ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్య వ్యూహంలో పావులమవుతున్నామా?

ABN, First Publish Date - 2023-04-28T02:52:20+05:30

స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సిప్రి) సోమవారం విడుదల చేసిన వార్షిక నివేదిక నివ్వెరపోయే నిజాలు కొన్ని ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సిప్రి) సోమవారం విడుదల చేసిన వార్షిక నివేదిక నివ్వెరపోయే నిజాలు కొన్ని ప్రకటించింది. సైనిక వ్యయంలో భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. యావత్‌ ప్రపంచం రక్షణ పేరిట చేస్తున్న ఖర్చు 2022లో ౨,240 బిలియన్‌ డాలర్లతో రికార్డుస్థాయికి చేరుకుంటే, భారతదేశ వ్యయం ముందు ఏడాదికంటే ఆరు శాతం పెరిగి, ౮1.4 బిలియన్‌ డాలర్లతో, అమెరికా, చైనా, రష్యా తరువాతి స్థానంలో నిలిచింది. ఉక్రెయిన్‌ యుద్ధంతో రష్యాకు పెరిగిన వ్యయాన్ని అటుంచితే, అమెరికా, చైనా ఆర్థిక సామర్థ్యాలు, వాటి భౌగోళిక రాజకీయాలు స్పష్టంగా తెలిసినవే. కానీ, మానవాభివృద్ధి సూచికలో 140వ స్థానంలో ఉన్న వర్థమాన భారతం ఇలా మిలటరీ ఖర్చును పెంచుకుంటూపోవడం ప్రజాసంక్షేమానికి మేలు చేసేదేనా?

పేరుకి బడ్జెటు సమావేశాలే కానీ, 50 లక్షల కోట్ల ఖర్చు మీద చర్చే జరపకుండా 12 నిమిషాల్లో బడ్జెట్‌ను ఆమోదించి పార్లమెంటు ఇటీవల సెషన్‌ ముగించుకుంది. బడ్జెటుని లోతుగా చర్చించి ఆమోదించటం పార్లమెంటు కర్తవ్యమన్న రాజ్యాంగ నిబంధన గాలికి కొట్టుకుపోయింది. సామాజిక, సంక్షేమ శాఖలకు మించి రక్షణశాఖకే అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న కాలం ఇది. రక్షణ బడ్జెట్‌ సుమారు రూ.6లక్షల కోట్లు అని చూపెట్టినా, హోమ్, అణు, అంతరిక్ష తదితర శాఖల ఖాతాల్లోనూ రక్షణ ఖర్చులున్నాయి కనుక, ఆ వ్యయం ఇంకా ఎక్కువే. దేశరక్షణ పవిత్ర కర్తవ్యం అని కొందరు నమ్ముతున్నా, ఆ శాఖ కూడా అవినీతికి, అక్రమ లాభాలకూ, బ్రోకర్ల కమిషన్లకూ నిలయమేనని రక్షణరంగ నిపుణులే అంటారు. రక్షణశాఖలో లాబీ చేసే ఏజెంట్లకు క్లాసిఫైడ్ సమాచారమూ, లోగుట్టులూ కరతలామలకమేనని మాజీ సైన్యాధిపతి, ప్రస్తుత కేంద్రమంత్రి జనరల్ వీకే సింగ్ లోగడ అన్నారు.

రక్షణ శాఖలో ‘సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమోదించిన సామగ్రికై గ్రాంటు’ (AoN– Acceptance of Necessity for capital acquisition) 2022–23లో రూ.2.71లక్షల కోట్లు అని, ఇందులో 99 శాతం ఉత్పత్తులు దేశం నుంచే సేకరిస్తామని ఆ శాఖ మార్చి 16 నాడు ప్రకటించింది. ఇలా ఆత్మనిర్భర్‌ వైపు పరుగులు పెట్టిస్తామన్నారు. 2024–25 కల్లా రక్షణరంగ మాన్యుఫ్యాక్చరింగ్ లక్ష్యం రూ.1.75లక్షల కోట్లు, అందులో రూ.35వేల కోట్లు ఎగుమతుల లక్ష్యం అన్నారు. మరోవైపు 2018–22 మధ్య ఐదేళ్లలో ఆయుధాల దిగుమతిలో ఇండియా నెంబర్ వన్‌‍గా నిలిచిందని సిప్రి గతంలో వెల్లడించింది. ఈ లెక్కలన్నీ చూస్తే ఇందులో దేశరక్షణ కన్నా పారిశ్రామిక–వాణిజ్య ప్రయోజనాలు, లక్ష్యాలే అధికంగా ఉన్నాయని బోధపడుతుంది. ‘రక్షణ ప్రాధాన్యతగల ఆర్థికంగా’ చెప్పబడే ఈ (defence–oriented economy) నమూనాకి అమెరికా పెట్టింది పేరు. లోగడ సోవియట్ రష్యా ఆ దారిలోనే వెళ్లి పతనమైంది. సామ్రాజ్యవాద అగ్రరాజ్యాలకు అది సహజమే. కానీ 85 కోట్ల మందికి మూడేళ్లుగా ఆహారధాన్యాలు ఉచితంగా ఇవ్వాల్సి వచ్చిన దేశానికి ఇది తగునా? సంక్షేమాన్ని, అభివృద్ధిని వెనక్కి నెట్టి ఇలా చేయవచ్చునా? గత ఏడాది లక్షన్నర కోట్ల రూపాయల వంట నూనెల్ని, 16,500 కోట్ల రూపాయల పప్పుల్ని దిగుమతి చేసుకున్న వ్యవసాయదేశం ప్రాధాన్యాలు ఇలా తలక్రిందులు కావడం తప్పు కాదా? ఇలా ప్రశ్నించే, చర్చించే పద్ధతే లేకుండా, రక్షణ శాఖ పద్దుల్ని నిమిషాల్లో ఆమోదించటం జరుగుతోంది.

ఏభై ఏళ్ల క్రితమే బంగ్లాదేశ్ ఏర్పాటుతో రెండు ముక్కలై, నేడు తీవ్ర సంక్షోభంలో మునిగి ఉన్న పాకిస్థాన్ వల్ల మనకు ప్రమాదం ఉన్నదని ఎవరైనా అంటే అతిశయోక్తే. పాకిస్థాన్ – చైనా కుమ్మక్కయ్యాయంటూ నిత్యం ప్రచారం జరుగుతున్నప్పటికీ, భారత పాకిస్థాన్ల మధ్య ఆమోదయోగ్యమైన శాంతియుత పరిష్కారానికి కృషి చేస్తామని 2018లో చైనా ప్రతిపాదించింది. దాన్ని పాకిస్థాన్ ఆహ్వానించినా, మన విదేశాంగ మంత్రి తిరస్కరించారు. వాస్తవాధీన రేఖ అంతటా భూభాగం గురించి వేర్వేరు పెర్సెప్షన్, క్లెయిమ్స్ ఉన్నాయే తప్ప, అంగుళం కూడా దురాక్రమణకు గురికాలేదని స్వయంగా ప్రధాని అఖిలపక్ష సమావేశంలో గల్వాన్ తర్వాత కూడా చెప్పినా, అమెరికా ప్రేరిత మీడియా కట్టుకథలే మన దేశభక్తికి ఊతంగా మారాయి. చైనాతో దశాబ్దాలుగా సాగుతున్న చర్చల్ని ముగించగల రాజకీయ నిశ్చయం మన నేతల్లో కనపడదు. ‘‘దేశమంటే మట్టికాదోయి...’’ అన్న గురజాడ దేశభక్తి మనకి గీతం మాత్రమే. ‘‘ఇది యుద్ధాల యుగం కాదు, శాంతితో చర్చలే ఏకైక మార్గం’’ అన్న ప్రధాని మోదీ సూక్తి పరుల కోసమేనా?

దేశీ విదేశీ ఆయుధ వ్యాపారులు కలహభోజనులు, వారికి శాంతి రుచించదు; ఏటా లక్షలకోట్ల వ్యాపారం వారిది. కోవిడ్, మాంద్యం, ఆర్థికసంక్షోభం... ఈ స్థితిలో తరుణోపాయం ఆయుధ వ్యాపారమే. ఒకప్పుడు కమ్యూనిజం, తర్వాత ఇస్లామిక్ టెర్రరిజం, తాజాగా చైనా ప్రమాదం... ఇలా ఏదో ఒక బూచి ఉండాలి. వేలాది కోట్లను దేశ విదేశాల నుంచి సమీకరించినా హైటెక్ వల్ల నేరుగా లభించే ఉద్యోగాలు పరిమితమే. పదిలమనుకున్న ఉద్యోగాలే లక్షలాదిగా అమెరికాలో, ఇక్కడా రద్దయిపోతున్నాయి. కోట్లాది అసంఘటిత శ్రామిక వర్గాలకు ఏడాది పొడుగునా పని లభించడం కలే. అయినా సామ్రాజ్యవాదుల, దళారీ పెట్టుబడిదారుల వ్యాపారాలు సాగి లాభాలు రావాలంటే రక్షణఖర్చులే రాజబాట. ఇదే బాటలో ఉక్రెయిన్ రాజీకి అడ్డుపడి ఆయుధ నిల్వలను సగానికైనా అమ్ముకోగలిగింది అమెరికా.

భారత–చైనాలు ఎడతెగని చర్చల మధ్యన మెక్మహన్ రేఖను తాము గుర్తిస్తున్నామని, భారత రక్షణకై తాము రంగంలోకి దిగటానికైనా సిద్ధమేనని తాజాగా అమెరికా ప్రకటించింది! ఈశాన్య తావాంగ్‌లో చైనా రెండు గ్రామాల్ని నిర్మిస్తున్నదని, తాము సహించబోమని హెచ్చరించింది; ఈ నిర్మాణాలు వివాదగ్రస్తమైన రేఖ ఆవలివైపునే ఉన్నాయని ఇండియా చెప్పినా అమెరికా ఆగటం లేదు! ‘భారత–చైనాల మధ్య ఘర్షణలు అమెరికాకి మంచి అవకాశం’ అన్న న్యూయార్క్ టైమ్స్ శీర్షిక సూటిగా ఉంది.

ఈ రక్షణ బడ్జెట్ వృద్ధిని ప్రోత్సహించేదిగా ఉన్నదని, అనతి కాలంలో ఇండియా ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోటానికి దోహదం చేస్తుందని రాజనాథ్ సింగ్ అన్నారంటేనే రక్షణ పేరుతో వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారని బోధపడుతున్నది. 75 దేశాలకు 50 భారతీయ ప్రైవేటు కంపెనీల ఎగుమతులతో రక్షణ రంగ ఎగుమతులు (బ్రహ్మోస్‌తో సహా) గత ఐదేళ్లలో మూడురెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఈ ప్రోత్సాహంలో భాగంగా ప్రైవేట్ రంగానికి రక్షణ రంగంలో అవకాశాల్ని పెంచుతూ వచ్చారు. కాంగ్రెస్ ప్రోత్సాహంతో అంబానీలు ఎదిగినట్టు, మోదీ అండతో 2017లో రక్షణ రంగంలో దిగిన అదాని రాకెట్‌లా దూసుకుపోతున్నారు. ఇజ్రాయెల్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీ. నేడు ఇజ్రాయెల్ ఆయుధ అమ్మకాల కొనుగోలుదారుల్లో మనదే అగ్రస్థానం. ఇండియాకు ఆయుధాల సరఫరాలో రష్యా వాటా తగ్గుతూ, ఇజ్రాయెల్ ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్నది. ఇజ్రాయెల్ – అమెరికాలు సైనికపరంగా విడదీయరానివి. ఈ బంధంలో కీలక పాత్రని అదానికి అప్పగించారు. కీలకమైన ఇజ్రాయెల్ ప్రభుత్వ రంగ హైఫా పోర్టు కొనుగోలుకి అదానిని అనుమతించారంటే ఈ బంధం గ్లోబల్ ప్రాధాన్యతను గ్రహించవచ్చును; రక్షణరంగంలో స్వదేశీ స్వాలంబనలతో దేశభద్రతను అదానీయే కాపాడుతున్నారట. ఈ రంగానికి కొత్త అయినప్పటికీ యుద్ధ విమానాలదాకా అన్నీ తయారు చేస్తామని అదాని చెప్పింది ఇజ్రాయెల్‌కి ముసుగుగానే అని వారి వెబ్‍సైటు చూస్తే స్పష్టమవుతుంది. డిఆర్‌డివో, ఇస్రో వంటి ప్రభుత్వ సంస్థలనూ వారికి అధీనం చేసారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాల అండతో ఆసియాలో తమ తాబేదారుగా ఇండియాను ఎగదోసి, క్వాడ్‌తో చైనాని చుట్టివేస్తున్నారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, అదాని స్కాము అంటూ ప్రతిపక్షాలు లేవదీస్తున్న చర్చ పైపై వ్యవహారమే. అసలు చర్చ జరగాల్సింది ఈ ప్రమాదకర అగ్రరాజ్య శకుని వ్యూహంపైన! అందులో మన దేశాన్నీ, ఇక్కడి ప్రజల సంపదలనూ ఒడ్డటంపైన!

ఎమ్. జయలక్ష్మి

Updated Date - 2023-04-28T08:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising