ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆఖరి ఉత్తరం

ABN, First Publish Date - 2023-10-09T03:28:39+05:30

ఎదురుగా ఈ ఉత్తరం, దీని వయసు రెండు పదుల యేళ్ళు అస్తమయానికి సరిగ్గా నాలుగంటే రోజుల ముందు నాయిన సిరా పెన్నుతో రాసింది, ఆఖరిది వృద్ధాప్యపు ముడతలతో వుంది కానీ...

ఎదురుగా ఈ ఉత్తరం, దీని వయసు రెండు పదుల యేళ్ళు

అస్తమయానికి సరిగ్గా నాలుగంటే రోజుల ముందు

నాయిన సిరా పెన్నుతో రాసింది, ఆఖరిది

వృద్ధాప్యపు ముడతలతో వుంది కానీ

అక్షరాల తళుకు మసకబారలేదు, అనుభవజ్ఞుడి కంటి కాంతిలా-

ఎన్నో సార్లు దీన్ని చదువుకున్నాను, అదీ నన్ను చదివిందేమో

విసుగు లేదు నాకు, బహుశా దీనిక్కూడా!

వున్నవి నాలుగు విషయాలే నాలుగు పేరాల్లో!

కుటుంబపు మంచీ చెడులూ ఒకట్రెండు జాగ్రత్తల మాత్రలూ

కాసిన్ని అనుభవ మూలికలూ ఆఖర్న వెన్నెల ఆశీస్సులూ - అంతే !

కుదురుగా బతుకు కొట్టివేతల్లేకుండా ఉండాలనే నాయిన తపన

అక్షరాల పొందికలో ఇట్టే అల్లుకుపోయేది కుదురుగా-

ఎవరో ఎప్పుడో కనిపెట్టిన అక్షరాలనే వాడాడు

కానీ వాటికి తన హృదయ గంధాన్ని కలిపాడు

దాని పరిమళం దీని పొరల్లోంచి ఇప్పటికీ నాలోకి వ్యాపిస్తున్నది

దీన్లో ఏ దాపరికమూ దర్పమూ లేదు నాయిన లాగే!

దీన్ని చూసినపుడల్లా ఆయనకిష్టమైన గోదావరి గుర్తుకొస్తుంది

నాకు నదీస్నానానుభూతి దక్కుతుంది

బతుకు రాళ్ళ దారిలో మైళ్ళకు మైళ్ళు నడిచిన నాయిన

దూరాల్ని దగ్గర చేసేందుకు ఉత్తరాలు రాసేవాడు

ఏ ఉత్తరంలోనూ ఖాళీకని అంగుళమంతైనా చోటివ్వలేదు

ఖాళీల్ని పూరించడానికే నాయిన పరమ దీక్షావ్రతుడై

ఉత్తరాలు రాసేవాడని ఆయన లేని నా లోపలి ఖాళీ చెబుతున్నది

ఆయన ప్రతి ఉత్తరమూ ప్రాచీన విశ్వాసంతో మొదలయ్యేది

‘‘శ్రీరాములు నీవే కలవు’’

ఆయన విశ్వాసాల చల్లని పందిళ్ళ కింద సేదతీరినవాళ్ళు తలొక దారిలో

దూరాలకు తరలి వెళ్ళినా తాను ఉత్తరాలతో దగ్గరయ్యేవాడు

ఉత్తరం ఇంటి వాకిట్లో వాలిన అలికిడైతే చాలు

మనిషే నడిచొచ్చి పలకరించినట్లు నిమ్మళపడేవాడు

ప్రతీ ఉత్తరాన్నీ పదిలపరిచేవాడు ఆస్తి దస్తావేజులా!

ఇపుడు నా ఎదురుగా వున్నది ఆయన రాసిన ఆఖరి ఉత్తరం

ఇదే ఆఖరిదా

మరణానికి కాసిన్ని నిముషాల ముందు విషమ శయ్య మీద

ఒక్క మాటనూ బట్వాడా చేయలేని దుర్భర తీవ్రవేదనాస్థితిలో

ఆయన నాకేసి చూసిన వ్యక్తావ్యక్తపు తడి చూపు

అది - ఆ తడి చూపు - నాయిన నాకు రాయని ఉత్తరం

నిజానికి అది ఆయన ఆఖరి ఉత్తరం!

దాన్నిప్పటికీ నేను చదువుకుంటూనే వున్నాను.

ఇంకా ఇంకా తెలుసుకోవడానికి!

దర్భశయనం శ్రీనివాసాచార్య

94404 19039

Updated Date - 2023-10-09T03:28:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising