‘‘నావన్నీ పఠనానుభవాలే, విమర్శ అనుకోను.’’
ABN, First Publish Date - 2023-08-28T00:38:06+05:30
ప్రపంచ సాహిత్యాన్ని విస్తృ తంగా చదివి, ఆ పాఠకా నుభవాన్ని పదిల పరిచే క్రమంలో రాసుకున్న వ్యాసాలను ‘ధీ’ పేరుతో పుస్తకంగా తీసుకు వచ్చారు నాగినీ కందాళ. వ్యాసాల వస్తువు, శైలి, కూర్పు, శీర్షిక, ము ద్రణలలో నవ్యతని తీసుకు వచ్చిన ‘ధీ’ రచయితతో...
నాగిని కందాళ : పలకరింపు
ప్రపంచ సాహిత్యాన్ని విస్తృ తంగా చదివి, ఆ పాఠకా నుభవాన్ని పదిల పరిచే క్రమంలో రాసుకున్న వ్యాసాలను ‘ధీ’ పేరుతో పుస్తకంగా తీసుకు వచ్చారు నాగినీ కందాళ. వ్యాసాల వస్తువు, శైలి, కూర్పు, శీర్షిక, ము ద్రణలలో నవ్యతని తీసుకు వచ్చిన ‘ధీ’ రచయితతో ఈ వారం పల కరింపు.
సాహిత్య విమర్శ పరిధిని మీరెలా నిర్వచిస్తారు?
రచయిత వ్యక్తిగతాల జోలికి వెళ్ళ నంతవరకూ నిజానికి విమర్శకు ప్రత్యేకమైన పరిధులు, పరిమితులు అంటూ ఏవీ ఉండవలసిన అవసరం లేదు. పాఠకులు ఏదైనా రచనను తమ ఆలోచనా పరిధిలోకి తెచ్చుకుని తమ వైన ప్రత్యేకమైన సాహితీ విలువల తూకపురాళ్ళతో దాని నాణ్యతను నిర్ణ యిస్తారు. దేశ విదేశీ సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువుకున్న పాఠకుల అభి ప్రాయాలను విమర్శగా భావించవచ్చు గానీ సాధారణ పాఠకుల సమీక్షనూ, అభిప్రాయాన్నీ విమర్శగా చూడడం సరికాదనుకుంటాను. ఇక ప్రొఫెషనల్ క్రిటిక్స్ చూపు కేవలం రచన ఉపరితలం వద్దే ఆగిపోకుండా మరికాస్త ముందుకెళ్ళి భాష, వ్యాకరణం, శిల్పం, భావం ఇలా నలుదిశలా ప్రసరిస్తూ రచన నాణ్యతను అంచనా వేస్తుంది. అటువంటి విమర్శకులు దొరికిన రచయితలు అదృష్టవంతులు. కానీ ప్రస్తుతం మనకు మొక్కుబడి సమీక్షలే ఉన్నాయి తప్ప నిక్కమైన విమర్శ లేదు. కమ్యూనిజం, మార్క్సిజం, మానవ పరిణామ క్రమం, చరిత్ర, గ్రీకు, రోమన్, భారతీయ పురాణాల వంటి విషయాల్లో కనీస ప్రాథమిక అవగాహన లేనివారు విమర్శకు పూనుకోకూడదనుకుంటాను.
‘ప్రపంచ సాహిత్య వ్యాసాలు’ అన్న టాగ్‌లైన్‌తో వచ్చిన మీ తొలి పుస్తకం ‘ధీ’ కూర్పులో ఎటువంటి క్రమాన్ని పాటించారు?
‘ధీ’లో ముప్ఫై వ్యాసాలు సుమారు పదేళ్ళ కాలంలో వివిధ సమ యాల్లో బ్లాగులో, పత్రికల్లో రాసిన సుమారు మూడు వందల వ్యాసాల నుండి గ్రహించినవి. ప్రపంచ సాహిత్యం ప్రాతిపదికగా ఎంపిక చేసిన వ్యాసాలు కాబట్టి ఈ రచనలో భారతీయ సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు లేవు. మొదటి పుస్తకం కావడంతో- బాగున్నాయి అనిపించిన కొన్ని వ్యాసాల్ని ఎంపిక చేశామే కానీ ఒక క్రమం అంటూ ప్రత్యేకంగా ఏమీ పాటించలేదు. ‘కాగ్నిటివ్ రీడింగ్’ను ఇష్టపడే పాఠకురాలిని కాబట్టి సహజంగానే ఇందులోని వ్యాసాలు తర్కం, హేతుబద్ధతకు పనిపెడతాయి. ఈ కారణంగా మరీ పాఠం చెప్పినట్లు ఉండకుండానూ, అదే సమయంలో పాఠకుల మెదడు మీద వత్తిడి లేకుండానూ మధ్య మధ్యలో ఒక సరళమైన వాస్తవిక సాహిత్యానికి సంబంధించిన వ్యాసం, వెనువెంటనే ఒక చిక్కనైన తర్కానికి సంబం ధించిన వ్యాసం వచ్చే పద్ధతిలో ఇందులోని వ్యాసాల్ని పొందుపరిచాము.
ప్రపంచ సాహిత్య విమర్శకి, తెలుగు సాహిత్య విమర్శకి మధ్య మీరు గ్రహించిన అంతరాలు?
సహజంగానే ప్రపంచ సాహిత్యం కాన్వాసు చాలా పెద్దది. నేను గమనించినంతలో తెలుగు సాహిత్య విమర్శలో భాషా సౌందర్యాలకు, పద గాంభీర్యాలకూ పెద్దపీట వేస్తారు. తెలుగు సాహిత్యంలో భాష, వ్యాకరణాల విషయంలో తీసుకునే శ్రద్ధ భావం విషయంలో కనబడదు. అదే సమయంలో ఇతర భారతీయ భాషల సాహిత్యంలో సైతం రచనలో సాంస్కృతిక అంశాలకు ఇచ్చే ప్రాధాన్యత తెలుగులో బహు అరుదుగా కనిపిస్తుంది. కథల్లోని పాత్రలను అన్ని అస్తిత్వ చిహ్నాలకూ దూరంగా మొండి గోడల్లా నిలబెట్టే ప్రయత్నం తెలుగు సాహిత్యంలో ఈ మధ్య అధికంగా కనబడుతోంది. మంచో, చెడో- మనిషికున్న చరిత్రను, సంస్కృతినీ, అన్ని అస్తిత్వ చిహ్నాలనూ సమూలంగా తుడిచేశాక ఇక చెప్పుకోడానికి మనకి కథలేం మిగులుతాయి! విమర్శకైనా ఆస్కారం ఏముంటుంది! ఇటువంటి రచనల మీద విమర్శ చెయ్యాలంటే భాష మీద పట్టు ఉంటే సరిపోతుంది. విమర్శకు వారికి ఇతరత్రా అర్హతలు ఏమీ ఉండవలసిన అవసరం లేదు. ఏదేమైనా మినహా యింపులు ఇక్కడ కూడా ఉన్నాయి. సింహభాగం తెలుగు సాహిత్యం గురించి మాత్రమే చెబుతున్నాను. అందువల్ల లోతులేని ఈ కాలపు సాహిత్యానికి తగ్గట్టే విమర్శ కూడా బలహీనంగానే ఉంటోంది. విమ ర్శకులు కూడా రచనల్లో ఏం చెప్పాలనుకున్నారు అన్నదాని కంటే భాషా ప్రావీణ్యం పైన మాత్రమే ఎక్కువ దృష్టిపెడుతున్నట్లు అనిపిస్తుంది. రచనల్లో భాష, భావం విషయంలో ఇక్కడ సమతూకం శూన్యం.
మీ విమర్శని నడిపే చూపు గురించి చెప్పండి?
నావన్నీ పఠనానుభవాలే, విమర్శ అనుకోను. దానికి నేను ఎంచుకునే పుస్తకాలు కూడా కొంత కారణం. సద్విమర్శకు మరికొన్ని అదనపు అర్హతలు అవసరమవుతాయి. ఉదాహరణకు నేను ఏదైనా రచన చదువు తున్నప్పుడు నా దృష్టి రచయిత చెప్పాలనుకుంటున్న దేమిటో వినాలనే కుతూహలం దగ్గరే ఆగిపోతుంది. రచనలో శైలీ, శిల్పం వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తూ చదివే అలవాటు నాకు లేదు. చదువుతున్నప్పుడు ఆ రచన నన్ను ఆలోచింపజేసిందా లేదా అన్నదే నాకు ముఖ్యం. మేధ విషయంలో విమర్శకులు రచయిత కంటే పై స్థాయిలో ఉండాలి. నేను చదివే రచయితల వద్ద నేనిప్పటికీ విద్యార్థినే.
వ్యాస నిర్మాణానికి భాషా పరంగా ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారు?
బాల్యంలో మూడు భాషలు సమాంతరంగా మాట్లాడే వాతావరణం నుండి వచ్చినదాన్నిగా నా భాషలో యాసతోబాటు కొన్ని సాంస్కృతిక పరమైన వైరుధ్యాలు కూడా సహజంగానే వచ్చి చేరాయి. మా ముందు తరం వాళ్ళకు భిన్నంగా మా తరం వాడుక భాషలో అచ్చ తెలుగు అరుదుగానే కనిపిస్తుంది. వాడుక భాషలోనూ, రాయడంలోనూ కూడా విరివిగా ఆంగ్లపదాల వాడకం మా తరంలో చాలా సహజం. పదేళ్ళ క్రితం నా భాషలో ఆంగ్ల, హిందీ పదాలు అనేకం దొర్లేవి. కానీ తెలుగులో తరచూ రాయడం వల్ల క్రమేపీ ఆ అలవాటు తగ్గింది. ఇప్పుడా సమస్య లేదు. అనవసర వర్ణనలకు దూరంగా నా వ్యాసాల్లో సరళమైన భాషకు ప్రాముఖ్యతనిస్తాను.
ఇంటర్వ్యూ : కె.ఎన్. మల్లీశ్వరి
Updated Date - 2023-08-28T00:38:08+05:30 IST