తెలంగాణ సాహిత్య చరిత్రకు కొత్త కాల రేఖ!
ABN, First Publish Date - 2023-08-07T03:22:15+05:30
సాహిత్య చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తే ఎన్నో సాహిత్య ప్రక్రియలకు పాదులు వేసింది తెలంగాణ ప్రాంత కవులు అనే విషయం వెల్లడి అవుతుంది. తెలుగులో మొట్టమొదటి కందపద్యం కుర్క్యాల శాసనంలో...
సాహిత్య చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తే ఎన్నో సాహిత్య ప్రక్రియలకు పాదులు వేసింది తెలంగాణ ప్రాంత కవులు అనే విషయం వెల్లడి అవుతుంది. తెలుగులో మొట్టమొదటి కందపద్యం కుర్క్యాల శాసనంలో మనకు లభించింది. తెలుగులో మొట్టమొదటి కవిత్వాన్ని సృష్టించిన కవి పంపన క్రీస్తుశకం 941 సంవత్సర కాలం నాటికే ఉన్నట్టుగా మనకు ఆధారాలు లభిస్తున్నాయి. పాల్కురికి సోమన లాంటి కవులు అచ్చతెనుగు, జానుతెనుగు అనే స్వచ్ఛమైన, నిక్కమైన ప్రజలు మాట్లాడే వ్యావహారిక గ్రామ్య తెలుగుకు సాహిత్య ప్రతిపత్తిని, కావ్య ప్రతిపత్తిని ఇచ్చారు. ఆ తర్వాత పోతన లాంటి కవులు కూడా విభిన్న ప్రయోగాలు చేస్తూ వచ్చారు.
అలాగే దాదాపు 11 శతాబ్దాల లిఖిత చరిత్ర గలిగిన తెలుగు సాహిత్యంలో తొలి గాథాసంకలన కావ్యం (‘గాథా సప్తశతి’, హాలుడు), తొలి సీసపద్య శతకం (‘చెన్నమల్లు సీసాలు’, పాల్కురికి సోమన), తొలి శతకం (‘వృషాధిప’ శతకం, పాల్కురికి), తొలి లక్షణ గ్రంథం (‘కవి జనాశ్రయం’, మల్లియ రేచన), తొలి ద్విపద రామాయణం (‘రంగనాథ రామాయణం’, గోన బుద్ధారెడ్డి), తొలి యక్షగానం (‘సుగ్రీవ విజయం’, కందుకూరి రుద్రకవి), తొలి పురాణం (‘మార్కండేయ పురాణం’, మారన), తొలి చారిత్రక గ్రంథం (‘ప్రతాపరుద్ర చరిత్రము’, ఏకామ్రనాథుడు), తొలి ద్వ్యర్థి కావ్యం (‘రాఘవ పాండవీయం’, వేములవాడ భీమకవి), తొలి కావ్యం (‘యాదవ రాఘవ పాండవీయం’, ఎలకూచి బాలసరస్వతి), తొలి గజల్ (దాశరథి), తొలి ప్రపంచపదులు (సి. నారాయణ రెడ్డి) వంటి ఎన్నెన్నో తొలి సాహితీ ప్రయోగాలను తెలంగాణా సాహితీవేత్తలు పరిచయం చేసి, తెలుగు సాహిత్య సర్వతోముఖ వికాసానికి దోహదం చేసారు.
తెలంగాణ ప్రాంత కవులు, సాహితీవేత్తలు, రచయితలు చేసిన కృషి అంతటినీ పునర్ నిర్వచించుకోవలసిన అవసరం నేడు ఉన్నది. ఇప్పటివరకు తెలుగు సాహిత్య చరిత్రని చెప్పడానికి జరిగిన యుగవిభజనలో నన్నయ కాలాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రాక్ నన్నయ యుగము, నన్నయ యుగము, నన్నయ అనంతర యుగంగా, ఆ తర్వాత వేర్వేరు యుగాలుగా తెలుగు సాహిత్య చరిత్ర వైభవాన్ని పరిశీలకులు, చరిత్రకారులు నిర్ధారించారు.
నిజానికి లోతుగా పరిశీలిస్తే తెలుగు భాష వ్యాప్తి కోసం, తెలుగు సాహితీ వైభవం కోసం తెలంగాణ ప్రాంత కవులు చేసిన కృషి అనన్య సామాన్యం. ఇలాంటి నేపథ్యంలో తెలుగు భాషలో వచ్చిన కవిత్వం, కవులు, సాహిత్యం వీటన్నిటిని కొత్త కోణంలోంచి, తెలంగాణ కోణంలోంచి, అన్వేషించి, ఆవిష్కరించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సాహిత్య ప్రస్థానంలో తెలంగాణ కవులు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా యుగవిభజన చేయాల్సిన అవసరాన్ని గమనించి నేను తెలంగాణ సాహిత్య చరిత్రని ప్రామాణికంగా కొన్ని యుగాలుగా విభజించాను. ఈ యుగ విభజనను ‘పద్య తెలంగాణం’ పేరుతో భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన పద్య కవితా సంకలనానికి రాసిన సంపాదకీయంలో చారిత్రకంగా, సశాస్త్రీయంగా, సోదాహరణంగా, సోపపత్తికంగా నిరూపిస్తూ వివరించాను: 1. పూర్వ పంప యుగం (9వ శతాబ్ది పూర్వ శాసనయుగం), 2. పంప యుగం (9-10 శతాబ్ది), 3. కాకతీయ - సోమన యుగం (11-13వ శతాబ్దం), 4. పోతన యుగం (15వ శతాబ్దం), 5. ప్రబంధ యుగం (15-16 శతాబ్దం) 6. కుతుబ్ షాహీల యుగం (16-17వ శతాబ్దం తొలిభాగం), 7. ఆసఫ్ జాహీలు- సంస్థానాల యుగం (17వ శతాబ్దపు మలిభాగం -19వ శతాబ్దపు తొలిభాగం), 8. ఆధునిక యుగం (19వ శతాబ్దపు మలిభాగం నుండి ప్రస్తుతం వరకు).
ఈ నేపఽథ్యంలోనే డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ ఏడాది కాలం పరిశోధన చేసి ‘తెలంగాణా ప్రముఖ కవులు- కావ్యాలు’ అనే గ్రంథం రాశారు. దీన్ని భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించింది. ఈ పుస్తకం లో ఆయన తెలంగాణా సాహిత్య యుగ విభజనను ఇలా చేశారు:
1. పంపకవి పూర్వ యుగం, 2. పంపకవి యుగం (క్రీ.శ. 941 నుంచి 12వ శతాబ్దం), 3. కాకతీయ పాల్కురికి సోమన యుగం (13వ శతాబ్దం), 4. పురాణ - మారణ యుగం (14వ శతాబ్దం) 5. ప్రబంధ - బమ్మెర పోతన యుగం (15వ శతాబ్దం), 6. యక్షగాన యుగం (16వ శతాబ్దం), 7. భక్తి వ్యాకరణాదుల యుగం (17వ శతాబ్దం), 8. శతక యుగం (18వ శతాబ్దం), 9. ఆధ్యాత్మిక - కీర్తన యుగం (19వ శతాబ్దం), 10. వానమామలై - కాళోజీ - దాశరథి యుగం (20వ శతాబ్దం పూర్వార్ధం), 11. సి. నారాయణ రెడ్డి యుగం (20వ శతాబ్ది ఉత్తరార్ధం).
అసలు సాహిత్య యుగ విభజన లాభాలేమిటి? తెలంగాణా సాహిత్య చరిత్రను శతాబ్దాల ప్రాతిపదికగా, ఆయా కవుల వివరాలను పొందుపరచడం ద్వారా ఒక నిర్దిష్ట కాల నియతిని (Time Order), చారిత్రక క్రమానుగతిని (Chronological Order) పాటించడం జరుగుతుంది. దీని వల్ల భవిష్యత్ పరిశోధనలకు మార్గం సులభం అవుతుంది. దీని వల్ల ప్రాచీన కాలం నుంచి, సమకాలీన కాలం వరకు ఉండే ప్రముఖ కవులు, వారి కావ్యాలన్నిటికి ఒక నిర్దిష్ట ప్రాతిపదిక లభిస్తుంది.
ఈ యుగ విభజన వల్ల యావత్ తెలంగాణ కవులలో ప్రాచీన కాలం నుంచి నేటి సమకాలీన కాలం వరకు సాహితీ కృషి చేసిన ప్రముఖులు, వారి రచనలు, వారి సాహితీ కృషి, వారు చేసిన ప్రయోగాలు, రచనా విశిష్టత, శిల్ప ధోరణులు వంటి అనేక విశేషాలను తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది.
చరిత్ర పొరల్లోకి వెళ్లి, తెలుగు సాహిత్య విస్తరణలో తెలంగాణ కవులు, వారి కావ్యాలు, వారి ప్రయోగాలన్నీ పంపన నుంచి మొదలుకొని, సమకాలీన కవుల వరకు అందరివి విశదంగా నమోదు అవుతాయి. వీటితో పాటు, ఆయాకాలాల నాటి భాషా విశిష్టతలతో వారు చేసిన ప్రయోగాలను, కావ్యాలను, పద్యాలను మాత్రమే కాకుండా ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య వాతావరణాన్ని తెలుగు భాష పరిణామ క్రమాన్ని అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది.
తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహితీవేత్తల కృషికి న్యాయం జరగడం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ కొంత కృషి చేసింది. 2017లో ప్రభుత్వం నిర్వహించిన ‘ప్రపంచ తెలుగు మహా సభలు’ ఈ దిశగా తెలంగాణా సాహితీ వేత్తల విశ్వరూపాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటాయి. ఇవి పుట్టించిన చైతన్యం వ్యవస్థీకృతంగా కార్య రూపం దాల్చవలసిన అవసరం ఉంది. దీని కోసం అధికార భాషా సంఘం, తెలంగాణ సాహిత్య అకాడెమీ, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, తెలుగు పండిట్ కోర్సు నిర్వహించే విద్యా సంస్థలు, తెలంగాణ సారస్వత పరిషత్, ఇతర రాష్ట్రాలలోని తెలుగు విద్యాలయాలలోని తెలుగు విభాగాలు పంపనను కాల రేఖగా నిర్ధారించి తమ సిలబస్‌లను మార్చాలి. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సాహిత్య చరిత్ర పాఠాలన్నిటిలో ఈ మార్పులను చేసేందుకు అవసరమైతే నిపుణుల కమిటీని వేసుకొని తగిన చర్యలు తీసుకోవాలి. తెలుగు సాహిత్య పరిశోధకులకు, తెలుగు భాషా ప్రేమికులకు, తెలంగాణ సాహితీ విద్యార్థులకు ఈ మేరకు అవగాహనను కలిగించాలి. సివిల్స్ , గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలలో తెలుగు సిలబస్‌ను పునర్ పరిశీలించేలా మేధావులు, తెలంగాణ సాహిత్యాభిమానులు కృషి చేయాలి.
తెలంగాణ కోణం లోంచి తెలుగు సాహిత్య యుగ విభజన చేయడం ద్వారా ఇంతకాలం తెలుగు సాహిత్యంలో విస్మృతమైన తెలంగాణ సారస్వతానికి, తెలంగాణ ప్రాంత కవులు చేసిన సాహితీ కృషికి తగిన న్యాయం జరగడమే కాక, తెలుగు సాహిత్యం కూడా మరింత విశాలం, విస్తృతం, సుసంపన్నం అవుతుంది.
మామిడి హరికృష్ణ
80080 05231
Updated Date - 2023-08-07T03:22:15+05:30 IST