ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మరోమారు ‘నీలిమేఘాలు’

ABN, First Publish Date - 2023-10-02T01:02:22+05:30

‘నీలి మేఘాలు’ స్త్రీవాద కవితా సంకలనం మొదటి ప్రచురణ, ఆవిష్కరణ జరిగి 30 సంవత్సరాలైంది. అంటే దాదాపు మూడు తరాలను దాటుకుంటూ వచ్చింది. 30ఏళ్ళ ముందు స్త్రీలు రాస్తున్న కవిత్వం అర్థం కాకో, అరిగించుకోలేకో, దాడికి దిగిన, ‘నీలి కవితలు’...

‘నీలి మేఘాలు’ స్త్రీవాద కవితా సంకలనం మొదటి ప్రచురణ, ఆవిష్కరణ జరిగి 30 సంవత్సరాలైంది. అంటే దాదాపు మూడు తరాలను దాటుకుంటూ వచ్చింది. 30ఏళ్ళ ముందు స్త్రీలు రాస్తున్న కవిత్వం అర్థం కాకో, అరిగించుకోలేకో, దాడికి దిగిన, ‘నీలి కవితలు’ ‘వార కవితలు’ ‘ఒళ్ళు బలిసినవాళ్ళు రాసిన కవిత’లంటూ పత్రికలలో రాసిన తెలుగు సాహిత్య విమర్శకులకు కవయిత్రులు సమష్టిగా ఇచ్చిన సమాధానం ‘నీలి మేఘాలు’.

1993 అక్టోబర్‌ 3న రావు బాల సరస్వతి గారు (ప్రథమ నేపథ్య గాయని) ‘‘కలలన్ని కల్లలై కరిగిపోయే వేళ/ దారి చూపే పెద్ద వెలుగా రావే/ దారి వెలిగించ రావే!’’ అని పాడుతూ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కవితా సంకలనం తర్వాత స్త్రీ వాద కవిత్వం ఒక సామాజిక ఆమోదాన్ని పొందింది. స్త్రీ వాద కవిత్వాన్ని అర్థం చేసుకోవటమెలాగో చెప్పిన ‘నీలి మేఘాలు’ ఒక చరిత్ర.

స్త్రీల సామూహిక స్వరం ఎంత బలమైందో, స్పష్టమైందో చెప్పే కవితా సంకలనం ‘నీలి మేఘాలు’. ఈ ముప్పై సంవత్సరాలలో మరో మూడు ముద్రణలు వచ్చాయి. ఇప్పుడు నాల్గవ ముద్రణ వస్తోంది. ఈ సందర్భం ప్రత్యే కమైంది. స్త్రీలపై అనేక ప్రాంతా లలో, అనేక రూపాలలో జరిగే హింసను నీలిమేఘాలు గర్జించి చెప్పి ఇంత కాలమైనా హింస మరింత దారుణంగా, నగ్నంగా జరుగుతూనే ఉంది.

‘‘బోస్నియానో, ఎల్‌ సాల్విడాలో

చలకుర్తో, త్రిలోక్‌ పురీ వీధులో

దండకారణ్యమో, ఎక్కడైతేనేం

మనల్ని వివస్త్రల్ని చేయటం వాళ్ళ వినోదక్రీడయింది’’ - అన్న విమల కవిత గుజరాత్‌ గుండా మణిపూర్‌ వరకూ, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ నేడు విస్తరించింది. వినోద క్రీడ మహిళా క్రీడాకారుల శరీరాలతో వినోదిస్తోంది. సందర్భాలు మారాయి గానీ సంవేదనలు మారలేదు. ఒకవైపు మహిళలకు రాజకీయ భాగస్వామ్యం ‘దానం’ చేస్తూ మరో వైపు స్త్రీలను అదృశ్య హింసా రూపాలతో అష్ట దిగ్బంధనం చేస్తూ, రాజ్యం, పితృస్వామ్యం కలిసి ఆడుతున్న వినోద క్రీడల గురించి ఈ తరం కవయిత్రులు మాట్లాడాల్సిన, గొంతు విప్పి అరచి, ప్రతిఘటించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకోవటానికే ‘నీలిమేఘాలు’ 30ఏళ్ళ సందర్భం. ఇది అందరూ కలవాల్సిన సందర్భం.

తెలుగు సాహిత్యంలో ద్వేషాన్ని ప్రతిఘటిస్తూ, హింసను ఖండిస్తూ, వివక్షను ప్రశ్నిస్తూ చేసిన రచనా సంప్రదాయం వెయ్యేళ్ళకు పైగా ఉంది. తిక్కన, ధూర్జటి, అన్నమయ్య, మొల్ల... మొదలుకొని ఆ ప్రతిఘటనా గళాలు అనేక ఉద్యమాల మీదుగా ప్రయాణిస్తూ వస్తున్నాయి. అనేకమంది కవులు, కవయిత్రులూ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. అవే మన ఆశాగీతికలు. అవే మన రాబోయే వెలుగుల ఉదయాలు. ఆ ఉదయాలను స్వప్నిస్తూ, వాటిని నిజం చేసుకునే దిశగా సాగిపోవాలని కోరుకుంటూ ‘విభా ప్రభాతములు’ సంకలనం వస్తోంది. తిక్కన నుంచి షాజహానా వరకు 90మంది రచయితల రచనలతో, రచనా శకలాలతో తెలుగు సాహిత్యపు రాజకీయ పదునును పలు భాషా పాఠకులకు అందించాలనే తపనతో కూర్చిన సంకలనమిది. ఓల్గా, కల్పన కన్నభిరాన్‌లు సంపాదకులు. దీనిని ‘వాయిసెస్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌: తెలుగు ప్రోగ్రెసివ్‌ పొలిటికల్‌ లిటరేచర్‌’ పేరుతో వసంత కన్నభిరాన్‌ ఇంగ్లీషులోకి అనువదించారు. ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ అక్టోబర్‌ 3 సాయంత్రం రవీంద్ర భారతి హైదరాబాద్‌లో జరుగుతుంది. అందరం కలుద్దాం. 30ఏళ్ళ తర్వాత కూడా స్త్రీవాదంతో, ఆ కవిత్వంతో మాకేం సంబంధం లేదని అనకండి సహకవులారా, రచయితలారా! పితృస్వామ్యం మిమ్మల్నీ హింసిస్తోంది. బానిసల్ని చేస్తోంది. ఈ ప్రతిఘటన మనందరిదీ!

ఓల్గా

Updated Date - 2023-10-02T01:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising