ఆత్మ నిర్భర భారత్ దార్శనికుడు
ABN, First Publish Date - 2023-01-12T00:22:17+05:30
స్వామివివేకానంద అపురూప ప్రజ్ఞావంతుడు. పాశ్చాత్య తత్త్వశాస్త్రంతో సహా పలు విభిన్న జ్ఞాన క్షేత్రాలలో విస్తృత పరిజ్ఞానం, లోతైన అవగాహన ఉన్న ధీమంతుడు.
స్వామివివేకానంద అపురూప ప్రజ్ఞావంతుడు. పాశ్చాత్య తత్త్వశాస్త్రంతో సహా పలు విభిన్న జ్ఞాన క్షేత్రాలలో విస్తృత పరిజ్ఞానం, లోతైన అవగాహన ఉన్న ధీమంతుడు. హిందూ మత సందేశాన్ని, సనాతన ధర్మాన్ని ప్రపంచానికి అందించిన తొలి భారతీయ పరివ్రాజకుడు. సనాతన విలువల, సంస్కృతీ సంప్రదాయాల, హిందూ మత సర్వోన్నతిని నిర్ణయాత్మకంగా నెలకొల్పిన దార్శనికుడు, కార్యదక్షుడు వివేకానంద. ప్రాచీన యశస్సులు పలుచబడి, వలసపాలనలో భారత్ కునారిల్లుతున్న కాలంలో స్వామీజీ ప్రభవించారు.
నరేంద్రనాథ్ దత్‌గా జన్మించిన వివేకానంద స్వతస్సిద్ధ యోగి. జిజ్ఞాసువు. శ్రీరామకృష్ణ పరమహంస ప్రభావంతో నరేంద్రుని సత్యాన్వేషణలో మౌలిక మార్పు వచ్చింది. అంతిమంగా అది ఆయన్ని వివేకానందగా మార్చింది. మానవాళి ఆధ్యాత్మిక మహోన్నతుల చరిత్రలో విశిష్ట గురు–శిష్య సంబంధంగా శ్రీరామకృష్ణ– వివేకానంద అనుబంధం భాసిల్లింది.
1893 సెప్టెంబర్ 11న షికాగోలో ‘ప్రపంచ మత ప్రాతినిధ్య మహాసభ’లో వివేకానంద ప్రసంగం ఆ సభలో పాల్గొన్న సమస్త మతాల ఆచార్యులు, ఆధ్యాత్మికుల మనస్సులపై చెరగని ముద్ర వేసింది ‘అమెరికా దేశ సోదరీ, సోదరులారా’ అంటూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించిన వెన్వెంటనే సభికులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. వివేకానంద తన గంభీర స్వరంతో ఇలా అన్నారు: ‘మీరు మా పట్ల కనపరచిన ఆదర సౌహార్దం, అనురాగ సంరంభ స్వాగతం చూసి నేను అనిర్వచనీయమైన ఆనంద స్పందన అనుభవిస్తున్నాను. ప్రఫుల్ల హృదయంతో నా అభివాదాలు సమర్పించుకుంటున్నాను. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సన్యాసి సంప్రదాయానికి చెందిన నేను మా సంప్రదాయ వ్యవస్థ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని మతాలకూ తల్లి స్థానీయురాలైన మా చిరంతన మతం తరఫున మీకు కృతజ్ఞతలు చెపుతున్నాను. కోట్లాది హిందూ దేశస్థుల పక్షాన మీ హార్దిక స్వాగతానికి కృతజ్ఞతలు అందచేస్తున్నాను. మా దేశపు సమస్త సామాజిక తరగతులు, శాఖలు, తెగల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’. ఆయన ఇంకా ఇలా అన్నారు: ‘సకల ప్రపంచానికి సహనాన్ని, విశ్వజనీనతను బోధించే ఒక శ్రేష్ఠమైన మతానికి నేను చెందినవాణ్ణని నా గురించి చెప్పుకోవడం నా కెంతో గర్వంగా ఉంది. విశ్వవిశాలమైన సహనాన్నే కాక మేము సమస్త మతాలూ సత్యమైనవే అని ఆమోదిస్తాము. ఈ సమస్త ధాత్రిపైన అసహనానికీ, హింసకూ గురి అయిన అన్ని మతాల వారినీ, అన్ని దేశాలకు చెందిన వారినీ, వారు శరణార్థులై వచ్చినప్పుడు ఆదరించి, వారికి భద్రత కల్పించిన ఉదారమయమైన మతం మాది అని చెప్పుకోవటానికి నేను గర్విస్తున్నాను’. అన్ని ఆధ్యాత్మిక అన్వేషణా మార్గాలూ చివరకు ఒకే నిజమైన పరాత్పరుడిని చేరుతాయని వివేకానంద విశ్వసించారు. ఇదే సత్యాన్ని ఋగ్వేదం ఇలా ఉద్ఘోషించింది: ‘ఏకం సత్ విప్ర బహుద వదంతి’ (సత్యం ఒకటే; విజ్ఞులు దానిని వివిధ పేర్లతో సంభావిస్తారు).
నవ ప్రపంచ నిర్మాణంలో యువత బృహత్తర పాత్ర నిర్వహించాలని స్వామి వివేకానంద భావించారు. ప్రపంచ ఆశాజ్యోతులు యువజనులే. సకల మార్పులకూ వారే సూత్రధారులు అని ఆయన అనేవారు. ‘జాగృత మవండి, లక్ష్యాన్ని సాధించేదాకా విశ్రమమించవద్దు’ అని స్వామీజీ ఇచ్చిన పిలుపు నేటికీ భారతీయ యువతకు ఎనలేని స్ఫూర్తినిస్తోంది. ఇనుపకండరాలు, ఉక్కు నరాలు, విశాల హృదయాలు కల వారుగా యువజనులు రూపొందాలని ఆయన కోరేవారు. మాతృదేశ సేవకు యువతీ యువకులు దృఢ సంకల్పులు కావాలని ఆయన ప్రబోధించేవారు. ‘మహమ్మారులు విజృంభిస్తున్న ప్రదేశాలకు, కరువు కాటకాలు పీడిస్తున్న ప్రాంతాలకు వెళ్లండి. నానా దురవస్థల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించండి. ఇదే మాతృదేశ సేవ’ అని ఆయన ఉద్భోదించేవారు. స్వామి వివేకానంద భావాలు, ఆదర్శాలతో ఉత్తేజం పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ స్వస్థ్ భారత్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
విశాల భారతావనిలో తన విస్తృత పర్యటనలలో ఎల్లెడలా పేదరికం కానరావడం వివేకానందను వ్యాకులపరిచింది. ముఖ్యంగా సమాజంలోని అట్టడుగువర్గాల వారి దైన్యం ఆయన్ని అంతులేని ఆవేదనకు గురిచేసింది. సంపదలను సృష్టించే శ్రమ జీవుల బాగోగులను నిర్లక్ష్యం చేసినందునే భారతదేశం పతనమై బానిసత్వంలోకి జారిపోయిందన్న సత్యాన్ని గుర్తించి, దాన్ని బహిరంగంగా ప్రకటించిన ప్రప్రథమ భారతీయ మత నాయకుడు స్వామి వివేకానంద. శతాబ్దాల అణచివేత ఫలితంగా ఈ దేశ ప్రజలు తమ శక్తిసామర్థ్యాలలో విశ్వాసాన్ని కోల్పోయారని ఆయన భావించారు. పేదరికంలో కునారిల్లుతున్నప్పటికీ అసంఖ్యాక ప్రజలు తమ మత విశ్వాసాలకు అంటిపెట్టుకునే ఉన్నారని ఆయన గుర్తించారు. అయినా జీవితంలో కోల్పోయిన వెలుగులకు పునరుజ్జీవనమిచ్చే వేదాంత సూత్రాలను ఎవరూ వారికి బోధించలేదని కూడా ఆయన గుర్తించారు. జీవిత సమున్నతి కల్పించే ఆ సూత్రాలను ఆచరణాత్మక జీవితానికి ఎలా వర్తింపచేసుకోవాలో ఎవరూ వారికి నేర్పక పోవడం శోచనీయమని ఆయన చింతించారు.
మార్గాంతరమేమిటి? విద్య. ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు, వారిలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని రగిలించి, నైతిక దృక్పథాన్ని సుదృఢం చేసేందుకు విద్యా వ్యాప్తి చాలా అవసరమని ఆయన గ్రహించారు. ‘జీవిత సాఫల్యం, ఉదాత్త మానవ నిర్మాణం, శీల నిర్మాణం, సాధించే ఆశయాలు బోధించటమే’ విద్య అని ఆయన విశ్వసించారు. జీవిత సమస్యలు ఎదుర్కోవటానికి సామాన్య ప్రజలను సిద్ధం చేయని, బలమైన వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడని, నిబ్బరంగా ధైర్యంతో జీవించటం నేర్పని, దానగుణం ఏ కొంచెం అలవాటు చేయలేని విద్య విద్య అనిపించుకోదు. ఆ విద్య వ్యర్థం. స్వయం సహాయకంగా బతుకుతెరువు నేర్పని (తన కాళ్లపై తాను నిలబడేట్లు చేయలేని) స్వయం ఉపాధి సంపాదించుకోగల శక్తిని చేకూర్చలేని విద్య విద్యకాదని ఆయన విశ్వసించారు.. కేవలం ఉద్యోగార్హత కోసమో, ఇతరుల పెట్టుబడి, రాబడిపై ఆధారపడేట్లు చేసే విద్య సంఘానికి బరువు చేటవుతుంది. అటువంటి విద్య సమాజానికి భద్రత కలిగించకపోగా భారమవుతుందని స్వామీజీ అన్నారు. స్వామి వివేకానంద శాస్త్రీయ, మానవీయ దృక్పథం, నవ భారత నిర్మాణంపై ఆయన దార్శనికతకు అనుగుణంగా మోదీజీ తీసుకున్న మరో చొరవ ఫలితమే ‘నూతన జాతీయ విద్యా విధానం–2020’. సమాజంలోని అణగారిన వర్గాల వారికి విద్య ద్వారా సమ్మిళిత సాధికారిత కల్పించాలన్న స్వామీజీ దార్శనికతను నూతన జాతీయ విద్యా విధానం స్ఫూర్తిగా స్వీకరించింది. బాలికల విద్యను ప్రోత్సహించడం, అందరికీ సమాన, సమ్మిళిత విద్యావకాశాలను కల్పించడం, 2035 సంవత్సరం నాటికీ ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులలో చేరేవారి సంఖ్యను 50 శాతానికి పెంపొందించడం, ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యా సంస్థలలో కొత్త సీట్లను ఇతోధికంగా పెంపొందించడం, మాతృభాషలలో ఉన్నత విద్యా బోధన మొదలైనవి నూతన జాతీయ విద్యా విధానంలో ప్రధానాంశాలుగా ఉన్నాయి.
మానవాళి జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో వైజ్ఞానిక శాస్త్రాలు, వినూత్న సాంకేతికతలు నిర్వర్తిస్తున్న బృహత్తర పాత్రను వివేకానంద సరిగానే గుర్తించారు. ఐరోపా యాత్ర సందర్భంగా తనకు తటస్థించిన జమ్‌షెడ్జీ టాటాను భారత్‌లో వైజ్ఞానిక పరిశోధనల వికాసానికి అవసరమైన మానవ వనరులను అభివృద్ధి పరచాలని వివేకానంద కోరారు. స్వామీజీ సూచనతో స్ఫూర్తి పొందిన టాటా బెంగళూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ను నెలకొల్పారు. సంప్రదాయ హిందూ, పాశ్చాత్య విద్యా విధానాలలోని ఉత్తమ లక్షణాలను సమన్వయపరచాలన్నది స్వామీజీ ఆశయంగా ఉండేది.
మహోన్నత దార్శనికుడు, చింతకుడు, వక్త, కవి, యువజనులకు స్ఫూర్తిప్రదాత అయిన స్వామి వివేకానంద ప్రబోధాలను మనం ‘అమృత్ కాల్’ (స్వాతంత్ర్య వజ్రోత్సవాలు, శత వార్షికోత్సవాల మధ్య కాలం–2022–47)లో మొక్కవోని దీక్షతో అమలుపరచాలి. ఇది జరిగితేనే ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పం సాకారమవుతుంది. వివేకానంద నిర్దేశించిన మార్గమే ప్రధాని మోదీ పరిపాలనకు స్ఫూర్తిగా ఉన్నది. ఏక్ భారత్, సర్వశ్రేష్ఠ భారత్ స్వప్నాన్ని నెరవేర్చుకోవాలంటే మనం విధిగా ఆ మార్గంలోనే ముందుకు సాగాలి. జాతీయ స్ఫూర్తి, దేశ భక్తి, వైవిధ్యంలో ఏకత్వం, సమ్మిళితత్వం, స్వచ్ఛత మొదలైన వివేకానంద ప్రబోధాల స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడానికి ఈ పుణ్య దినాన పూనుకుందాం.
బండారు దత్తాత్రేయ
హర్యానా గవర్నర్
(నేడు స్వామి వివేకానంద 160 వ జయంతి;
భారతీయ యువజన దినోత్సవం)
Updated Date - 2023-01-12T00:22:26+05:30 IST