల్ ఫెన్సింగ్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రదేశాలలోకి వెళ్లినా, అక్కడి నుంచి బయటకు వచ్చినా మీకు సందేశం అందుతుంది. ఇలా సుమారు 20 వరకు జియోఫెన్సింగ్స్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. యాప్‌ని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా అలర్ట్స్‌ను పొందవచ్చు. బ్యాటరీలైఫ్ ఆరు రోజులు ఉంటుంది. స్లీప్ మోడ్‌లో ఉంటే రెండు వారాలు మన్నుతుంది.
ఫోన్‌కు ప్రత్యామ్నాయం
6 నుంచి 12 ఏళ్లలోపు పిల్లల కోసం డిజైన్ చేసిన వాచ్ ‘మై గేటర్ వాచ్’. స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడవచ్చు. అత్యవసర సమయాల్లో పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడవచ్చు. తల్లిదండ్రులు సైతం కాల్ చేసి మాట్లాడే సదుపాయం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ను పిల్లలకు ఇస్తే సోషల్ మీడియా, గేమ్స్ అని ఫోన్‌కు అతుక్కుపోతారు. దానికి బదులుగా ఈ వాచ్ అందిస్తే ఆ సమస్యలు ఉండవు. నాలుగు రోజుల పాటు బ్యాటరీ మన్నుతుంది.
యాప్‌తో పనిచేస్తుంది
పిల్లల లొకేషన్‌ను డైరెక్ట్‌గా యాక్సెస్ చేసే సదుపాయం ‘అవర్‌ప్యాక్ట్’ ట్రాకర్ వల్ల లభిస్తుంది. పిల్లలు స్నేహితుల ఇళ్లలో ఉన్నా, పార్కులో ఆడుకుంటున్నా వారి కదలికలను సులువుగా గమనించవచ్చు. ఇది యాప్ సహాయంతో పనిచేస్తుంది. పిల్లల దగ్గర ఉండే డివైజ్‌తో యాప్‌ని సింక్రనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌తో అన్‌వాంటెడ్ సైట్స్‌ని బ్లాక్ చేసే వీలుంది. పిల్లలు సోషల్ మీడియా సైట్స్‌కి దూరంగా ఉండేలా చూసుకోవచ్చు. స్ర్కీన్‌షాట్స్ తీసుకోవచ్చు.
‘ఆటిజం’ ఉంటే...
‘ఆటిజం’ వంటి డిసేబిలిటీస్‌తో బాధపడుతున్న వారి కోసం రూపొందించిన ట్రాకర్ ‘ఏంజెల్‌సెన్స్’. తల్లిదండ్రులు ఆటిజం ఉన్న పిల్లలను వదిలి ఉండలేరు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి... ప్రతిక్షణం వారి గురించి ఆందోళన చెందుతుంటారు. అయితే ఈ ట్రాకర్‌ని ఎంచుకుంటే అలాంటి పిల్లల కదలికలను ప్రతి క్షణం తెలుసుకునే వీలు కలుగుతుంది. సాధారణ పిల్లలకైనా ఈ ట్రాకర్‌ని ఉపయోగించవచ్చు. పిల్లల స్కూల్ బ్యాగ్‌కి లేదా దుస్తులకు అమర్చితే చాలు. ప్రతి పది సెకన్లకు ఒకసారి లొకేషన్ అప్‌డేట్ పొందే వీలుంది. పిల్లలు ఏం చేస్తున్నారో లిజన్-ఇన్ ఫంక్షన్ సహాయంతో పేరెంట్స్ వినొచ్చు. కాల్స్ చేసి మాట్లాడే సదుపాయం ఉంటుంది.
ఈ జీపీఎస్ ట్రాకర్స్‌ను సీనియర్ సిటిజన్ల భద్రత కోసం కూడా ఉపయోగించవచ్చు. ‘డిమెన్షియా’ వంటి జబ్బులతో బాధపడుతున్న వారి కదలికలను పరిశీలించడానికి వాడొచ్చు. ఖరీదైన పెట్స్‌ని పెంచుకునే వారు వాటి కోసం జీపీఎస్ ట్రాకర్స్‌ని ఎంచుకోవచ్చు.
Updated Date - 2023-07-02T12:23:57+05:30 IST